mt_logo

రాష్ట్రంలో మరో 33 బీసీ గురుకుల విద్యాలయాలు : మంత్రి గంగుల కమలాకర్

రాష్ట్రంలో మరో 33 బీసీ గురుకుల విద్యాలయాలు, 15 బీసీ డిగ్రీ కళాశాలలను సీఎం కేసీఆర్ మంజూరు చేశారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో సీఎం కేసీఆర్ విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, అందులో బీసీల విద్యపై ప్రధానంగా దృష్టి సారించారని అన్నారు. గురువారం కరీంనగర్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… తెలంగాణ రాకముందు రాష్ట్రంలో కేవలం 19 బీసీ గురుకులాల్లో కేవలం 7,500 మంది మాత్రమే చదువుకునే వారని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ చొరవతో 261 బీసీ గురుకులాలు ఏర్పడ్డాయని, ఇందులో ప్రస్తుతం 1,52,440 మంది బీసీ విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని అన్నారు. కొత్తగా మరో 33 బీసీ గురుకులాలను, 15 బీసీ డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేశారని, దీంతో 294 గురుకులాలు, 16 డిగ్రీ కళాశాలలు పనిచేస్తాయన్నారు.

కొత్తగా ఏర్పాటు చేసిన ప్రతి గురుకులంలో 240 సీట్లు, డిగ్రీ కళాశాలలో 1200 సీట్లు ఉంటాయన్నారు. గురుకులాల్లో 5,6,7వ తరగతుల నుంచి ఈ విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లు తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం డిమాండ్ ఉన్న 8 కోర్సులను డిగ్రీ కళాశాలల్లో ప్రవేశ పెడతామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. గురుకులాలను ప్రతి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, తాత్కాలికంగా అద్దె భవనాల్లో ఏర్పాటు చేసేందుకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామన్నారు. గురుకుల హాస్టళ్లలో నాణ్యమైన భోజనం, మెరుగైన సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *