mt_logo

ఆరోగ్య తెలంగాణ‌.. నిరుపేద‌ల ఆరోగ్యానికి తెలంగాణ స‌ర్కారు భ‌రోసా



తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన తొమ్మిదేండ్ల‌లోనే రాష్ట్రంలో వైద్య విప్ల‌వం వెల్లివిరుస్తున్న‌ది. సీఎం కేసీఆర్ విజ‌న్‌తో నిరుపేద‌ల ఆరోగ్యానికి తెలంగాణ స‌ర్కారు భ‌రోసాగా నిలుస్తున్న‌ది. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు వైద్యం చేరువ‌య్యేందుకు విద్య‌,వైద్య రంగంలో విప్ల‌వాత్మ‌క మార్పులు తీసుకొచ్చింది. బ‌స్తీ, ప‌ల్లె ద‌వాఖాన‌లు, టీ డ‌యాగ్నొస్టిక్స్‌తో ఇంటింటికీ వైద్యాన్ని చేరువ చేసింది. పైసా ఖ‌ర్చు లేకుండా టెస్టులు, చికిత్స‌లు, మందులు అంద‌జేస్తూ నిరుపేద ప్ర‌జ‌ల‌కు వైద్యం భారంకాకుండా చూస్తున్న‌ది. వైద్య రంగంలో తెలంగాణ దేశంలోనే అన్ని రాష్ట్రాల‌కు ఆద‌ర్శంగా నిలుస్తున్న‌ది.

వైద్య రంగ బ‌లోపేతానికి తెలంగాణ స‌ర్కారు ఏం చేసిందంటే?

– రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కూ 350 బ‌స్తీ ద‌వాఖాన‌లు, 3,206 ప‌ల్లె దవాఖానాల‌ను తెలంగాణ స‌ర్కారు ఏర్పాటు చేసింది. వైద్యుల‌తోపాటు స‌రిప‌డా సిబ్బందిని నియ‌మించింది. ఇక్క‌డ ఉచిత టెస్టుల‌తోపాటు చికిత్స‌, మందుల‌ను అంద‌జేస్తున్న‌ది. ఇప్ప‌టివ‌ర‌కూ బ‌స్తీ ద‌వాఖాన‌ల ద్వారా 2.11 కోట్ల మందికి ఉచితంగా చికిత్స అందించింది. ఇందుకోసం సుమారు రూ. 95 కోట్లు ఖ‌ర్చు పెట్టింది. ప‌ల్లె ద‌వాఖాన‌ల ద్వారా 1.36 కోట్ల మందికి ఉచిత వైద్య సేవ‌లు అందాయి.

– టీ డ‌యాగ్నొస్టిక్స్ ఏర్పాటు చేసి, నిరుపేద‌ల‌కు పైసా ఖ‌ర్చులేకుండా వ్యాధి నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల‌ను ఉచితంగా నిర్వ‌హిస్తున్న‌ది. రాష్ట్ర‌వ్యాప్తంగా 20 టీ డ‌యాగ్నొస్టిక్స్‌ను ఏర్పాటు చేసి, 134 ర‌కాల ప‌రీక్ష‌ల‌ను ఉచితంగా నిర్వ‌హిస్తున్న‌ది. ఇప్పటివరకూ 11కోట్లకుపైగా ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి, నిరుపేద‌ల‌కు టెస్టుల ఖ‌ర్చు త‌ప్పించింది.

– కిడ్నీ వ్యాధిగ్ర‌స్తుల‌కు ఉచితంగా డ‌యాల‌సిస్ సేవ‌లు అంద‌జేస్తున్న‌ది. ఇప్ప‌టివ‌ర‌కూ రూ.698.08 కోట్లు ఖర్చు చేసి, 67,049మందికి ఉచితంగా డ‌యాల‌సిస్ సేవ‌ల‌ను అంద‌జేసింది. వారికి పింఛ‌న్‌తోపాటు ఉచిత బ‌స్‌పాస్‌ల‌ను అంద‌జేసింది.

– వైద్యారోగ్య రంగాన్ని బ‌లోపేతం చేసేందుకు ఇప్ప‌టివ‌ర‌కూ 22,455 పోస్టులను భర్తీ చేసింది. మరో 26,978 పోస్టులు మంజూరు చేయ‌గా, భ‌ర్తీ ప్రక్రియ కొన‌సాగుతున్న‌ది.

– ఆరోగ్య శ్రీ ద్వారా 16 లక్షల మందికి ఉచితంగా శ‌స్త్రచికిత్స‌లు, వైద్య‌సేవ‌లు అందాయి. ఇందుకు రాష్ట్ర స‌ర్కారు రూ.7 వేల కోట్లు ఖర్చు చేసింది.- జిల్లాకో మెడిక‌ల్, న‌ర్సింగ్ క‌ళాశాల ఏర్పాటు చేస్తూ వైద్య విద్య‌ను బ‌లోపేతం చేస్తున్న‌ది. 58 ఏండ్లలో తెలంగాణకు కేవలం మూడు మెడికల్‌ కాలేజీలు వస్తే, సీఎం కేసీఆర్‌ పగ్గాలు చేపట్టాక 29 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేసుకొన్న‌ది. ఎంబీబీఎస్‌ సీట్లలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న‌ది. పీజీ సీట్లలో ద్వితీయ స్థానంలో ఉన్న‌ది. వైద్య సీట్లు పెరిగి, తెలంగాణ బిడ్డ‌ల‌కు వైద్య‌విద్య చేరువైంది.