డిగ్గీ రాకతో విభజన ప్రక్రియ వేగం పుంజుకుంది. ఇరుప్రాంతాల నేతలను కలుపుకుపోవడమే ప్రధాన లక్ష్యంగా ఆయన పావులు కదుపుతున్నారు. రాష్ట్రానికి చేరగానే సీఎం, పీసీసీ చీఫ్ బొత్స, డిప్యూటీ చీఫ్ దామోదర రాజనర్సింహ, తెలంగాణ, సీమాంధ్ర నేతలతో సమావేశమయ్యారు. రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాక జరిగే చర్చలో సీమాంధ్ర నేతలు వ్యతిరేకించకుండా చూసే భాధ్యతను కేంద్రం ఆయనకు అప్పగించింది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే సామర్ధ్యం ఆయనకుంది. అందుకే రాష్ట్రంలోని పరిస్థితులను చక్కబెట్టడానికి కేంద్రం డిగ్గీరాజాను ఎంచుకుంది. ఇది రాష్ట్రంలో ఆయనకు రెండో పర్యటన.
నిన్న మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో సీఎం, మంత్రి పితాని సత్యనారాయణ లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్‌సింగ్‌తో 40 నిమిషాలపాటు సమావేశమయ్యారు.
ప్రస్తుత శాసనసభ సమావేశాల్లోనే బిల్లుపై చర్చ పూర్తిచేయాలని సీఎంకు చెప్పగా, దానికి సీఎం వ్యతిరేకిస్తూ రాష్ట్రపతి ఆరు వారాల సమయం ఇచ్చినందున ఈ సమావేశాలు అవ్వగానే ప్రత్యేక సమావేశాల్లో దీనిపై చర్చిస్తామని చెప్పుకొచ్చారు. కానీ దానికి దిగ్విజయ్‌సింగ్ ఒప్పుకోలేదు. ఎలాగైనా ఈ సమావేశాల్లోనే బిల్లుపై చర్చ పూర్తిచేసి కేంద్రానికి పంపించాల్సిందిగా సీఎంను ఒప్పించినట్లు సమాచారం. ఆ తర్వాత ఆయన తెలంగాణ నేతలతో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేస్తామని, ఎలాంటి అనుమానాలకు తావులేదని చెప్పారు.