ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబుకు ఉచ్చు బిగుస్తుంది. ఇప్పటికే ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ ఆడియోలో ఉన్నది బాబు గొంతేనని, ఫోన్ ట్యాపింగ్ కాదు రికార్డేనని, కట్ అండ్ పేస్ట్ లు లేవని వచ్చిన రిపోర్టును ఏసీబీ ప్రత్యేక కోర్టుకు రెండురోజుల క్రితం అందజేసింది. మరోవైపు ఎలక్షన్ కమిషన్ కూడా ఈ విషయంపై గతంలో సీరియస్ అయిన విషయం తెలిసిందే! ఈ కేసుకు సంబంధించిన ఆడియో, వీడియో టేపులు తమకు కూడా కావాలంటూ గురువారం ఏసీబీ ప్రత్యేక కోర్టులో మెమో దాఖలు చేసింది. ఎన్నికల చట్టాల ఆధారంగా ఈ కేసుపై చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమవుతోంది.
ఓటుకు నోటు కేసులో కీలకమైన ఫోరెన్సిక్ నివేదిక ఏసీబీ ప్రత్యేక కోర్టుకు చేరడంతో ఏసీబీ దూకుడు పెంచింది. నివేదిక ఆధారంగా నోటీసుల జారీ, అరెస్టులకు రంగం సిద్ధం చేసుకుంటుంది. ఈ కేసులో కీలకంగా భావిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గడువులోపు విచారణకు రాకపోతే అరెస్టు చేయాలని అధికారులు భావిస్తున్నారని సమాచారం. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వేం నరేందర్ రెడ్డిని కూడా అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని ఏసీబీ వర్గాలు తెలిపాయి.