దేశంలోనే అతిపెద్ద జాతీయ పుస్తక ప్రదర్శనకు హైదరాబాద్ సిద్ధమవుతోంది. ఈ నెల 22 నుంచి జనవరి 1 వరకు జరగనున్న పుస్తక ప్రదర్శన కోసం లోయర్ ట్యాంక్ బండ్ లోని కళాభారతి మైదానంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈసారి బుక్ ఎగ్జిబిషన్‌లో మొత్తం 300 స్టాళ్లు ఉండనున్నాయి. 10లక్షల పుస్తకాలు ప్రదర్శనలో కొలువుదీరనున్నాయి. ఈ సాహిత్య వేడుకను హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతియేటా డిసెంబర్‌లో నిర్వహిస్తున్న విషయం విదితమే. అయితే పుస్తక పఠనాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం బుక్ ఫెయిర్ సొసైటీకి ప్రోత్సాహాన్ని అందజేస్తున్నది.
దేశంలోనే అతిపెద్ద పుస్తక ప్రదర్శనగా పేరుగాంచిన హెచ్‌బీఎఫ్‌లో తెలుగు, హిందీ, ఇంగ్లిష్, ఉర్దూతో పాటు ఇతర భారతీయ భాషల సాహిత్యం లభిస్తుంది. దీంతో పాటుగా బాల సాహిత్యం, అభ్యుదయ సాహిత్యం, పురాణ సాహిత్యం, నవలలు, కథలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, కథల పుస్తకాలు పుస్తక ప్రియులకు అందుబాటులో ఉంటాయి. వీటితోపాటు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం, విద్యార్థుల కోసం స్టడీ మెటీరియల్స్ వివిధ పబ్లికేషన్స్ వారి మెటీరియల్స్ కూడా ఈ పుస్తక ప్రదర్శనలో లభించనున్నాయి.
గ్రామీణ గ్రంథాలయాల కోసం పుస్తకాల వితరణ..
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామీణ గ్రంథాలయాల కోసం హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో పుస్తకాలను వితరణ చేయడం ప్రత్యేకత. ప్రతియేటా బుక్స్ డొనేషన్ చేసిన వారి నుంచి సేకరించిన పుస్తకాలను ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, విఠలాచార్య లాంటి ప్రముఖుల గ్రామాల్లో గ్రంథాలయాలకు అందజేసినట్లు హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్, కార్యదర్శి కోయ చంద్రమోహన్ వెల్లడించారు. బుక్ ఎగ్జిబిషన్ మధ్యాహ్నం 2గంటల నుంచి రాత్రి 8.30వరకు కొనసాగనుంది. శని, ఆదివారంతోపాటు ఇతర సెలవు రోజుల్లో మాత్రం మధ్యాహ్నం 1 గంట నుంచే ప్రారంభమై రాత్రి 9గంటల వరకు కొనసాగనుందని వారు పేర్కొన్నారు.