ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరుతో ఉన్న రేషన్‌కార్డులను తెలంగాణ రాష్ట్రం పేరుతో కొత్తగా జారీ చేస్తామని, రేషన్‌కార్డులపై కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని ఆర్ధిక, పౌరసరఫరాల శాఖామంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని పేదలందరికీ ఆహారభద్రత కార్డులు అందజేసి ఒక్క రూపాయికే కిలో బియ్యాన్ని అందజేస్తామని, కార్డుపై ఒక్కొక్కరికి 4 కిలోలు ఇచ్చే బియ్యాన్ని 6 కిలోలకు పెంచుతున్నామని, కుటుంబానికి 20 కిలోలు మాత్రమే ఇవ్వాలన్న నిబంధనను కూడా ఎత్తివేస్తున్నామని చెప్పారు.
కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి తలా ఆరు కిలోల చొప్పున అందిస్తామని, తెలంగాణ ప్రభుత్వం కొత్త నిబంధనలు ఏమీ తీసుకురాలేదని, గత ప్రభుత్వంలో ఉన్న వాటినే అమలు చేస్తున్నామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం జారీ చేస్తున్న కార్డులు కేవలం రేషన్ సరుకుల కోసమేనని, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలకు సంబంధం లేదని ఈటెల స్పష్టం చేశారు.