కేంద్ర ప్రభుత్వం వద్ద ఎవరికీ కేటాయించకుండా ఉన్న 693 మెగావాట్ల విద్యుత్ తెలంగాణ రాష్ట్రానికి దక్కనుంది. ఏప్రిల్ నుండి సెప్టెంబర్ దాకా 222 మెగావాట్లు, అక్టోబర్ నుండి మార్చి దాకా 374 మెగావాట్లు కేటాయిస్తూ కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విద్యుత్ సరఫరా చేయాలని బెంగళూరులోని సదరన్ రీజినల్ పవర్ కార్పొరేషన్ ను సోమవారం ఆదేశించింది. ఇన్నాళ్ళూ ఢిల్లీ ప్రభుత్వం వినియోగించుకుంటూ ఉన్న 693 మెగావాట్ల విద్యుత్ ను ఇటీవలే వెనక్కు ఇచ్చేయడంతో కేంద్రం వద్ద మిగులు విద్యుత్ ఉంది. ఈ విద్యుత్తును తెలంగాణ, ఏపీ, కేరళ రాష్ట్రాలకు కేటాయించినా తెలంగాణకే అత్యధిక వాటా దక్కడం గమనార్హం.
తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర కోటా నుండి విద్యుత్ అందజేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి, ఇంధన శాఖకు చాలా రోజులనుండి రాష్ట్ర ప్రభుత్వం లేఖలు రాస్తూనే ఉంది. అంతేకాకుండా గత నెలలో కూడా రాష్ట్రానికి కనీసం 500 మెగావాట్ల విద్యుత్ ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రధాని మోడీకి లేఖ రాశారు. మరోవైపు టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించిన విషయం తెలిసిందే. హర్యానాలోని ఝార్లీలో ఉన్న ఇందిరాగాంధీ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ నుండి, ఇదే జిల్లాలోని జఝ్జార్ లోని ఆరావళి పవర్ కంపెనీ నుండి ఈ విద్యుత్ అందనుంది. ఏప్రిల్ 1 వ తేదీనుండి ఈ విద్యుత్ ను సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యుత్ అథారిటీకి కూడా ఇంధన మంత్రిత్వ శాఖ లేఖ రాసింది.