By: మామిడి హరికృష్ణ
‘కళ కళ కోసమా, ప్రజల కోసమా?’ అనేది వందలాది ఏళ్లుగా చర్చనీయాంశమైన ప్రశ్న!కళారూపంగా సినిమా కూడా ఇదే ప్రశ్నని ఎదుర్కొంటోంది. మిగతా సినీ ప్రపంచాలన్నీ ఈ విషయమై కొంచెం తటపటాయించినా, తెలంగాణ సినిమా మాత్రం మొదట్నుంచీ కచ్చితమైన సమాధానాన్నే చెప్తోంది ప్రజల కోసం’ అని!‘ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కోసం’ గత నాలుగు దశాబ్దాల క్రితం రూపొందిన తెలంగాణ సినిమాలు, నేడు సునామీలా మారిన ప్రజా ఉద్యమ నేపథ్యంలో మరిన్ని రావాల్సిన అవసరం ఉంది.
తెలంగాణ ప్రజల భాష-యాస-గోస’లే ఊపిరిగా వెల్లువెత్తిన నవ్య సినిమానే తెలంగాణ సినిమా. సాధారణంగా కళారూపాలేవైనా ప్రజల మనోభావాలకు, ఆకాంక్షలకు అద్దంప ఉంటాయి. అంతేగాక, ఆ కళారూపాలన్నీ తమ కళావస్తువులను, దానికి కావలసిన స్ఫూర్తిని ఆ ప్రజల జీవన శైలి-సంస్కృతుల నుంచే పొందుతాయి. ప్రజల జీవితాల్లోంచి రూపొందిన కళారూపాలు ప్రజల మనోభావాలను ప్రతిబింబించి ప్రజామోదాన్ని, ప్రజాదరణను చూరగొంటాయి. అలా ప్రస్తుతం తెరమీదకొచ్చిన కొత్త సినిమా తెలంగాణ సినిమా.
అవసరమేమిటి?
సాధారణ పౌరుడికి సైతం అందుబాటులో ఉన్న వినోదసాధనం సినిమా. తెలంగాణ ప్రాంతంలో కూడా దశాబ్దాల కాలంగా తెలుగు సినిమాల ఆధిపత్యమే కొనసాగుతోంది. అయితే ఇక్కడ బాలీవుడ్ హిందీ సినిమాకు కూడా మంచి ఆదరణ ఉంది. మార్కెట్ పరంగా, డిస్ట్రిబ్యూషన్‌పరంగా తెలంగాణ ప్రాంతం నైజాం పేరుతో తెలుగు సినిమాలకు ప్రధాన ఆదాయవనరుగా ఉంటోందనేది నిజం. తెలుగు సినిమాల మొత్తం కలెక్షన్లలో దాదాపు యాభై శాతం వరకూ ఒక్క నైజాం ప్రాంతం నుంచే వస్తోంది. అయితే తెలుగు సినిమాలలో చూపిస్తున్న సంస్కృతి-సంవూపదాయాలు- భాష-యాస వంటివన్నీ తెలంగాణ జన జీవన సంస్కృతికి భిన్నమైనవే అని చెప్పాలి.
1724 నుంచి 1948 వరకూ తెలంగాణ ప్రాంతాన్ని ఆసఫ్‌జాహీ నిజాం రాజులు పాలించడం వల్లనూ, అంతకుముందు కుతుబ్‌షా వంశస్థులు పాలించడం వల్లనూ తెలంగాణ ప్రాంతంలో ఇస్లామ్ జీవన శైలి తరతరాలుగా వేళ్లూనుకొని ఉంది. అలాగే 1611 నుండి 1947 వరకూ కోస్తాంధ్ర ప్రాంతం అంతా బ్రిటిష్ వారి ఏలుబడిలో వారి ప్రభావానికి లోనయింది. దీనివల్ల ఈ ఇరు ప్రాంతాల్లో సాంస్కృతిక వైరుధ్యాలు, జీవన విలువల్లో తేడాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. అయితే ఆంధ్రవూపదేశ్ రాష్ట్రావిర్భావం తర్వాత తెలంగాణ సంస్కృతిపై, జీవనశైలిపై చాపకింద నీరులా సీమాంధ్ర సంస్కృతి ఆధిపత్యం మొదలై చివరికి తెలంగాణ సంస్కృతి ప్రశ్నార్థకంలో పడిపోయే పరిస్థితి వచ్చింది.
పత్రికలు, మీడియా, సినిమాల ద్వారా తెలంగాణ విశిష్ట సంప్రదాయాలు దాడికి గురయ్యాయి. ‘పైకి చూస్తే భాష ఒక్కటే అనిపిస్తుంది కానీ తెలంగాణ తెలుగు వేరు. సినిమాలు వంటి మాస్ మీడియా ద్వారా గత ఐదు దశాబ్దాలుగా మనకు తెలియకుండానే మనం మన భాషను కోల్పోయాం. దసరా-జమ్మిచెట్టు-పాలపిట్ట-బతుకమ్మలను కోల్పోయినాం. తెలుగు సినిమాల ప్రభావంలో పడిపోయి మన అస్తిత్వాన్ని మర్చిపోతున్నాం. ఈ పరిస్థితి కూడా ఉండాలంటే తెలంగాణ సినిమా ఒక్కటే పరిష్కారం’ అని దర్శకుడు శంకర్ ఈ విషయమై అభిప్రాయపడ్డారు.
పైగా సీమాంధ్రుల కనుసన్నల్లో నడుస్తున్న తెలుగు సినిమాల్లో తెలంగాణ భాష-యాసలు పరాయీకరణ చెందిన విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఈ విషయమై దర్శకుడు శంకర్- ‘మొదట్లో నేను తెలంగాణ తెలుగును బాగా మాట్లాడేవాణ్ణి. కానీ సినిమాలకు వద్దామని నిర్ణయించుకున్న తరువాత నటుడు ప్రభాకర్‌రెడ్డిని కలిసినప్పుడు ఆయన నాకు ఇచ్చిన మొదటి సలహా భాష మార్చుకోమనే. కృష్ణాగోదావరి జిల్లాల్లోని తెలుగు మాట్లాడితేనే ఫిల్మ్ ఇండస్ట్రీలో మనుగడ. లేదంటే అంతే అని ఆయన చెప్పారు. ఆ తర్వాత నేను ఈ సినిమా భాషకు అలవాటు పడటానికి ఆరేళ్లు పట్టింది. ఇలా నాది కాని భాష-యాసలో నేను ఒదగడం కన్నా, నా తల్లి భాషలో, నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్న యాసలో, నా ప్రజల గోసను సినిమాల్లో చూపించడం అవసరం కదా’ అని చెప్పారు. ఈ తండ్లాటే ఇప్పుడు తెలంగాణ సినిమా ఆవశ్యకతను నొక్కి వక్కాణిస్తోంది.
తెలుగు సినిమాల్లో తెలంగాణ
మానవ జాతి పరిణామ చరిత్రలో ఉద్యమాలు -పోరాటాలన్నీ వివక్షకు వ్యతిరేకంగా, దోపిడీని ధిక్కరిస్తూ వచ్చినవే. 1776 నాటి అమెరికా విప్లవం, 1789నాటి ఫ్రెంచి విప్లవం, 1917 నాటి రష్యన్ విప్లవం ఆఖరికి భారత స్వాతంత్య్ర సంగ్రామం చెప్తున్న సత్యం కూడా ఇదే. ఒక మనిషిని వేరొక మనిషి, ఒక జాతిని వేరొక జాతి, ఒక సంస్కృతిని వేరొక సంస్కృతిని తక్కువగా చూస్తూ తగిన గుర్తింపునివ్వకపోవడమేకాక చులకనగా వ్యవహరించడం వంటివి ప్రత్యక్షంగానూ, సినిమా వంటి కళారూపాల్లో కూడా ప్రదర్శించినపుడు ధిక్కారస్వరం’ వినిపించడం సహజాతిసహజం.
ప్రస్తుతం అలాంటి పరిస్థితే తెలుగు సినీరంగంలో కనిపిస్తోంది. ఇంతకాలం తెలుగు సినిమాల్లో తెలంగాణ భాష-యాసను ఉపయోగించిన తీరే దీనికి మంచి ఉదాహరణ. మొదట్లో తెలుగు సినిమాల్లో భాషగా కృష్ణా జిల్లా భాషనే అధికంగా ఉపయోగించేవారు. సినీ నిర్మాత-దర్శకుల నుంచి మొదలుకొని హీరోలు కూడా ఆ ప్రాంతం వాడే కావడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. కాగా గత 20 ఏళ్ల నుంచి ప్రధాన కథానాయకుని భాష గోదావరి జిల్లాల్లో మాట్లాడే తెలుగు భాషగా బలపడింది. ఈ షిప్ట్ జరుగుతున్న సమయంలోనే సినిమాల్లో కమెడియన్‌లకి, విలన్‌లకి, గూండా పాత్రధారులకి తెలంగాణ భాష,యాసను వాడటం మొదలయింది. క్యారెక్టర్ నేచర్’ అనే సాకుతో మొదలైన ఈ పరిణామం వెనక ఉన్న సాంస్కృతిక దాడిని ఇన్నాళ్లకి గుర్తించడం జరిగింది. ఇలా తెలుగు సినిమాల్లో తెలంగాణ భాష-యాస నెగిటివ్‌గానే చిత్రించడం జరిగింది.
తెలంగాణ సినిమా:
కవిత్వం, సాహిత్యం, కళలు వంటి సృజనాత్మక రంగాల లాగానే సినిమా రంగంలో కూడా ప్రత్యేక తెలంగాణ సినిమాకు సంబంధించిన ప్రయత్నాలు మొదలైంది ఇప్పుడు కాదు. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమకాలంలోనే ఆ దిశగా అడుగులు పడ్డాయి. అలా వచ్చిన సినిమానే చిల్లర దేవుళ్లు’. 1975లో మాధవరావు దర్శకత్వంలో వరంగల్ జిల్లా ఆత్మకూరు గడీ నేపథ్యంగా తెరకెక్కిన ఈ సినిమా తెలంగాణ భాష, యాసలతోనే కాక, తెలంగాణ ప్రజల గోసను కూడా చక్కగా చూపింది. దాశరథి రంగాచార్య 1969లో రాసిన నవల ఆధారంగా రూపొందిన ఈ సినిమా ‘తొలి తెలంగాణ సినిమా’గా గుర్తింపు పొందింది.
ఆ తర్వాత 1979లో వచ్చిన ‘మా భూమి’ తెలంగాణ సినిమాకు ఓ స్పష్టమైన గ్రామర్‌ను రూపొందించిందని చెప్పాలి. కిషన్‌చందర్ రచన అయిన ‘జబ్ ఖేత్ జాగే’కు తెరరూపంగా వచ్చిన ఈ సినిమాకు బెంగాలీ దర్శకుడు గౌతమ్‌ఘోష్ దర్శకత్వం వహించారు. 1947కు ముందు నాటి తెలంగాణలో ఫ్యూడల్ విధానాన్ని, పోలీస్‌యాక్షన్ అనంతరం రైతుల పరిస్థితిని ఎంతో వాస్తవికంగా, మరెంతో హృదయవిదారకంగా చూపించిన ఈ సినిమా ‘సినిమా కళ ప్రజల కోసమే’ అనీ ‘సామాజిక ప్రయోజనమే సినిమా కళ ఆశయం’ కావాలని నిరూపించింది.
ప్రముఖ దర్శకుడు శ్యామ్‌బెనెగల్ తీసిన అనుక్షిగహం(1978), తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని మూఢ విశ్వాసాల నేపథ్యంగా రూపొందగా,‘రంగుల కల’(1983) ఓ చిత్రకారుడి జీవన చిత్రంగా, దాసి(1988) సినిమా 1920ల నాటి తెలంగాణ గడీలలో దొరల ఏలుబడిలోని దాసిల జీవన వృత్తాంతాన్ని ‘పీరియడ్ కాస్ట్యూమ్ రియాలిటీ’గా ఆవిష్కరించింది. 1990లో వచ్చిన ‘మట్టి మనుషులు’ సినిమా హైదరాబాద్ నగరానికి వలస వచ్చిన పాలమూరు వలస కార్మికుల జీవన స్థితిగతులను కళ్లకు కట్టింది. ఇలా తెలంగాణ సినిమా ఆర్ట్ ఫిలిమ్‌కు ప్యారలల్ సినిమాకు నీరాజనం పలికింది.
కమర్షియల్ సినిమా:
తెలంగాణ సినిమా హార్ట్ సినిమాగానే కాకుండా మాస్ కమర్షియల్ సినిమాగా కూడా వర్కవుట్ అవుతుందని చెప్పాలి. తెలంగాణ నేపథ్య చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ కావడమే దీనికి నిదర్శనం. ఎన్‌కౌంటర్, ఒసేయ్ రాములమ్మ, కుబుసం వంటి సినిమాలే దీనికి ఉదాహరణ. కాగా, ఇప్పుడు సాగుతున్న ఉద్యమ స్ఫూర్తితో వీరతెలంగాణ, పోరు తెలంగాణ, ఇంకెన్నాళ్లు వంటి సినిమాలూ రూపొందాయి. అయితే పూర్తిస్థాయి మెయిన్ స్ట్రీం సినిమాగా ‘జై బోలో తెలంగాణ’ ఇప్పుడు తెలంగాణ సినిమాలకు ఓ దిక్సూచి అయింది.
తెలుగు సినిమా- తెలంగాణ సినిమా:
సాధారణంగా సీమాంధ్ర ప్రభావంతో రూపొందిన తెలుగు సినిమాలన్నీ కమర్షియల్ ఎంటర్‌టైనర్స్ మాత్రమే. కాగా, తెలంగాణ సినిమాలు క్రియేటివ్ ఎన్‌లైన్‌మెంట్‌కు తెర ఎత్తు సాక్ష్యాలుగా నిలిచాయి. నిజానికి తెలుగు సినిమాలన్నీ చెరువు దాటి వెళ్లని మొసలి వంటివి. చెరువులోనే దాని ప్రతాపమంతా. అందుకే ఈ సినిమాలు, తెలుగు మాట్లాడే సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాలను దాటి మొన్నమొన్నటి వరకూ వెళ్లలేదు. కానీ తెలంగాణ సినిమా మాత్రం ఏనాడో సరిహద్దులు దాటేసి అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. అంతర్జాతీయంగా తెలుగు సినిమాకు ఏమైనా పేరు, గుర్తింపు వచ్చిందంటే అది ముఖ్యంగా తెలంగాణ సినిమా వల్లనే అని చెప్పాలి.
ఇప్పటి వరకూ వచ్చిన తెలంగాణ సినిమాలు సంఖ్యాపరంగా 100కు లోపే(హైదరాబాదీ సినిమాలతో కలుపుకుని) ఉండొచ్చు. కానీ క్వాలిటీ పరంగా, సినిమా ఆర్ట్ పరంగా, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా ఒకటున్నదనే విషయాన్ని ప్రపంచానికి తెలియజేసింది, తెలియజేస్తున్నదీ తెలంగాణ సినిమానే అంటే అతియోశక్తి కాదు. ఆఖరికి ఇటీవలే తీసిన జై బోలో తెలంగాణ సినిమా కూడా సౌత్ ఆసియన్ ఫిలిం ఫెస్టివల్‌కు ఎంపిక కావడం దీనికి మంచి ఉదాహరణ.
అయితే తెలుగు సినిమా ఖ్యాతి గురించి చెప్పాల్సిన ప్రతిసారీ, చెప్పే ప్రతి వ్యక్తీ ‘శంకరాభరణం’, ‘స్వాతిముత్యం’ వంటి సినిమాల గురించే మాట్లాడతారు కానీ ‘మా భూమి’ గురించో, ‘దాసి’ గురించో మాట్లడరు. ఆ మాటకొస్తే అసలు ఈ సినిమాల ఉనికినే గుర్తించరు. గుర్తించే అవకాశాన్ని కూడా ప్రేక్షకులకు రాతల్లో కానీ, వేదికల మీద కానీ ఇవ్వరు. తెలుగు సినిమా రంగాన్ని శాసించే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్’ భవనంలోని గోడలపై ఎన్నెన్నో వాణిజ్య సినిమాల పోస్టర్లు ఫ్రేమ్‌లు కట్టి వేళాడదీస్తారు తప్ప ఒక్క తెలంగాణ సినిమా పోస్టర్ ఉండదు.
ఇక మనకన్నా వెనకబడిన సినిమా ఇండోనేషియా సినిమా. ఆ దేశ రాజధాని జకార్తాలో జరిగిన ఫిలింఫెస్టివల్లో ‘నర్తనశాల’ సినిమాకు ప్రశంసలొచ్చాయని ఇప్పటికీ గొప్పగా ఊదరగొడతారు. కానీ ఇండియన్ సినిమాకన్నా ఎన్నో తరాలు ముందున్న ‘మాస్కో ఫిలిం ఫెస్టివల్స్’లో అవార్డులను, ప్రశంసలను సాధించిన ‘దాసి’, ‘మట్టి మనుషులు’ గురించి సినీ పెద్దలు పొరపాటున కూడా మాట్లాడరు.
తెలుగు సినిమాకు జాతీయ అవార్డులు రావడం లేదని గొంతు చించుకునే చాలామంది సినీ పెద్దలు సైతం జాతీయ స్థాయిలో 5 అవార్డులను సాధించిన ఒకే ఒక్క తెలుగు సినిమాగా దాసి’ గురించి ఎక్కడైనా ప్రస్తావించారా? ప్రస్తావిస్తారా?
తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీ
ఇలాంటి వివక్ష ఫలితంగానే ఇపుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి తెలంగాణ సినిమా బయటపడింది. తెలంగాణ సినిమాల అభివృద్ధి కోసం, తెలంగాణ నిర్మాతలు, నటులు, కళాకారుల రక్షణ కోసం ఇపుడు ప్రత్యేక వ్యవస్థలు ఏర్పడ్డాయి. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, తెలంగాణ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లు అలాంటివే. వీటి కృషితో తెలంగాణ సినిమా’ రాబోయే కాలంలో సువ్యవస్థీకృతం అవుతుందనడంలో సందేహం లేదు. మార్కెట్‌పరంగా ఎంతో పొటెన్షియాలిటీ ఉన్న తెలంగాణ నైజాం ఏరియాలో కమర్షియల్‌గా సైతం విజయం సాధించి తెలంగాణ సినిమాకి ప్రేక్షకులు నీరాజనాలు పట్టేలా చేస్తుందని ఆశిద్దాం.
డిఫరెంట్ సినిమా
తెలంగాణ సినిమాను కొత్త పుంతలు తొక్కిస్తున్న సినిమా హైదరాబాదీ సినిమా. హైదరాబాదీ జీవనశైలి, తెలంగాణ- ఉర్దూల సత్సంగమ సంస్కృతి పునాదులపై రూపొందిన ఈ సినిమా మొదట నగేష్ కుకునూర్ తీసిన ‘హైదరాబాద్ బ్లూస్’(1998)తో మొదలైందని చెప్పాలి. కేవలం పదిహేడు రోజుల్లో 17 లక్షల వ్యయంతో తీసిన ఈ సినిమా తెలుగులోనే కాక మొత్తం భారత సినీ రంగంలోనే ఇండిపెండెంట్ ఫిల్మ్ మూవ్‌మెంట్‌కు, ‘క్రాసోవర్ సినిమా స్టయిల్’కు ద్వారాలు తెరిచింది. ‘హింగ్లిష్’ సినిమాలుగా పేరు పొందిన ఈ సినిమా మళ్లీ 2002 నుంచి సరికొత్తగా పూర్తి ఉర్దూ- తెలంగాణ నేపథ్యంలో సరదా కథాంశాలతో హైదరాబాదీ సినిమాగా నిలదొక్కుకుంది. అంగ్రేజ్’, సినిమాతో ఆరంభమైన ఈ ధోరణి ‘హైదరాబాద్ నవాబ్స్’, ‘జబర్‌దస్త్’ వంటి సినిమాలతో ఊపందుకుంది.
ఆ నలుగురు…
తెలుగు సినిమా నుంచి విడిపోయి ‘తెలంగాణ సినిమా’గా తనదైన ప్రత్యేకతను ప్రకటిస్తోంది తెలంగాణ సినిమా. దీనికోసం గత నాలుగు దశాబ్దాల కాలం నుంచి పునాదులు వేస్తూ తెలంగాణ సినీ భవనానికి నాలుగు దిక్కులా నిలిచిన దర్శకులు, దార్శనికుల గురించి ప్రస్తావించుకోవడం అవసరం. వీరే ఆ నలుగురు.
బి.ఎస్.నారాయణ
కరీంనగర్ జిల్లాకు చెందిన దర్శకుడు. ప్యారలల్ సినిమాల్లోనే ఓ మైలురాయిగా నిలిచిన నిమజ్జనం’ ‘ఊరుమ్మడి బతుకులు’ సినిమాలకు దర్శకత్వం వహించి తెలుగు వెండితెరపై రియలిస్టిక్ కథనాలకు మంచి పునాదులు వేశారు. వృద్ధాప్యంలో కంటి చూపు కోల్పోయాడు. అయినా అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తితో ‘మార్గదర్శి’ అనే సినిమాకు దర్శకత్వం వహించి ప్రపంచ సినీ చరివూతలోనే డైరెక్షన్ చేసిన అంధవ్యక్తిగా రికార్డు సృష్టించాడు.
బి. నరసింగరావు
తెలుగులో ఆర్ట్ ఫిలిమ్ మూవ్‌మెంట్‌కు ఆద్యుడు. మెదక్ జిల్లా ప్రజ్ఞాపూర్‌కు చెందిన ఈయన తీసిన సినిమాలన్నీ తెలంగాణ బతుకు చిత్రాలుగా నిలిచిపోయాయి. నిర్మాత, దర్శకుడు,నటుడు, సంగీతకారుడిగానూ, కవిగా, పెయింటర్‌గా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించే ఈయన తీసిన ఒక్కో సినిమా ఒక్కో జీవన దృశ్యం. ‘మా భూమి’ నిర్మాతగా మొదపూట్టి ‘రంగుల కల’లో నటుడిగా కనిపించి, ‘దాసి’ ‘మట్టి మనుషులు’ సినిమాలతో తెలంగాణ సినిమాకు జాతీయ అంతర్జాతీయ కీర్తిని సాధించిపెట్టారు. నిజమైన, నిజాయితీతో కూడిన తెలంగాణ సినిమాకు ఆది పునాది ఆయనే.
డాక్టర్ మందడి ప్రభాకర్ రెడ్డి
నల్గొండ జిల్లా తుంగతుర్తిలో జన్మించిన ఈయన వృత్తిరీత్యా వైద్యుడు. కానీ ఆసక్తికొద్దీ సినిమాల్లో చేరి 37 ఏళ్ల కెరీర్‌లో 472 సినిమాల్లో నటించి నటనలో తనదైన ముద్ర వేశారు. 1960లో ‘చివరకు మిగిలేది’ సినిమాతో నటుడిగా ప్రవేశించిన ప్రభాకర్ రెడ్డి రెండు సార్లు ఉత్తమనటుడిగా(1980లో యువతరం కదిలింది, 1981లో పల్లె పిలిచింది) నంది అవార్డులను సాధించారు. ఇలాంటి రికార్డు సృష్టించిన తెలంగాణ వ్యక్తిగానే కాదు తెలుగువాడిగా కూడా ప్రత్యేకతను నిలుపుకున్నారు. పండంటి కాపురం, కార్తీకదీపం, గృహవూపవేశం, పచ్చని సంసారం, ధర్మాత్ముడు వంటి దాదాపు 21 సినిమాలకు కథారచన కూడా చేసి నిఖార్సయిన సృజన కారుడిగా కీర్తి సాధించారు. కమర్షియల్ మెయిన్‌వూస్టీమ్ తెలుగు సినిమాల్లో కూడా విజయపతాకాన్ని ఎగరవేశారు.
నిమ్మల శంకర్
నల్గొండ జిల్లా చింతపల్లి గ్రామంలో జన్మించిన శంకర్ కమర్షియల్ మెయిన్ స్ట్రీమ్ ఫార్మాట్‌లోనే తనదైన కమిట్‌మెంట్‌తో సామాజిక చైతన్యం కలిగించే చిత్రాలను తీస్తున్నారు. 1997లో ఎన్‌కౌంటర్ సినిమాతో కెరీర్ మొదలుపెట్టి శ్రీరాములయ్య, జయం మనదేరా, భద్రాచలం వంటి సినిమాలతో మంచి దర్శకుడిగా పేరు సాధించారు. ఇక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో సమకాలీన పరిణామలను కథగా అల్లుకుని ఆయన తీసిన ‘జై బోలో తెలంగాణ’ సినిమా ‘మినియేచర్ ఆఫ్ ఎ మూమెంట్’గా ప్రశంసలు అందుకుంది. పరుగెత్తుతున్న కాలాన్ని పట్టుకుని లైవ్ చేయబడిన కథా చిత్రంగా ఈ సినిమా రేపటి తెలంగాణ సినిమాకు ఓ సిలబస్‌ను రూపొందించిందని చెప్పాలి.
నమస్తే తెలంగాణ సౌజన్యంతో