కోవిడ్-19 నిబంధనల ప్రకారం సభ్యులకు మధ్య దూరం ఉండేలా అసెంబ్లీ హాల్ లో చర్యలు తీసుకుంటున్నారు. ఈనెల 7వ తేదీనుండి శాసనసభ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. కరోనా వ్యాప్తి దృష్ట్యా శాసనసభలో 40 సీట్లు, మండలిలో 8 సీట్లు కొత్తగా ఏర్పాటు చేశామని శాసనసభా వ్యవహారాల శాఖామంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నిర్వహణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఇతర అధికారులతో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, చీఫ్ విప్ లు హాజరయ్యారు.
అనంతరం వేముల ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలకు ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధంగా ఉందని, కోవిడ్ నేపథ్యంలో ప్రభుత్వం తరపున అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. శాసనసభ, మండలి హాల్ లో ఆరు అడుగుల దూరం ఉండేలా సీట్ల ఏర్పాటు చేశామని, పార్లమెంట్ ఇచ్చిన మార్గదర్శకాలు పాటిస్తూ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని వివరించారు. శాఖల వారీగా అవసరం ఉన్న అధికారులు మాత్రమే అసెంబ్లీకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
మార్షల్స్ రెండు రోజులముందే కరోనా పరీక్షలు చేయించుకోవాలని, అసెంబ్లీకి వచ్చే అధికారులు, ఇతర సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తామని, అసెంబ్లీ సెక్రెటరీ ఆధ్వర్యంలో మీడియా సిబ్బందికి కోవిడ్ టెస్టులు నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. శాసనసభ, మండలిలో రెండు చొప్పున అంబులెన్సులు, పీపీఈ కిట్లు, ర్యాపిడ్ కిట్లు, ఆక్సీమీటర్లు అందుబాటులో ఉంచుతామని, జీహెచ్ఎంసీ సిబ్బందితో ప్రతి రోజూ అసెంబ్లీతో పాటు ఎమ్మెల్యే క్వార్టర్స్ ను కూడా సానిటైజ్ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.