తెలంగాణ బిల్లుపై చర్చ మొదలైందని స్పీకర్ నాదెండ్ల మనోహర్ సోమవారం స్పష్టం చేశారు. బిల్లుపై చర్చ ఇంకా మొదలు కాలేదని సీఎం, సీమాంధ్ర నేతలు వాదిస్తున్న తరుణంలో స్పీకర్ చెప్పిన మాటలు అన్ని పార్టీల టీ నేతలకు సంతృప్తినిచ్చాయి. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ చర్చ ప్రారంభమైందా? లేదా? అన్న ప్రశ్నకు బిల్లుపై చర్చ మొదలైందని, చర్చలో పాల్గొనలేని వారు ఎవరి అభిప్రాయాలు వారు రాతపూర్వకంగా అందించవచ్చని, సవరణలు కూడా ప్రతిపాదించవచ్చని తెలిపారు. ఈ నెల 10లోపు సభ్యులందరికీ లిఖితపూర్వక ఫార్మాట్లు ఇస్తామని, వాటిని పూర్తి చేసి జనవరి 10 వ తేదీ మధ్యాహ్నం లోపు తనకు అందజేయాలని, వాటిని పరిశీలించి రాత పూర్వక ఫార్మాట్ లే సభ్యుల అభిప్రాయాలుగా రాష్ట్రపతికి పంపిస్తామని స్పీకర్ స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో సభ జరిగినా, జరగకపోయినా వాటినే పరిగణనలోకి తీసుకుంటామని కూడా స్పీకర్ స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా సోమవారం అసెంబ్లీ సమావేశం వాయిదా పడినతర్వాత స్పీకర్ బీఏసీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానం ప్రవేశబెట్టాలని, లేకపోతే తాము చర్చకు ఒప్పుకోమని పట్టుబట్టింది. టీఆర్ఎస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ సభ్యులు చర్చ జరగాలని వాదించారు. టీడీపీ సభ్యులు ఎప్పటిలాగే తలా ఒక మాట మాట్లాడారు. వారిలో వారికే స్పష్టం లేకపోవడంతో ఎటూ తేల్చుకోలేక తమ నాయకుడ్ని సంప్రదించి వస్తామని వెళ్ళిపోయారు. మధ్యాహ్నానికి కూడా టీడీపీ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సభను స్పీకర్ గంట సేపు వాయిదా వేశారు. మళ్ళీ ప్రారంభమైన సభ చర్చకు అనుకూల వాతావరణం లేకపోవడంతో మంగళవారానికి వాయిదా పడింది.
శాసన సభ సమావేశాల తేదీల్లో కొద్దిగా మార్పులు జరిగాయి. అంతకుముందు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం జనవరి 10 వరకు సభ నడుస్తుంది. తర్వాత 16నుండి మొదలై 23వరకు జరగాలి. కాగా కొత్త షెడ్యూల్ ప్రకారం 17నుండి మొదలై 18, 20, 21, 22, 23 తేదీలలో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.