mt_logo

ఆగస్టు మొదటివారం నుంచి జీహెచ్ఎంసీలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ: మంత్రి కేటీఆర్

మంత్రి ఆదేశాల మేరకు ఆరు దశల్లో పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేసేందుకు షెడ్యూల్ విడుదల చేసిన జీహెచ్ఎంసీ

ఆగస్టు నుంచి అక్టోబర్ మూడవ వారం నాటికి దాదాపు 70 వేల ఇళ్లను పేదలకు అందించనున్న ప్రభుత్వం

లబ్ధిదారుల ఎంపిక అత్యంత పారదర్శకంగా ఉండాలని ఆదేశించిన మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగర పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని అర్హులైన లబ్ధిదారులకు అందించే కార్యక్రమానికి ప్రభుత్వం త్వరలో శ్రీకారం చుట్టబోతున్నట్లు పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో లక్ష ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకొని వాటిని వేగంగా పూర్తి చేస్తున్నదని, ఇప్పటికే ఇందులో అత్యధిక భాగం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తయిందన్నారు. మిగిలిన చోట్ల నిర్మాణ పనులు తుది దశలో ఉన్నాయన్నారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకొని పంపిణీకి సిద్ధంగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు అందించే కార్యక్రమానికి సంబంధించి జీహెచ్ఎంసీ ఒక షెడ్యూల్ సిద్ధం చేసింది. లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమానికి సంబంధించిన అంశంలో రెవెన్యూ యంత్రాంగం నుంచి మద్దతు తీసుకొని ముందుకుపోనున్నది. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం లబ్ధిదారుల ఎంపికను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన మార్గదర్శకాలు మేరకు ఈ ఎంపిక ప్రక్రియను పకడ్బందీగా చేపట్టేందుకు అధికారులు నిర్ణయించారు.

ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అందేలా చూడాలని పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు ఈరోజు జరిగిన సమీక్ష సమావేశంలో జిహెచ్ఎంసి అధికారులకు ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న జిల్లా కలెక్టర్ల సహకారం తీసుకోవాలని సూచించారు. పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీకి సంబంధించిన షెడ్యూల్ ని సిద్ధం చేసింది. ఇప్పటిదాకా ఇన్ సిట్యూ (in -situ) ప్రాంతాల్లో నిర్మించినదాదాపు నాలుగువేల ఇండ్లకు పైగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పేదలకు అందించింది. జిహెచ్ఎంసీ రూపొందించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ షెడ్యూల్ ప్రకారం ఆగస్టు మొదటి వారంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ ప్రారంభం అవుతుంది. అక్టోబర్ మూడవ వారం వరకు కొనసాగుతుంది. దాదాపు 6 దశల్లో ఇప్పటికే పూర్తయిన సుమారు 65 వేల కు పైగా పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పేదలకు అందిస్తారు. వీటికి అదనంగా నిర్మాణం తుది దశలో ఉన్న ఇండ్లను కూడా ఎప్పటికప్పుడు ఈ పంపిణీ కార్యక్రమానికి అదనంగా జత చేసే అవకాశం ఉన్నది.