రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన వర్గాలకు ఇస్తున్న విద్యుత్ రాయితీలు రూ.625 కోట్లకు చేరుకున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక సామాజికంగా వెనుకబడిన వారికి కరెంటు బిల్లులు భారంగా మారకూడదని సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలకు ప్రతినెలా 101 యూనిట్ల విద్యుత్ ఉచితంగా అందించే పథకాన్ని ప్రారంభించారు. ఈ రాయితీ విద్యుత్ కు సంబంధించిన బిల్లులను 2015 నుండి స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే విద్యుత్ సంస్థలకు చెల్లిస్తోంది. కాగా గడిచిన ఏడేళ్లలో ఈ రాయితీలు రూ.625 కోట్లకు చేరగా వాటిని ప్రభుత్వం చెల్లించింది. కాగా ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 7.76 లక్షల మంది ఎస్సీ, ఎస్టీలు లబ్ది పొందారు. వీరిలో ఎస్‌పీడీసీఎల్ పరిధిలో 3,17,630 మంది ఉండగా, ఎన్‌పీడీసీఎల్ పరిధిలో 4,59,128 మంది ఉన్నారు. 4,98,235 మంది ఎస్సీలకు గత ఏడేండ్లలో రూ.419 కోట్ల విద్యుత్ రాయితీ ఇవ్వగా, 2,78,523 మంది ఎస్టీలకు రూ.206 కోట్ల రాయితీ లబ్ధి చేకూరింది.
