రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ చొరవతో జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌లో 24 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఉన్న 20 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంతో పాటు అదనంగా మరో 24 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. 15 ఎకరాల విస్తీర్ణంలో రూ.500 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పనులను 18 నెలల్లో పూర్తి చేయనున్నారు. ఇందుకు జీహెచ్‌ఎంసీ, శివారు ప్రాంతాల నుంచి వచ్చే చెత్తను పూర్తిగా వినియోగించనున్నారు. ఫలితంగా డంపింగ్ యార్డునుంచి వచ్చే దుర్వాసన దూరం కానుంది.
జవహర్‌నగర్ డంపింగ్‌యార్డులో ప్రస్తుతం ఉన్న 20 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి ప్రతిరోజు సుమారు 3,300 మెట్రిక్ టన్నుల చెత్తను వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న 24 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి ప్రతి రోజు మరో 4 వేల మెట్రిక్ టన్నుల చెత్తను వినియోగించాల్సి వస్తుంది. రెండు కేంద్రాలకు కలిపి రోజుకు 7వేల పైచిలుకు మెట్రిక్ టన్నుల చెత్త అవసరం. అయితే నగరంలోని జీహెచ్‌ఎంసీ, శివారు ప్రాంతాల నుంచి ప్రతిరోజు 7400 మెట్రిక్ టన్నుల చెత్త డంపింగ్‌యార్డుకు వస్తుంది. రెండు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు అందుబాటులోకి వస్తే డంపింగ్‌యార్డులో చెత్త నిల్వలు ఉండక పోవడంతో పాటు దుర్వాసనకు శాశ్వత పరిష్కారం లభించనున్నదని అధికారులు పేర్కొంటున్నారు.