తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పై ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రశంసల జల్లు కురిపించారు. స్మార్ట్ సిటీ, అమృత్, అందరికీ ఇళ్ళ పథకాలను ప్రధాని మోడీ గురువారం ఢిల్లీలో ప్రారంభించారు. విజ్ఞాన్ భవన్ ఆవరణలో హైదరాబాద్ నగరం తరపున ఏర్పాటుచేసిన స్టాల్ ను సందర్శించిన ప్రధాని నగర చరిత్ర, ఔన్నత్యాలను ప్రతిబింబిస్తూ ఏర్పాటుచేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను ఆసక్తిగా తిలకించారు. నగర అభివృద్ధి కోసం రూపొందించిన వివిధ పథకాలను, ఆస్తిపన్ను వసూళ్ళ అంశాన్ని, ప్రపంచస్థాయిలో నగరానికున్న బ్రాండ్ ఇమేజ్ ను జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ ఈ సందర్భంగా మోడీకి వివరించారు. ఇది విన్న ప్రధాని ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఇదే రకమైన ఫలితాలను అన్నింటా సాధించాలని సూచించారు.
స్మార్ట్ సిటీస్ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ, కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంలో ఒక్క పైసా పన్ను కూడా పెంచకుండానే వివిధ ప్రోత్సాహకాలను ప్రకటించి అధికస్థాయిలో ఆస్తి పన్ను వసూలు చేశారని, ఈ విధానాన్ని ఇతర నగరాల్లో కూడా ఆచరణలో పెట్టాలని సూచించారు. హైదరాబాద్ లో ఇంతటి ప్రగతి సాధ్యమైనప్పుడు దేశంలోని మిగతా నగరాల్లో ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు. హైదరాబాద్ ను మిగతా నగరాలు కూడా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. ఇదిలాఉండగా తెలంగాణ రాష్ట్రం నుండి స్మార్ట్ సిటీల పథకానికి రెండు నగరాలు, అమృత్ పథకం కింద 15 పట్టణాలు ఎంపికయ్యాయి. ఈ కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి, పలువురు మున్సిపాలిటీల చైర్ పర్సన్లు, కమిషనర్లు, జిల్లా కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.