ప్రధానమంత్రి మోదీ రామగుండం పర్యటనను అడ్డుకుని తీరుతామని జాతీయ కార్మిక సంఘాలైన ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎన్‌టీయూసీ నాయకులు స్పష్టం చేశారు. సింగరేణి ప్రైవేటీకరణ చేసేందుకు కుట్రపన్నుతున్న మోదీ కార్మిక వ్యతిరేక విధానాలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఈరోజు గోదావరిఖనిలో కార్మిక సంఘాల నాయులు మీడియాతో మాట్లాడుతూ… రామగుండం ఎరువుల కర్మాగారం (RFCL) ప్రారంభోత్సవానికి వస్తున్న మోదీని అడ్డుకొని నిరసన తెలుపుతామని స్పష్టం చేశారు. ఏడాది క్రితమే ఉత్పత్తిని ఆరంభించిన రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ఇప్పుడు ప్రారంభించడం ఏమిటని ప్రశ్నించారు. బొగ్గు పరిశ్రమను, సింగరేణి, ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకోవాలంటే ప్రధానికి నిరసన సెగ తగలాల్సిన అవసరం ఉందన్నారు. అంతకుముందు గోదావరి ఖనిలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. కాగా ప్రధాని మోదీ రామగుండం పర్యటన పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతున్నది. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్న మోదీ.. ఈ నెల 12న రానుండటంతో కార్మికలోకం భగ్గుమంటున్నది. మరోవైపు యూనివర్సిటీ ఉద్యోగాల భర్తీ బిల్లును ఉద్దేశపూర్వకంగా కేంద్రం పెండింగ్ లో పెట్టిన కారణంగా ప్రధాని పర్యటనను అడ్డుకుంటామని ఓయూ జాక్ ప్రకటించింది.
