ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేతలకు ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ కుట్రలో భాగస్వామ్యులైన పలువురిని అరెస్టు చేయనున్న నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) ఒక్కొక్కరికి నోటీసులివ్వడం ప్రారంభించింది. తొలుత మంగళవారం రాత్రి టీడీపీకి చెందిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు సీఆర్ పీసీ సెక్షన్ 160 కింద నోటీసులు అందజేశారు. ఆ నోటీసులో విచారణకు హాజరు కావాలని అధికారులు సండ్రను ఆదేశించారు. అనంతరం టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన వేం నరేందర్ రెడ్డి ఇంటికి వెళ్ళిన ఏసీబీ అధికారులు నోటీసులు అందజేసి ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. తాను గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నానని నరేందర్ రెడ్డి చెప్పడంతో బుధవారం ఉదయం ఏసీబీ విచారణకు హాజరు కావాలని వారు ఆదేశించారు.
ఇదిలాఉండగా ఓటుకు నోటు కేసులో పకడ్బందీ ఆధారాలు సేకరించిన ఏసీబీ అధికారులు ఏ క్షణంలోనైనా ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి సుజనాచౌదరి, ఎంపీలు గరికపాటి రామ్మోహన్ రావు, సీఎం రమేష్ లకు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలిసింది. అంతేకాకుండా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు నగరం విడిచి వెళ్ళకుండా అత్యంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో పాటు దేశంలోని అన్ని విమానాశ్రయాలకు లుక్ అవుట్ నోటీసులు పంపేందుకు రంగం సిద్ధమైందని సమాచారం. అయితే తెలంగాణ ఏసీబీ అధికారులు తనకు నోటీసులు ఇస్తే తీసుకునే ప్రసక్తే లేదని ఏపీ సీఎం చంద్రబాబు మొండిపట్టుదలకు పోయారని, నోటీసులు వస్తే ఏం చేయాలి? వారు నాకు ఎలా నోటీసులు ఇస్తారు? అని తనతో సమావేశమైన పోలీసు అధికారులతో అన్నట్లు తెలిసింది.
ఓటుకు నోటు కేసులో బయటపడిన అనేక అంశాలకు సంబంధించి తాజా పరిణామాలు తెలుసుకోవడానికి కేంద్ర హోం శాఖ నుండి ఇద్దరు అధికారులు బుధవారం రాజ్ భవన్ లో గవర్నర్ తో సమావేశం కానున్నారని తెలిసింది. మరోవైపు ఓటుకు నోటు కేసులో ఫిర్యాదుదారుడైన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ వాంగ్మూలాన్ని బుధవారం ఏసీబీ అధికారులు రికార్డు చేయనున్నారు.