-దాడులతో దద్ధరిల్లిన గుంటూరు
-అనంతలో నాయకుల స్వైర విహారం
-వేట కొడవళ్లు.. రాళ్లతో దాడులు
-కడపలో ప్రజ్వరిల్లిన హింస
-విశాఖలో మావోయిస్టుల దాడులు, దహనాలు
-లాఠీ ఎత్తని పోలింగ్ ఇక్కడ..
-తుపాకి మోతల ఎన్నికలక్కడ
సరిగ్గా వారం క్రిందట తెలంగాణలో ఎన్నికలు జరిగాయి. దాడులు లేవు.. నెత్తురు చుక్క నేల రాలలేదు. ఘర్షణలు కూడా లేవు. పోలీసులు తుపాకుల మాట అటుంచి లాఠీలు కూడా కదల్చలేదు. మావోయిస్టుల కదలికలు కూడా కానరాలేదు. రీపోలింగ్ అవసరమూ రాలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే మీడియాకు పోలింగ్ శాతాలు, చిరంజీవి సిల్లీ ఎపిసోడ్ తప్ప సరుకే లేదు. ఏడు రోజుల వ్యవధిలో సీమాంధ్రలో ఎన్నికలు.. పగిలిన తలలు నెత్తురోడుతున్న దశ్యాలు.. పరస్పర రాళ్ల దాడులు.. పోలింగ్ బూతుల ఆక్రమణలు..పోలీసులపై దాడులు, తరిమివేతలు.. గాల్లోకి కాల్పులు.. అరుపులు, కేకలు, దొమ్మీలు.. గ్రామాల్లో పోలీసుల కవాతులు, పికెట్లు.. ప్రత్యర్థి పార్టీ ఏజెంట్ల లాగివేతలు.. మావోయిస్టుల విధ్వంసాలు… పోలింగ్ నిలిపివేతలు… వాహనాల దహనాలు.. ఇదీ సీమాంధ్ర ఎన్నికల దశ్యం. అక్కడ ఇది మొదటిసారి కాదు..బహుశా చివరిది కూడా కాదు.
ఆశ్యర్యకరమైన విషయమేమంటే ఈ దొమ్మీసేనలే తెలంగాణ ఏదో అంతర్యుద్ధంలో మునిగితేలే ప్రాంతమని ప్రత్యేక రాష్ట్రమిస్తే భూమి బద్దలవుతుందని జాతీయ స్థాయిలో ప్రచారాలు చేయడం. ముంజేతి కంకణానికి అద్దమెందుకు? రెండు రాష్ర్టాల్లో జరిగిన పోలింగ్ తీరుతెన్నులే ఎవరేంటో తేటతెల్లం చేశాయి. ఆంధ్ర ఎపుడూ అంతేనని మరోసారి రుజువైంది. తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఘర్షణలు పెరిగిపోతాయి. మావోయిస్టులు రెచ్చిపోతారంటూ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తదితరులు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని సీమాంధ్రలో జరిగిన పోలింగ్ నిరూపించింది. హింస ఎవరిదో.. శాంతి ఎవరిదో నిరూపితమైంది.
బుధవారంనాటి పోలింగ్ హింసతో అట్టుడికిపోయింది. ఫ్యాక్షనిస్టులు, రౌడీ గ్యాంగులు, కులాల లాబీలు, భూ బకాసురులు, పారిశ్రామిక వేత్తలు ఈ ఎన్నికల్లో తలో పార్టీ చొప్పున పంచుకుని పరస్పరం తలపడ్డారు. ఆయా పార్టీల కార్యకర్తలు రాళ్ల దాడులు జరుపుకొన్నారు. మరికొన్ని చోట్ల పార్టీల అభ్యర్థులు, వారి వాహనాలపై దాడులు జరిగాయి. పరిస్థితులను అదుపులోకి తీసుకురావటానికి ప్రయత్నించిన ఓ ఏఎస్పీతోపాటు పలువురు పోలీసు సిబ్బందిపై కూడా రాళ్లు రువ్వారు. ఫలితంగా కొన్నిచోట్ల పరిస్థితులను అదుపులోకి తీసుకురావటానికి పోలీసులు గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. అనంతపురం జిల్లాలో నాయకులు ఇష్టారాజ్యంగా స్వైరవిహారం చేశారు. తిరుపతిలో నాయకులే ముఖాముఖి తలపడడంతో ఎస్‌పీ ముందు నిలబెట్టారు. విశాఖలో మావోయిస్టులు ఈవీఎంలను ఎత్తుకుపోయి వాటిని దహనం చేశారు.
పులివెందుల ఎన్నికల సిబ్బంది కోసం ఇచ్చిన వాహనాలను ధ్వంసం చేశారు. పోలింగ్ నిలిచిపోయింది. కొయ్యూరు మండలం పలకజీడి పోలింగ్ కేంద్రంపై మావోయిస్టులు మెరుపుదాడి చేశారు. మధ్యాహ్నం సమయంలో దాదాపు ముప్పయి అయిదుమంది మావోయిస్టులు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఈవీఎంలు, పోలింగ్ సామాగ్రి, వాహనాలను తగులబెట్టారు. దాంతో పోలింగ్ నిలిచిపోయింది. అదే జిల్లాలో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో భారీగా రిగ్గింగ్ చేశారు. అనేక చోట్ల ప్రత్యర్థి పార్టీల ఏజెంట్లను తరిమివేశారు. పార్లమెంటు అసెంబ్లీ అభ్యర్థుల మీద దాడులు జరిపారు. మీడియా వాహనాలు కెమెరాలను ధ్వంసం చేశారు. ప్రత్యర్థి వర్గాల దాడిలో ఓ పార్టీ కార్యకర్త మరణించాడు. రాయలసీమలో ప్రత్యర్థులపై మారణాయుధాలతో దాడి చేయడమే కాకుండా వారిని ఆస్పత్రికి తరలిస్తున్న వాహనాల మీద కూడా దాడి జరిపారు.
గుంటూరు జిల్లాలో కాల్పులు..
గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం రామిరెడ్డిపాలెంలో పోలింగ్ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. గ్రామంలోని ఓ పోలింగ్ కేంద్రంలో బీజేపీ ఏజెంట్‌ను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బయటకు నెట్టేశారు. దీనిని స్థానికులు అడ్డుకోవటంతో వివాదం తలెత్తింది. పరిస్థితిని అదుపులోకి తేవటానికి పోలీసులు లాఠీఛార్జీ చేశారు. అయినా, గొడవ జరుగుతుండటంతో ఓ కానిస్టేబుల్ గాల్లోకి ఒక రౌండ్ కాల్పులు జరిపారు. విషయం తెలిసి రూరల్ ఎస్‌పీ సత్యనారాయణ అక్కడకు వచ్చారు. ఏజెంట్‌ను బయటకు నెట్టేసినవారిపై కేసు పెడతామన్నారు.
రొంపిచర్ల మండలం సుబ్బయ్యపాలెంలో తమ పార్టీకి చెందిన ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల నుంచి వెళ్లాగొట్టారన్న సమాచారంతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చారు. దాంతో ఘర్షణ జరుగుతుందేమోనని ఎన్నికల అధికారులు పోలింగ్‌ను ఇరవై నిమిషాలపాటు నిలిపివేశారు. డీఎస్‌పీ ప్రసాద్ అక్కడకు చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టిన తరువాత పోలింగ్‌ను ప్రారంభించారు. ఇదే జిల్లాలోనే పొన్నూరు నియోజకవర్గం నుంచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెంకటరమణను ఎక్సయిజ్ పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ మద్యం కేసులో ఆయన నిందితునిగా ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఆయన అరెస్టుపై హైకోర్టు బుధవారం సాయంత్రం వరకు స్టే ఇచ్చింది. స్టే గడువు ముగియగానే పోలీసులు గుంటూరులో వెంకటరమణను అరెస్టు చేశారు.
రాయపాటిపై దాడి….
నర్సరావుపేట నియోజకవర్గం పార్లమెంట్ స్థానం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీలో ఉన్న రాయపాటి సాంబశివరావుపై దాడి జరిగింది. నియోజకవర్గం పరిధిలోని రంగారెడ్డిపాలెం, బసికాపురం, రామిరెడ్దిపాలెం, బుచ్చిబావనపాలెం తదితర ప్రాంతాల్లో రీపోలింగ్‌కు టీడీపీ డిమాండ్ చేసింది. ఓటర్లను ప్రలోభానికి గురిచేసిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అరెస్టు చేయాలంది. బెల్లంకొండ మండలం కొల్లూరులో తెలుగుదేశం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. దీంట్లో ముగ్గురికి గాయాలయ్యాయి.
పోలీసులు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మాచర్ల నియోజకవర్గంలోని కంభంపాడులో తెలుగుదేశం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు.నరసారావుపేట మండలం రంగారెడ్డిపాలెంలో కొంతమంది మీడియా ప్రతినిధులపై దాడి చేశారు. కెమెరాలు లాక్కోవటానికి ప్రయత్నించారు. సత్తెనపల్లి మండలం కట్టమూరులో తెలుగుదేశం కార్యకర్తలు పోలీసులపై దాడి చేశారు. రొంపిచర్ల మండలం సుబ్బయ్యపాలెంలో తెలుగుదేశం నాయకులు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఏజెంట్లను కిడ్నాప్ చేశారు.
మీడియా ప్రతినిధులపై దాడి..
కష్ణా జిల్లా ముదినేపల్లి మండలం పాలపర్రులోని పోలింగ్ బూత్ వద్ద తెలుగుదేశం, కాంగ్రెస్ కార్యకర్తలు గొడవపడ్డారు. ఆ దశ్యాలను చిత్రీకరించేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులపై కొంతమంది దాడి చేశారు. కెమెరాలను ధ్వంసం చేశారు.గుడివాడలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై ఆ పార్టీ కార్యకర్తలే దాడి చేశారు. గుడివాడ అసెంబ్లీ స్థానం నుంచి బరిలో ఉన్న రావి వెంకటేశ్వరరావు పార్టీ ఫండ్ ఇవ్వలేదంటూ ఆందోళన చేశారు. విషయం తెలిసి పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళన చేస్తున్నవారిని చెదరగొట్టారు. ముదినేపల్లిలో ఓటర్లకు డబ్బు పంచుతున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి 94వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్త హత్య…
తూర్పు గోదావరి జిల్లా సీతానగరంలో తెలుగుదేశం పార్టీకి చెందినవారు భావిస్తున్న కొంతమంది జరిపిన దాడిలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మరణించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో తెలుగుదేశం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు గొడవపడ్డారు. దీంట్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకుడు ముక్తియార్ వాహనం ధ్వంసమైంది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాల వారిని చెదరగొట్టారు.
కడప జిల్లాలో దాడులు, ధ్వంసాలు…
కడప జిల్లా పులివెందులలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ, అసెంబ్లీ అభ్యర్థులపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి జరిపారు. పులివెందులలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు రిగ్గింగ్ చేస్తున్నారని తెలిసి టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి సతీష్‌రెడ్డి, ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డిలు అక్కడికి వెళ్లగా వారిపై దాడి జరిగింది. సతీష్‌రెడ్డికి చెందిన వాహనాన్ని కూడా పాక్షికంగా ధ్వంసం చేశారు. జమ్మలమడుగు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రామసుబ్బారెడ్డిపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. గొరిగనూరు పోలింగ్ స్టేషన్‌లో పోలింగ్ ఏజెంట్లను పెట్టేందుకు వెళ్లిన ఆయనపై దాడి చేసి ఇద్దరు తెలుగుదేశం పార్టీ ఏజెంట్లను అపహరించి తీసుకెళ్లారు. రామసుబ్బారెడ్డి కారును కూడా ధ్వంసం చేశారు. దాంతో ఆయన గొరిగనూరులో బైఠాయించి ఆందోళన జరిపారు.
మైదుకూరు నియోజకవర్గంలోని రాపాడు మండలం వెదురూరులో తెలుగుదేశం అభ్యర్థి పుట్టా సుధాకర్ ప్రయాణిస్తున్న కారుపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. విషయం తెలిసి పోలీసులు అక్కడికి చేరుకోగా పరారయ్యారు. బ్రహ్మంగారి మఠం మండలం జే.కొత్తపల్లిలో సుధాకర్ యాదవ్ ఇంటిపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. ఇంటిపై రాళ్లు రువ్వటంతో సుధాకర్ కుటుంబసభ్యులకు గాయాలయ్యాయి. దేవగుడిలో ఎన్నికల విధుల్లో ఉన్న ఏఎస్‌పీ స్వామినాయుడుపై దాడి జరిగింది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా భావిస్తున్న కొందరు రాళ్లు విసరటంతో స్వామినాయుడుతోపాటు ఎస్‌పీ రాజేష్, ఆరుగురు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. విషయం తెలిసిన వెంటనే రాయలసీమ రేంజ్ ఐజీ నవీన్‌చంద్, అదనపు డీజీపీ సురేంద్రబాబు ఘటనా స్థలానికి వెళ్లారు. దేవగుడి ఘటనపై జమ్మలమడుగు ఆర్డీవో రఘునాథరెడ్డి విచారణ చేపట్టారు.
మారణాయుధాలతో దాడులు…
కడప జిల్లా రాజంపేట మండలం రోళ్లమడుగు పంచాయతీలోని బాలరాజుపల్లె, పెద్దూర్ పోలింగ్ కేంద్రాల సమీపంలో తెలుగుదేశం ఏజెంట్లపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ నాగేశ్వరరావు అతని అనుచరులు మారణాయుధాలతో దాడి చేశారు. దీంట్లో వెంకటరామరాజు, సీతారామరాజు, రఘురామరాజు, బలరామరాజు, కష్ణమనాయుడులకు గాయాలయ్యాయి. వారిని రాజేంపేట ఆస్పత్రికి తరలిస్తుండగా వాహనంపై కూడా దాడి చేశారు. దాడిపై తెలుగుదేశం పార్టీ రాజంపేట అసెంబ్లీ అభ్యర్థి మల్లిఖార్జునరెడ్డి ఎన్నికల అదికారులు, ఆర్డీవో, ఎస్‌పీ, డీఎస్‌పీకి ఫిర్యాదు చేశారు.
జేసీ సోదరుడి స్వైర విహారం…తాడిపత్రిలో మాజీ మంత్రి జే.సీ.దివాకర్‌రెడ్డి సోదరుడు జే.సీ.పభాకర్‌రెడ్డి స్వైరవిహారం చేశారు. పోలింగ్ బూత్‌లో ఉన్న పైలా నర్సింహయ్య అనే వ్యక్తిపై దాడి చేసి కొట్టారు. నర్సింహయ్యను బూత్ నుంచి బయటకు వెళ్లగొట్టేందుకు యత్నించారు. దాంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లి గ్రామంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలపై తెలుగుదేశం కార్యకర్తలు వేట కొడవళ్లతో దాడి చేశారు. దాడిలో ఎనిమిది మందికి గాయాలు కాగా వెంటనే ఆస్పత్రికి తరలించారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై ఆయన షాడో పార్టీ పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. రాప్తాడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరాంను వెంకటాపురంలో పోలీసులు గృహనిర్భంధంలో ఉంచారు. ముందు జాగ్రత్తగానే ఈ చర్య తీసుకున్నట్టు అధికారులు చెప్పారు.
చిత్తూరు జిల్లాలో కార్యకర్తలు ఆస్పత్రిపాలు ..
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలం రామచంద్రాపురంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం జరుపుకొన్న దాడుల్లో ఆరుగురు గాయపడ్డారు. వీరిని శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తిరుపతి జీవకోనలో తెలుగుదేశం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మధ్య ఘర్షణ జరిగింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెంకటరమణపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి కరుణాకర్‌రెడ్డి చేయి చేసుకున్నారు. పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి జిల్లా ఎస్‌పీ ముందు హాజరుపరిచారు. పడవలూరులో భారీగా రిగ్గింగ్ జరిగింది. ఇక్కడ ఒక టీవీ వ్యాన్‌పై ఓ పార్టీ కార్యకర్తలు దాడి చేసి ధ్వంసం చేశారు.
రాయదుర్గంలో తెలుగుదేశం నాయకుడు దీపక్‌రెడ్డిని పోలీసులు ముందు జాగ్రత్తగా గృహనిర్భంధంలో పెట్టారు. దాపాడు మండలం విశ్వనాథపురంలో మైదుకూరు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి రఘురామిరెడ్డికి చెందిన వాహనాలపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. పోలీసులు అడ్డుకోగా పోలీసులకు చెందిన వాహనాలను ధ్వంసం చేశారు. తొట్టంబేడు మండలం రామచంద్రారెడ్డిపల్లెలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలపై దాడి జరిగింది. కర్నూలు జిల్లా అవుకు మండలం రామాపురంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు దాడి చేయటంతో ఇద్దరికి గాయాలయ్యాయి. దువ్వూరులో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి కుమారునిపై తెలుగుదేశం కార్యకర్తలు దాడి చేశారు. బద్వేలు మండలం చిన్న కేశంపల్లిలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలపై రితేష్‌రెడ్డి దాడి చేసి కొట్టారు.
పోలీసుల బందోబస్తు ఎక్కువే..
గమనించాల్సిన అంశం ఏమిటంటే తెలంగాణలో పోలింగ్ సందర్భంగా 90వేలమంది పోలీసులు బందోబస్తు విధులు నిర్వర్తించగా సీమాంధ్రలో లక్షా 22వేలమంది భద్రతా విధులు నిర్వర్తించారు. తెలంగాణలో 128 కంపెనీల కేంద్రా పారా మిలటరీ బలగాలు పని చేయగా సీమాంధ్రలో 288 కంపెనీల కేంద్ర పారా మిలటరీ బలగాలను రంగంలోకి దింపారు. అయినా, పలుచోట్ల హింసాత్మక సంఘటనలు జరగటం గమనార్హం. పోలీసువర్గాల ద్వారా తెలిసిన ప్రకారం సీమాంధ్రలో ఎన్నికల హింసకు సంబంధించి వందకు పైగానే కేసులు నమోదైనట్టు తెలుస్తోంది.
నమస్తే తెలంగాణ సౌజన్యంతో: