mt_logo

హైదరాబాద్ పరిధిలో 450 క్రీడా ప్రాంగణాలు

సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు విద్యార్థుల్లో, యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు శరీర దృఢత్వం, మానసిక ఉల్లాసం కల్పించేందుకు తెలంగాణ పట్టణ క్రీడా పథకం ద్వారా గ్రేటర్‌ పరిధిలో 450 క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తున్నట్లు నగర డిప్యూటీ మేయర్‌ శ్రీలత శోభన్‌ రెడ్డి అన్నారు. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ తరగతులు 47 రోజుల పాటు నిర్వహించిన నేపథ్యంలో బుధవారం సికింద్రాబాద్‌ జోన్‌ సమ్మర్‌ కోచింగ్‌ ముగింపు సమావేశం మారేడ్‌పల్లి గ్రౌండ్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో జనాదరణ పొందిన క్రీడల్లో నిష్ణాతులైన క్రీడాకారులు రాణించడం, నైపుణ్యత పెంపొందించడం కోసం సీఎం కేసీఆర్‌ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తెలంగాణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. తెలంగాణ అర్బన్‌ క్రీడా ప్రాంగణం కార్యక్రమం ద్వారా వార్డుకు 3 ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటి వరకు 45 చోట్ల ఏర్పాటు చేసినట్లు తెలిపారు. లాలాపేట్‌లో నూతనంగా చేపట్టిన స్విమ్మింగ్‌ పూల్‌ త్వరలో పూర్తి అవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జోనల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ రెడ్డి, డిప్యూటీ కమిషనర్‌లు, సీతాఫల్‌ మండి కార్పొరేటర్‌ సామల హేమ, తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *