mt_logo

తెలంగాణ వ్యతిరేక పార్టీలను భస్మం చేయాలె

ఫొటో : రణభేరి సభకు హాజరైన విద్యార్ధుల్లో ఒక భాగం

తెలంగాణ సాధన కొరకు ఏబీవీపీ నిర్వహించిన ‘విద్యార్థి మహాపాదయాత్ర’ ముగింపు సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ‘రణభేరి’ పేరుతో భారీ బహిరంగసభ నిర్వహించారు. తెలంగాణ వ్యతిరేక పార్టీలను మూడో కన్ను తెరిచి కాల్చివేయాలని ఈ సభ పిలుపునిచ్చింది. ఈ సభకు ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్, తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్దన్‌రెడ్డి, ఇంకా ఇతర నేతలు మాట్లాడారు.

ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ వ్యతిరేక పార్టీలైన కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, టీడీపీపై తెలంగాణ ఉద్యమకారులు మూడో కన్ను తెరిచి, వాటిని భస్మం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమం చల్లబడిందంటూ సమైక్యవాదులు చేస్తున్న వాదననలను కిషన్‌రెడ్డి తిప్పికొట్టారు. అవసరమైన సమయంలో తెలంగాణ ఉద్యమం పెనుతుఫాను.. ఉప్పెనలా విరుచుకుపడుతుందన్నారు. ఆ తుఫానులో కిరణ్‌బాబు, చంద్రబాబు, జగన్‌ కొట్టుకుపోతారని హెచ్చరించారు.

అఖిలపక్షానికి ముందే సోనియాగాంధీ తన వైఖరి విల్లడించాలని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి, పార్లమెంట్‌పై గౌరవం ఉంటే ప్రస్తుత సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఆ బిల్లును ఆమోదింపజేసే బాధ్యత తమపార్టీ తీసుకుంటుందని ఆయన తెలిపారు.

తెలంగాణ యువత ఆత్మహత్యలు చేసుకోవద్దని వద్దని, బరిగీసి తెలంగాణ కోసం కొట్లాడుదామని ఆయన పిలుపునిచ్చారు. ఎంత మంది ఆత్మహత్య చేసుకున్నా.. ఇటలీ మనసున్న సోనియా కరుగదని అన్నారు.

తెలంగాణపై ఏకాభిభిప్రాయం రావాలంటూ చేస్తున్న వాదనలపై ఆయన మండిపడ్డారు. దేశప్రయోజనాలను తాకట్టు పెట్టే ఎఫ్‌డీఐపై ఏకాభిప్రాయయం లేకున్నా, ఆమోదించిన మీరు.. తెలంగాణ విషయంలో ఏకాభిప్రాయయం అనడమేమిటని ఆయన ప్రశ్నించారు.

పదవి కోసం ఆశతో పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు సీఎం అయ్యేది తెలంగాణకా? సీమాంధ్రకా? అని ఆయన ప్రశ్నించారు.

తెలంగాణకు వ్యతిరేకం కాదంటున్న షర్మిలకు తెలంగాణ కోసం జరుగుతున్న బలిదానాల గురించి ఏం తెలుసంటూ నిలదీశారు. ప్రత్యేకరాష్ట్రం కోసం ఆత్మబలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి సహా అందరి తల్లుల కడుపుకోత తెలుసా? అని ప్రశ్నించారు. తెలంగాణకు రావాలంటే వీసాతో రావాలని వైఎస్ చేసిన వ్యాఖ్యను, సమైక్య రాష్ట్రం కోసం జగన్ ప్లకార్డు పట్టుకోవటాన్ని ఆయన గుర్తు చేశారు.

తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న అన్ని పార్టీలను ఏకం చేసే బాధ్యతను తాను తీసుకున్నానని తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్దన్‌రెడ్డి తెలిపారు. అందరూ ఏకమై కాంగ్రెస్, టీడీపీలను బొందపెట్టాలన్నారు. బలిదానాలు వద్దు బతికి తెలంగాణ సాధిద్దామని విద్యార్థులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్, టీడీపీ అవకాశవాద రాజకీయాల కారణంగానే తెలంగాణ యువత ఆత్మబలిదానాలకు పాల్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రేపు జరిగే అఖిలపక్ష సమావేశంలో తెలంగాణపై పార్టీ వైఖరి స్పష్టం చేయకుంటే టీడీపీ దిమ్మె ఉండదు’ అని ఆయన హెచ్చరించారు.

తెలంగాణకు ద్రోహం చేసిన సోనియా, మన్మోహన్‌ను ప్రజలే బొందపెడుతారని టీఆర్‌ఎస్ ఎల్పీ నేత ఈటెల రాజేందర్ హెచ్చరించారు.

‘కిరణ్‌బాబు, చంద్రబాబు, జగన్‌బాబు ఎవరైనా ఆంధ్రాబాబులే’ అని స్పష్టం చేశారు. తెలంగాణ పోరాటం జాతిని ఐక్యం చేసిందని తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణవారు ఏకమై ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని, ప్రత్యేక రాష్ట్రం విషయంలో వాయిదాల మీద వాయిదాలు వేస్తూ నంగనాచి కబుర్లు చెబుతున్న కాంగ్రెస్‌ను ఐక్యపోరాటాలతో ఖతం చేసి, పాతయ్యాలని ఆయన పిలుపునిచ్చారు. ఆ విధంగా చేస్తేనే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుందన్నారు.

సంతోష్ శవయాత్ర సందర్భంగా పోలీసులు ప్రవర్తించిన తీరుపై ఈటెల మండిపడ్డారు. పోలీసులే అద్దాలు పగులకొట్టుకొని కాల్పులకు దిగారని చెప్పారు. ఆ కాల్పులను అడ్డుకున్న విద్యార్థులను ఆయన అభినందించారు. తెలంగాణ కోసం వందలాది యువత ఆత్మబలిదానాలకు పాల్పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉస్మానియా విద్యాలయం పోరాటాల గడ్డ అన్నారు. తెలంగాణ విషయంలో ఏబీవీపీ చేసిన తీర్మానాన్ని, చేసిన ఉద్యమాలను ఆయన మెచ్చుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ తెలంగాణ కోసం నిబద్ధతతో ఉందని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని ప్రశంసించారు.

[నమస్తే తెలంగాణ సౌజన్యంతో]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *