mt_logo

చైనా కంపెనీతో రెండు ఎంవోయూలు కుదుర్చుకున్న రాష్ట్రప్రభుత్వం..

చైనాకు చెందిన శానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్రతినిధులతో శుక్రవారం సాయంత్రం ఫలక్ నుమా పాలస్ లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సమావేశమయ్యారు. తెలంగాణలో డ్రైపోర్టు ఏర్పాటు చేసేందుకు, ప్రీ ఫ్యాబ్ కాంక్రీట్ మాన్యుఫాక్చరింగ్ ఫ్యాక్టరీ స్థాపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, శానీ గ్రూప్ కు మధ్య రెండు ఎంవోయూలు కుదిరాయి. డ్రైపోర్ట్ ఎంవోయూపై రాష్ట్ర పరిశ్రమల శాఖ ఇన్చార్జి కార్యదర్శి జయేష్ రంజన్, పోర్ట్ ఆఫ్ శానీ హెవీ ఇండస్ట్రీ చైర్మన్ లియాన్ వెన్ జెన్ సంతకాలు చేశారు. నిర్మాణాలకు ఉపయోగించే ప్రీ ఫ్యాబ్రికేటెడ్ కాంక్రీట్ మాన్యుఫాక్చరింగ్ ఫ్యాక్టరీ స్థాపనకు సంబంధించిన ఎంవోయూపై తెలంగాణ గృహనిర్మాణ శాఖ కార్యదర్శి దాన కిషోర్, శానీ ఇంటర్నేషనల్ హౌజింగ్ కార్యదర్శి హైజెన్ డెంగ్ సంతకాలు చేశారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖామంత్రి జూపల్లి కృష్ణారావు, ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్, ఐటీ, పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్, గృహనిర్మాణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, విద్యుత్ శాఖామంత్రి జగదీష్ రెడ్డి, అన్ని శాఖలకు చెందిన ముఖ్య కార్యదర్శులు, డీజీపీ అనురాగ్ శర్మ, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ తాము చైనా పర్యటనకు వెళ్ళినప్పుడు శానీ గ్రూప్ వారు ఎంతో ఆదరణ చూపారని, తాము ఎక్కడికి వెళ్ళినా ఇదే ఆదరణ లభించిందని గుర్తుచేశారు. తన ఆహ్వానం మన్నించి చైనా నుండి ఎంతో ఆసక్తితో ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన శానీ గ్రూప్ కు కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో అన్ని రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు నిర్మించబోతున్నదని చెప్పారు. పేదల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు చేపడుతున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణానికి సాంకేతిక సహకారం అందించాలని సీఎం కోరారు. రాష్ట్రంలో మంచి పారిశ్రామిక విధానం ఉన్నదని, అవినీతి రహిత పాలన ఉందని చైనా ప్రతినిధులకు వివరించారు. బొగ్గు ఉత్పత్తి, భూగర్భ ఖనిజవనరులు, విద్యుత్ రంగంతో పాటు ఇతర రంగాల్లో పుష్కలమైన వనరులున్నాయని, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురావాలని శానీ గ్రూప్ కు సీఎం కేసీఆర్ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *