డిసెంబర్ 28 నాడు జరిగే అఖిలపక్ష సమావేశంలో రాష్ట్ర ఏర్పాటుపై స్పష్టమైన వైఖరి చెప్పని పార్టీల జెండా గద్దెలు అదే రాత్రి కూల్చాలని నాగం జానార్ధన్ రెడ్డి పిలుపిచ్చాడు. గత పదిరోజులుగా ఆయన చేపట్టిన తెలంగాణ భరోసా యాత్ర ముగింపు సమావేశం ఎల్బీనగర్ లో నిన్న సాయంత్రం జరిగింది. ఆ సభలో మాట్లాడుతూ నాగం కాంగ్రెస్, తెలుగుదేశం, వైయెస్సార్సీపీలను తీవ్రంగా విమర్శించాడు. తెలంగాణపై వైఖరి స్పష్టం చేయని ఈ పార్టీలను తెలంగాణలో నామరూపాలు లేకుండా చేయాలని ఆయన పిలుపు ఇచ్చాడు.
సిద్ధాంత రీత్యా ఉత్తర దక్షిణాల్లాగా ఉండే సి.పి.ఐ., బిజేపీ, న్యూడెమోక్రసీ పార్టీలు తెలంగాణ కొరకు తన వేదికపైన కలిసివచ్చినందుకు వారికి పాదాభివందనాలు అని అన్నారాయన.
ఈ సభలో జేయేసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, మల్లెపల్లి లక్ష్మయ్య, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంజీవో నాయకుడు దేవీప్రసాద్, శ్రీనివాస్ గౌడ్, న్యూదెమోక్రసీ నేత సూర్యం, మాలమహానాడు అధ్యక్షుడు అద్ద్నకి దయాకర్ తదితరులు పాల్గొన్నారు.