మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ములుగు మండలంలో 500 ఎకరాల్లో ఫారెస్ట్ కాలేజీ ఏర్పాటు చేయనున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రకటించారు. సోమవారం మధ్యాహ్నం అటవీ శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం రాష్ట్రంలోని రిజర్వు ఫారెస్ట్ అంతా పచ్చని చెట్లతో కళకళలాడాలని, ప్రతి అంగుళం ఆటవీభూమిని సమర్ధవంతంగా కాపాడుకోవాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో లక్షల ఎకరాల అటవీ భూములున్నాయని, పేరుకు అటవీ భూములు అయినా అందులో అడవే లేదని సీఎం అన్నారు. రిజర్వు ఫారెస్ట్ భూముల్లో మొక్కలు విరివిగా పెంచాలని, రాష్ట్రం అంతటా పచ్చదనంతో కళకళలాడాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో హరితహారం కార్యక్రమం కింద నిధులు విడుదల చేస్తామని, గజ్వేల్ నియోజకవర్గంలో 34 వేల ఎకరాల అటవీభూమి ఉందని, దాని చుట్టూ కందకం తవ్వి గచ్చకాయల తీగలతో కంచె వేయాలని కేసీఆర్ సూచించారు. పండ్లు, పూల మొక్కలతో పాటు ఔషధ మొక్కల పెంపకానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, దీనివల్ల గ్రామాల్లో దోమలు రాకుండా ఔషధ మొక్కలు ఉపయోగపడుతాయని సీఎం పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎస్ నర్సింగరావు, అటవీశాఖ ఓఎస్డీ ప్రియాంక వర్గిస్, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి రాజేష్ తివారీ తదితరులు పాల్గొన్నారు.