హైదరాబాద్ లో వ్యూహాత్మక రహదారి అభివృద్ధి పథకానికి నిధుల సమస్య లేకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతున్నది. తాజాగా రూ.505 కోట్లను రూపీటర్మ్ లోన్ రూపంలో ఈ పథకానికి సమీకరించింది. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలో నాగోల్ ఫ్లై ఓవర్, గచ్చిబౌలి, కొత్తగూడ-బొటానిక్ గార్డెన్ కూడళ్ల వంతెన, ఇందిరాపార్క్ స్టీల్‌బ్రిడ్జి.. ఇలా 16 చోట్ల యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి.
ఈ పనులు పూర్తి కావాలంటే రూ.4304.07 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. ఎస్‌ఆర్‌డీపీ పథకం మొదటి దశలో రూ.8092 కోట్లతో 47 చోట్ల ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు, కేబుల్ బ్రిడ్జిలు, స్టీల్ బ్రిడ్జిలు, ఆర్వోబీలు, ఆర్‌యూబీల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు రూ.3748.85 కోట్లతో 31 చోట్ల ప్రాజెక్టులను అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ ప్రాజెక్టు ప్రారంభించే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్‌ఎంసీకి అప్పు తీసుకునే అనుమతి ఇచ్చింది. బాండ్ల జారీ ద్వారా రూ. 1000కోట్లు, రూపీ టర్మ్ లోన్ ద్వారా రూ. 2500 కోట్లు నిధులు సమీకరించుకోవాలని సూచించింది.
ఈ మేరకు జీహెచ్‌ఎంసీ బాండ్ల జారీ రూపంలో నిధులు సమీకరించే ప్రయత్నం చేయగా.. మూడు దఫాల్లో రూ.495 కోట్ల మేర సమకూరాయి. ఇలా సేకరిస్తున్న నిధులపై వడ్డీ భారంగా మారుతున్న తరుణంలో మిగిలిన రూ.505 కోట్ల సమీకరణను దాదాపు మూడున్నరేళ్ల క్రితం ఆపేశారు. రూపీ టర్మ్ లోన్ రూపంలో పలు దఫాలుగా రూ.2,500 కోట్లను సమీకరించి ఎస్‌ఆర్‌డీపీ పథకాన్ని ముందుకు తీసుకువెళ్లారు. ఈ నిధులు ఏడాది కిందటనే అయిపోయాయి. కొత్తగా అప్పు తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఈ తరుణంలోనే రూ. 505 కోట్ల బాండ్ల జారీ రుణ పరిమితిని జీహెచ్‌ఎంసీ ఆర్థిక విభాగం రూపీ టర్మ్‌లోన్‌గా మార్చుకున్నది. బ్యాంకు లోన్ కింద చివరి రూ.505 కోట్లను సమీకరించింది. ప్రాజెక్టు పూర్తికి గానూ పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని బదలాయించి తొలి విడతను విజయవంతంగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టినట్లు జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారి తెలిపారు.