mt_logo

ఆంధ్రాకు 3.5 టీఎంసీల తాగునీరు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా డెల్టాకు తాగునీటి అవసరాలకు 3.5 టీఎంసీల నీటిని కేటాయించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. 10 టీఎంసీల నీరు కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర జలసంఘం చైర్మన్, కృష్ణా వాటర్ మేనేజిమెంటు బోర్డు ఇన్చార్జి ఏబీ పాండ్య ముందు వాదించినా లాభం లేకపోయింది. తాగునీటి అవసరాలకోసం వారం రోజులపాటు 6 వేల క్యూసెక్కుల చొప్పున మొత్తం 3.5 టీఎంసీల నీటిని మాత్రమే వాడుకునేందుకు అనుమతి ఇచ్చారు.
ఈ విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో కలిసి గవర్నర్ ను మంగళవారం కలుసుకుని నాగార్జునసాగర్ రిజర్వాయర్ లో ఉన్న వాస్తవ నీటి నిల్వల పరిస్థితిని వివరించారు. తాగునీరు కాకుండా సాగుకు కూడా నీరు కేటాయిస్తే తెలంగాణ పరిస్థితి అధ్వాన్నంగా మారుతుందని గవర్నర్ కు తెలిపారు.

అంతకుముందు నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అధికారులతో సమావేశమై రిజర్వాయర్ల పరిస్థితిని సమీక్షించారు. నాగార్జునసాగర్, శ్రీశైలం లలో భారీ స్థాయిలో నీటినిల్వలు పడిపోతున్న తరుణంలో ఏపీ కోరిన 10 టీఎంసీల నీటిని కేటాయించలేమని తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. అయినా ఏపీ ప్రభుత్వం వాదనకు దిగడంతో కేంద్ర జలవనరుల సంఘం చైర్మన్ పాండ్య మంగళవారం ఉదయం హైదరాబాద్ వచ్చారు. రెండు ప్రభుత్వాల వాదనలు విన్న ఆయన ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వానికి 3.5 టీఎంసీల నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. వారం రోజులపాటు కృష్ణా డెల్టాకు 3.5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని, అప్పటికీ వర్షాలు పడకపోతే పరిస్థితిని బట్టి తగిన నిర్ణయం తీసుకోవాలని అన్నట్లు తెలిసింది.

పాండ్య ఇచ్చిన ఆదేశాలమేరకు కృష్ణా డెల్టా పరిధిలోని సీమాంధ్ర ప్రాంతానికి ఆరువేల క్యూసెక్కుల నీటిని వారం రోజులపాటు సరఫరా చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. ఈ నీటిని తాగునీటి అవసరాలకే వాడుకోవాలని షరతు విధించింది. వాస్తవానికి నాగార్జునసాగర్ కనిష్ట నీటి మట్టం 510 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి నిల్వ 517 అడుగులకు పడిపోయింది. ఇప్పుడు ప్రాజెక్టులో కేవలం 13 టీఎంసీల నీళ్ళు మాత్రమే ఉన్నాయి. శ్రీశైలంలో 834 అడుగుల మేర నీటి నిల్వలు ఉండటంతో నీటి విడుదలకు మార్గదర్శకాలు ఒప్పుకోవని నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *