ఆదిభట్ల పోలీస్ స్టేషన్‌కు టాటా సుమోను, బైక్‌ను టీసీఎస్ కంపెనీ అందజేసింది. ఈ కార్యక్రమాన్ని ఐటీ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఆదిభట్లలో పీఎస్‌ను ప్రారంభించామని, ఆదిభట్ల ఐటీ కారిడార్‌లో మహిళలకు భద్రత కల్పిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఈ స్టేషన్‌లో ఒక సీఐ, ఇద్దరు ఎస్ఐలు, 20 మంది కానిస్టేబుళ్ళు ఉన్నారని చెప్పారు.
అనంతరం మంత్రి కేటీఆర్ సాఫ్ట్‌వేర్ ఎగుమతుల సంస్థల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. పరిశ్రమల మౌలిక సమస్యలను సాఫ్ట్‌వేర్ సంస్థల ప్రతినిధులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, మాదాపూర్, గచ్చిబౌలికి ప్రత్యామ్నాయం చూస్తామని, హైదరాబాద్‌లో ఐటీ పరిశ్రమలకు ఇబ్బందులను తొలగిస్తామని హామీ ఇచ్చారు. ఆదిభట్లలో సాఫ్ట్‌వేర్ సంస్థల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు, ఆదిభట్లకు నిర్విరామంగా నీటిసరఫరా జరిగేలా చూస్తామని చెప్పారు. కృష్ణా జలాల అన్ని దశలు పూర్తయ్యేలోగా నీటి సరఫరా చేస్తామని, ఐటీని హైదరాబాద్‌లో అగ్రగామిగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, ఈనెల 11న ఐటీఐఆర్ పై సమావేశం నిర్వహిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు.