mt_logo

అడవి, నీరు, మనిషి..

By: కట్టా శేఖర్‌రెడ్డి

విదర్భ కరువు కాటకాలతో విలవిలలాడుతున్నది. అదే విదర్భ ప్రాంతంలోని గడ్చిరోలి జిల్లా అపారమైన వర్షాలతో అలరారుతున్నది. ఇటు ప్రాణహితను, అటు ఇంద్రావతి నదులను జీవనదులుగా మార్చుతున్నది గడ్చిరోలి, అబూజ్‌మడ్ అడవులే. ఎంతో దూరం ఎందుకు? ఆదిలాబాద్, వరంగల్లు, ఖమ్మం జిల్లాల్లో ఎందుకు ముందుగా వర్షాలు పడుతున్నాయి? అక్కడ ఇంకా అడవులు ఎంతో కొంత మిగిలిఉన్నాయి కాబట్టి. ఇదే సూత్రాన్ని తెలంగాణ అంతటికీ విస్తరించలేమా?

ఒకప్పుడు ప్రతి ఊరికీ అడవి ఉండేది. దట్టమైన కంచెలు ఉండేవి. బీళ్లు, బంజర్లు ఉండేవి. చింతల తోపులు ఉండేవి. వేప వనాలు ఉండేవి. మర్రి, జువ్వి మహా వృక్షాలు ఉండేవి. సెలవులు వచ్చాయంటే పిల్లలంతా ఆ చెట్ల చుట్టూ చేరి ఆటాపాట చేస్తుండేవారు. దాగుడు మూతలు. కోతి కొమ్మచ్చి ఆడేవాళ్లు. చెట్ల నీడలోనీ కబడ్డీ, జిల్లాగోనె, ఉప్పూ బెర్రా ఆడేవాళ్లు. కుందేళ్ల వేటకు వెళ్లే వాళ్లం. జింకలు కూడా దొరికేవి. చేలకు వెళితే మెకాలు, ఎలుగ్గొడ్లు వస్తాయని మంచెలు వేసుకునేవాళ్లం. వానాకాలం వచ్చిందంటే పది పదిహేను రోజులు ముసురుపట్టి ఉండేది. సూర్యుడు కనిపించేవాడు కాదు. మన్నూమిన్నూ ఏకంచేస్తూ వానలు కురిసేవి. మా ఊరికి పైనొక చెరువు. దిగువ మరో చెరువు. మా పెద్దూరును ఆనుకుని కరణం కుంట ఉండేది. దాని ఎగువన మార్కండేయ కుంట ఉండేది.

కుంటలు చెరువుల నిండా తుమ్మ వనాలుండేవి. మా ఊరు నుంచి పెద్దూరు బడికి వెళుతుంటే కిలోమీటరు దూరం పొలాలమీదుగా ఎటుచూసినా నీళ్లు ప్రవహిస్తుండేవి. ఊరు వీధుల్లో చేపలు పట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడవన్నీ మాయమయ్యాయి-ఇవన్నీ ఒకప్పటి జ్ఞాపకాలుగా చెబుతారు పెద్దవాళ్లు. మనుషులు పెరుగుతున్నారు. కుటుంబాలు పెరుగుతున్నాయి. కమతాలు పెరుగుతున్నాయి. కంచెలు, బంజర్లు, బీళ్లు సాగులోకి వచ్చేశాయి. బావులు ఎండుతున్నాయి. బోర్లు వచ్చేశాయి. ఎటు చూసినా చెట్టు అన్నది కనిపించని పరిస్థితి వచ్చేసింది. మనం కూర్చున్న కొమ్మను మనమే నరికేసుకుంటున్నామని ఎప్పటికోగానీ తెలియడం లేదు. వర్షం ఎలా కురుస్తుందో మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నదే.

కానీ లెక్క చేయం. సూర్యతాపంతో సముద్ర జలాలు వేడెక్కి ఆవిరిగా మారి గగనతలానికి చేరుతాయని, అవి ఘనీభవించి మేఘాలుగా మారతాయని, అవి పవనాలు, పీడనాల ధాటికి భూతలంపైకి కొట్టుకువస్తాయని, ఎక్కడ వనాలు ఉండి తేలిక గాలులు మేఘాలను తాకి ద్రవింపజేస్తాయో అక్కడ వర్షం కురుస్తుందని సైన్సు పాఠాల్లో చదువుకున్నాం. కానీ భూమిపై వనాలు లేకుండా చేస్తున్నాం. వానలు రాకుండా చూస్తున్నాం. అంతా మన చేతిలోనే ఉంది. నిర్మాణమైనా, విధ్వంసమైనా మనమే చేసుకుంటున్నాం. చెట్టు పెంచాలంటే నీరు కావాలి కదా? ఎక్కడి నుంచి తెస్తాం? అని ఇప్పుడు ప్రశ్నిస్తున్నాం. నీరు కావాలంటే చెట్టు పెరగాలి కదా అని ఆలోచించడం లేదు. ఉన్న చెట్లను కాపాడాలి కదా అని ఆలోచించడం లేదు. నిజమే బతకడమే కష్టమైన పరిస్థితుల్లో చెట్టు పెంచడం ఎలా అని కొందరు మాట్లాడతారు.

కానీ పర్యావరణ వేత్తలు చెబుతున్నదాని ప్రకారం ఇప్పటికీ చెట్టును ప్రేమగా చూసుకుంటున్నది కూడా బతుకు పోరాటం చేస్తున్నవాళ్లే. చెట్లను నరికి, కలప వ్యాపారం చేసేవాళ్లలోనూ పేదవాళ్లు ఉండవచ్చు. కానీ జనాభాలో వారి సంఖ్య ఎంత? ప్రధానంగా అడవులకు ముప్పు వస్తున్నది నాయకులుగా అవతరిస్తున్న స్మగ్లర్ల నుంచి. ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల నుంచి టేకు కలపను కొట్టుకొచ్చి హైదరాబాద్‌లో అమ్మిన ముఠాల గురించి అందరికీ తెలుసు. వారి జోలికి వెళితే ప్రాణాలు తీసే వారని అందరూ భయపడేవారు.

ఇప్పటికీ అటువంటి కలప స్మగ్లింగ్ ముఠాలు గోదావరికి ఇరువైపులా పనిచేస్తున్నాయని అప్పుడప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఫారెస్టు అధికారిని హత్య చేయడం నిన్నగాకమొన్న నిజామాబాద్ జిల్లాలో కూడా చూశాం. ఇక ఫారెస్టు అధికారులపై దాడులయితే చాలానే జరుగుతున్నాయి. అటవీ శాఖ అడవుల రక్షణ బాధ్యతను వదిలేసి కేవలం కాపలా బాధ్యతకు పరిమితమై చాలా కాలమైంది. కొన్ని సార్లు వాళ్లు కూడా నేరంలో భాగస్వాములవుతున్నారు. ముందుగా ఇక్కడే చర్యలు ప్రారంభించాల్సి ఉంది.

అందమైన నగరాలు నిర్మిస్తాం. అద్భుతమైన మహాసౌధాలు నిర్మిస్తాం. కానీ అక్కడ గాలి పీల్చుకోవడం కష్టమై, ముక్కులకు ఆక్సీజను తొడుగులు తగిలించుకుని తిరగాల్సిన పరిస్థితి వస్తే ఎలా ఉంటుంది? రోజుకోసారి ఆక్సీజను లాబ్సును సందర్శించి ఒంటికి అవసరమైన ఆక్సీజను పీల్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తితే ఎలా ఉంటుంది? అభివృద్ధికి నమూనాలుగా చెప్పుకునే నగరాల్లో బ్యాంకాక్ ఒకటి. సెంట్రల్ బ్యాంకాక్‌లో ఎటు చూసినా మహాసౌధాలు కనిపిస్తాయి. పదీ ఇరవై ఎకరాల్లో పెద్ద పెద్ద మాల్సు కనిపిస్తాయి. కానీ అక్కడ వీధుల్లో గంటసేపు తిరిగితే ఊపిరి సలుపదు. గాలి ఆడదు.

ఎప్పడు ఏసీ హోటళ్లలో దూరిపోదామా అనిపిస్తుంది. ఎక్కడా బ్రీతింగ్ స్పేస్ లేదు. నలభై యాభై అంతస్తుల మహాసౌధాల నిండ సెంట్రలైజ్డు ఏసీలు మార్మోగిపోతుంటాయి. వాటి నుంచి వెలువడే విసర్జిత వాయువులన్నీ సెంట్రలు బ్యాంకాక్ వీధులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. అయినా అక్కడ జనం జీవిస్తూనే ఉన్నారు. నాలుగు రోజులు ఉన్న పర్యాటకులకే ఇలా అనిపిస్తే అక్కడ రోజూ జీవించే వారి పరిస్థితి ఏమిటి? అలవాటు పడిపోయాం. చిన్నవాళ్లం ఏం చేయగలం అని ఒక ఫుట్‌పాత్ వ్యాపారి సమాధానమిచ్చారు. గొప్పగా జీవించడం అంటే పెద్దపెద్ద భవంతుల్లో ఏసీల మధ్య, బెంజికార్ల మధ్య, కృత్రిమ గడ్డి మైదానాలపై జీవించడం కాదు. దట్టమైన నాలుగు చెట్లమధ్య, చల్లగాలుల మధ్య నివసించడం అని ఎప్పటికి తెలుసుకుంటాం? అభివృద్ధికి ఒక పార్శం విధ్వంసం. మరో పార్శం అద్భుతమైన సౌకర్యాలు, సాధనాలు అందుబాటులోకి రావడం.

ఇల్లు మాత్రమే కట్టుకుంటే అభివృద్ధి. ఇంటితోపాటు నాలుగు చెట్లు పెంచుకుంటే కలకాల మనగలిగే అభివృద్ధి(సస్టెయినెబుల్ డెవలప్‌మెంట్). కంపెనీ మాత్రమే కట్టుకుంటే విధ్వంసకర అభివృద్ధి. కంపెనీతోపాటు ఖాళీ స్థలం నిండా చెట్లు పెంచితే కలకాలం పనికివచ్చే అభివృద్ధి. అడవులు అంతరించిపోవడాన్ని ఒక సమస్యగా, భవిష్యత్ తరాలకు ముప్పుగా గుర్తించడానికి ఇంతకాలం పట్టింది. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు ప్రారంభించిన హరితహారం ఎప్పటిలాగే మొక్కల పెంపకం పథకం అయితే నాలుగేళ్ల తర్వాత తిరిగి వెనుకకు చూస్తే ఏమీ మిగలదు. ఎందుకంటే హైదరాబాద్‌లో మొక్కల పెంపకం పేరుతో గత దశాబ్దకాలంగా నాటుతున్న మొక్కలు ఏమయ్యాయో ఒక్కసారి లెక్కలు తీస్తే మన అధికార యంత్రాంగం గుట్టురట్టవుతుంది.

ఏటా కొన్ని లక్షల మొక్కలు నాటుతున్నట్టు రికార్డుల్లో నమోదవుతున్నాయి. కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు లెక్కలు రాస్తున్నారు. కానీ పచ్చదనం పెరిగిన దాఖాలు కనిపించవు. గతంలో రాజకీయ ప్రయత్నం లేకుండా ఇదంతా జరిగింది. ఇప్పుడు ముఖ్యమంత్రి స్వయంగా సతతం హరితం జీవం మంత్రాన్ని జపిస్తున్నారు. దీనిని విజయవంతం చేయాల్సిన బాధ్యత మొత్తం సమాజంపై ఉన్నది. ఎవరి చెట్టువారు పెంచుకోవాలి. ఎవరి గాలివారు తయారు చేసుకోవాలి.

చెట్టుకు నీటికి విడదీయరాని సంబంధం ఉంది. మేఘాలను వర్షింపజేసేది చెట్టే. ఇప్పుడు ఎక్కడ వర్షాలు కురుస్తున్నాయో ఒక్కసారి గమనించండి. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళల్లో విస్తరించి ఉన్న పశ్చిమ కనుమల్లో అత్యధిక వర్షపాతం నమోదవుతున్నది. మనకు నీళ్లు తీసుకునివచ్చే నదులన్నీ పశ్చిమ కనుమల్లోనే మొదలవుతాయి. పశ్చిమ కనుమలను రక్షించడానికి ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకున్నారు. అక్కడ అడవులు ఇప్పటికీ ఎక్కువగా దెబ్బతినకుండా కాపాడుతున్నారు. పశ్చిమ కనుమలు కూడా మన నల్లగొండ రాచకొండలు, నల్లమల అడవుల్లాగే మారితే పరిస్థితి ఎలా ఉంటుంది? కామారెడ్డి అడవుల్లాగా రోజురోజుకు క్షీణించిపోతే భవిష్యత్తు ఏమవుతుంది? కానీ అడవులు క్షీణించిపోవడం యథేచ్ఛగా జరుగుతున్నది.

విదర్భ కరువు కాటకాలతో విలవిలలాడుతున్నది. అదే విదర్భ ప్రాంతంలోని గడ్చిరోలి జిల్లా అపారమైన వర్షాలతో అలరారుతున్నది. ఇటు ప్రాణహితను, అటు ఇంద్రావతి నదులను జీవనదులుగా మార్చుతున్నది గడ్చిరోలి, అబూజ్‌మడ్ అడవులే. ఎంతో దూరం ఎందుకు? ఆదిలాబాద్, వరంగల్లు, ఖమ్మం జిల్లాల్లో ఎందుకు ముందుగా వర్షాలు పడుతున్నాయి? అక్కడ ఇంకా అడవులు ఎంతో కొంత మిగిలిఉన్నాయి కాబట్టి. ఇదే సూత్రాన్ని తెలంగాణ అంతటికీ విస్తరించలేమా? ఒకప్పుడు గలగలపారిన మూసీనది ఎందుకు ఎండిపోతున్నది? వికారాబాద్ అడవులు ఎందుకు తరిగిపోతున్నాయి? మూసీకి వచ్చే వాగులు వంకలు ఎందుకు మూసుకుపోతున్నాయి? ప్రకృతికి ప్రతిబంధకాలు కల్పించిన ప్రతీ వ్యవస్థ వైపరీత్యాలను ఎదుర్కొంటున్నది.

అనేక దేశాల అనుభవాలు ఇవే చెబుతున్నాయి. గతంలో టార్నెడోలు మనకు లేవు. ఇప్పుడు అకాల వర్షాలు, రాళ్ల వానలు, టార్నెడోలు కూడా విరుచుకుపడుతున్నాయి. చేపలు వానగా కురియడం ఏమిటి? జలాశయాలు, సముద్రాల్లో చెలరేగిన సుడిగుండాలు సుడిమేఘాలుగామారి, అందులోని జీవాలను వడితిప్పి తమతో పాటు కొంతదూరం తీసుకెళ్లి, ఆ తర్వాత చల్లబడి నేలపై వర్షాన్ని కురిపిస్తున్నాయి. అత్యంత ఆధునిక దేశం అని చెప్పుకునే అమెరికా కూడా ఈ ప్రకృతి ఉత్పాతాలను ఎదుర్కొనే మార్గాన్ని కనిపెట్టలేకపోయింది. ప్రకృతి సమతౌల్యాన్ని దెబ్బతీయడం సులువే.

కానీ సమతౌల్యాన్ని కాపాడటమే కష్టం. ఎటువంటి ఉత్పాతానికయినా వనాలను పెంచుకోవడం ఒక్కటే మార్గం. ఇటీవల సుడిగాలి తీవ్రతకు ఒక కంపెనీ కాంపౌండు గోడ కూలిపోయింది. ఇంజనీరును పిలిచి తిరిగి నిర్మించడానికి డిజైను రూపొందించాలని కోరారు కంపెనీవారు. ఆయన డిజైను ఇస్తూ చెప్పిన మాట ఆసక్తిని కలిగించింది. మీరు ఎంత బందోబస్తుగా కట్టినా ఇంత ఖాళీస్థలంలో గోడ నిలువదు. బాగా చెట్లు పెంచండి. ఆ చెట్లు గాలి తీవ్రతను తగ్గిస్తాయి. గోడకు రక్షణ ఉంటుంది అని ఆయన సలహా ఇచ్చారు. చిన్న విషయమే కానీ పెద్ద సందేశం ఉంది. ఒక్క కాంపౌండుకే కాదు, మొత్తం ప్రాంతానికి కూడా చెట్టు ఎలా రక్షణ ఇస్తుందో దీనినిబట్టి అర్థం చేసుకోవచ్చు.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *