mt_logo

119 బీసీ గురుకులాల్లో నియామకాలు..

కొత్త సంవత్సరం నిరుద్యోగుల్లో సంతోషాన్ని నింపింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందజేసింది. రాష్ట్రంలో 2019-20 విద్యా సంవత్సరంలో కొత్తగా ప్రారంభించనున్న 119 మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల విద్యాలయాల్లో బోధన, బోధనేతర సిబ్బందిని భర్తీ చేసేందుకు 4,322 పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈమేరకు ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి కే రామకృష్ణారావు సోమవారం ఉత్తర్వులు అందజేశారు.

రెగ్యులర్ పోస్టులు 3,717(బోధన సిబ్బంది పోస్టులు 3,689, సంస్థ ప్రధాన కార్యాలయంలో 28), 605 ఔట్ సోర్సింగ్ పోస్టులు(బోధన సిబ్బంది పోస్టులు 595, సంస్థ ప్రధాన కార్యాలయంలో 10 పోస్టులు) ఉన్నాయి. బోధన సిబ్బంది పోస్టులు మొత్తం 3,689 ఉండగా, 2019-20 విద్యాసంవత్సరంలో 1,904 పోస్టులను, సంస్థ ప్రధాన కార్యాలయంలోని 28 రెగ్యులర్ పోస్టులను భర్తీ చేస్తారు. ఇదిలావుండగా ఔట్ సోర్సింగ్ లో మొత్తం 605 పోస్టులను కూడా ఈ ఏడాదే భర్తీ చేస్తారు. మిగిలిన బోధనా సిబ్బంది పోస్టులను విడతలవారీగా భర్తీ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మొత్తం ఉన్న 4,322 పోస్టులకు గానూ ఈ విద్యాసంవత్సరంలో 2,537 పోస్టులు భర్తీ చేస్తారు. బోధనా సిబ్బందిలో మిగిలిన 1,785 పోస్టులు విడతలవారీగా భర్తీ కానున్నాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *