ఎండనక, వాననక, కాలుష్యంలో మగ్గుతూ విధులు నిర్వహించే ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు 30 శాతం అదనపు వేతనం పెంచుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో ట్రాఫిక్ కానిస్టేబుళ్లను ఆదుకుంటామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయానికి సంబంధించి వారికి 30శాతం అదనపు వేతనం చెల్లించాలంటూ డీజీపీ అనురాగ్ శర్మ సమర్పించిన నివేదికకు కేసీఆర్ ఆమోదం తెలిపారు.
రాష్ట్ర తొలి బడ్జెట్ లో పోలీసు శాఖకు కూడా భారీగా నిధులు కేటాయించేందుకు ఆయన అంగీకరించారు. 30 శాతం అదనపు వేతనం చెల్లించడం ద్వారా రాష్ట్ర ఖజానాపై 20కోట్ల అదనపు భారం పడుతుందని పోలీసు ఉన్నతాధికారులు మీడియాకు తెలిపారు. పోలీసు శాఖకు సంబంధించి ఏసీబీ, అప్పాలో పనిచేస్తున్న వారికి 30 శాతం, గ్రే హౌండ్స్ లో పనిచేస్తున్న సిబ్బందికి 60శాతం అదనపు వేతనం చెల్లిస్తున్నారు. ఇప్పటికే పోలీసు శాఖకు కొత్త వాహనాలు, రాష్ట్రవ్యాప్తంగా పోలీసు స్టేషన్ల నిర్వహణ వ్యయాన్ని పెంచే దిశగా చర్యలు మొదలయ్యాయి.