mt_logo

పాలమూరు పథకంతో నగరంలో 24 గంటలు మంచినీరు..

ఆదివారం తెలంగాణ భవన్ లో జరిగిన కార్యక్రమంలో టీఆర్ఎస్ సెక్రెటరీ జనరల్, ఎంపీ కే కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన వేలాదిమంది కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలతో కలిసి టీఆర్ఎస్ లో చేరారు. మంత్రులు హరీష్ రావు, నాయిని నర్సింహారెడ్డి, ఎంపీ కేకేలు వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ మీద నిరంతరం కుట్రలకు పాల్పడుతున్నాడని, బాబు ఎన్ని అడ్డంకులు సృష్టించినా అవి కేసీఆర్ ముందు చెల్లవని అన్నారు. కరెంట్ అంశం మీద బాబు పారిశ్రామిక వేత్తలను తప్పుదోవ పట్టించేందుకు విశ్వప్రయత్నాలు చేసినా వారు వాస్తవాలు గమనించి మన రాష్ట్రానికి క్యూ కడుతున్నారని తెలిపారు. 24 గంటల కరెంట్ ఇచ్చినట్లే 24 గంటల పాటు మంచినీళ్ళు ఇవ్వాలని కేసీఆర్ భావిస్తుంటే చంద్రబాబు ఇక్కడే ఉండి పరిపాలన కొనసాగిస్తూ అన్నిటికీ అడ్డు పడుతున్నాడని, కేసీఆర్ హైదరాబాద్ లో అభివృద్ధి చేపడుతుంటే బాబుకు ఇక్కడినుండి వెళ్ళబుద్ధి కావడం లేదని హరీష్ పేర్కొన్నారు.

చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఎండాకాలం సీఎం కేసీఆర్ నిమిషం పాటు కూడా కరెంట్ కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేశారని, మారుమూల ఉన్న ఆదిలాబాద్ జిల్లాలోని గోండుగూడెంలో కూడా 24 గంటల కరెంట్ సరఫరా చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని అన్నారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మాటలు విని తెలంగాణలో ఇక కరెంటే ఉండదని భావించి భారీ ఎత్తున జనరేటర్లు తయారు చేసుకుంటే ఇవాళ వాటి ముఖం చూసే వారే లేకుండా పోయారని ఆబిడ్స్ కు చెందిన ఒక జనరేటర్ల కంపెనీ యజమాని తనతో చెప్పారని, ఇక తెలంగాణలో కరెంట్ కోతలు ఉండవు, తమిళనాడుకు పోయి అమ్ముకో అని తాను చెప్పానని హరీష్ రావు చెప్పారు. పాలమూరు పథకాన్ని పూర్తిచేసి నగరానికి 24 గంటల మంచినీరు అందించి తీరుతామని, నగరంలో లక్షమంది పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు నిర్మిస్తామని, తెలంగాణ ఆడపడుచులకు త్వరలోనే రూ. 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వబోతున్నామని మంత్రి వివరించారు.

ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్ద పీట వేస్తుందని, కళ్యాణలక్ష్మి, ఆరోగ్య లక్ష్మి, షాదీ ముబారక్ వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. స్వచ్ఛ హైదరాబాద్ లో భాగంగా ఎన్బీటీ నగర్, భోళా నగర్, శ్రీరాం నగర్, ఖాజా నగర్ బస్తీలను తాను దత్తత తీసుకున్నానని, ఈ బస్తీలను తన సొంత నియోజకవర్గమైన సిద్దిపేటలా అభివృద్ధి చేస్తానని హరీష్ రావు హామీ ఇచ్చారు. అనంతరం ఎంపీ కేకే మాట్లాడుతూ టీఆర్ఎస్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్ అని, కేసీఆర్ పోరాటంతోనే తెలంగాణ వచ్చిందని అన్నారు. విజయలక్ష్మి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ వరాలిచ్చే దేవుడని, ఆయన నాయకత్వంలో బంజారాహిల్స్ ను బంగారు బంజారాహిల్స్ గా తయారు చేసుకుందామని చెప్పారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, టీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు మైనంపల్లి హన్మంతరావు, టీఆర్ఎస్ నాయకులు మన్నె గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *