ఆగస్ట్ 15 కల్లా రాష్ట్రమంతటా 4జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దేశంలోనే తొలిసారిగా గ్రామీణప్రాంతాలతోపాటు రాష్ట్రమంతటా ఈ సేవలను అందించేందుకు రిలయన్స్ సంస్థ అంగీకరించింది. రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీఎన్ఎస్ ప్రసాద్, సౌత్ ఇండియా ఇన్చార్జి పీవీఎన్ మాధవరావు, ఇతర ప్రతినిధుల బృందం బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును కలిసి 4జీ సేవలకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను సీఎంకు వివరించారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో 85 శాతం పనులు, పట్టణాల్లో 65 శాతంకు పైగా పనులు పూర్తయ్యాయని రిలయన్స్ ప్రతినిధులు తెలిపారు. అతి త్వరలో మిగతా పనులను కూడా పూర్తి చేయనున్నామని, 4జీ సేవలతో ఎనేబుల్ స్టేట్ గా తెలంగాణ ఏర్పడబోతున్నదని వారు సీఎంకు చెప్పారని తెలిసింది.
రాష్ట్రంలో 4జీ సేవలు అందుబాటులోకి వస్తే ఐటీ పరిశ్రమలు, ఇతర పరిశ్రమలు రాష్ట్రంలో ఎక్కడైనా ఏర్పాటు చేయడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారని, భద్రతాపరమైన ఏర్పాట్లు చేసుకోవడానికి ఈ సేవల వల్ల వీలుకలుగుతుందని రిలయన్స్ ప్రతినిధులు చెప్పారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.