mt_logo

కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా 299 టీఎంసీలు..

కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి 299 టీఎంసీల వాటా లభించింది. దీంతో నదీజలాలను ఏవిధంగా వినియోగించుకోవాలన్న దానిపై తెలంగాణకు పూర్తి స్వేచ్ఛ లభించింది. కృష్ణా నది బేసిన్ లో మనకు లభించిన వాటా మేరకు మనం ఏ ప్రాజెక్టు నుంచైనా నీటిని పొందడానికి, వినియోగించుకోవడానికి పూర్తి అధికారం వచ్చింది. కృష్ణా నది నిర్వహణ బోర్డు అదనపు కార్యదర్శి అమర్జీత్ సింగ్ అధ్యక్షతన తెలంగాణ, ఏపీ రాష్ట్రాల సాగునీటి శాఖ కార్యదర్శులు, ఇంజినీర్లు, తెలంగాణ రాష్ట్ర సాగునీటి సలహాదారు విద్యాసాగర్ రావు సమావేశమై కృష్ణా జలాల పంపిణీపై రెండు రోజులపాటు సుదీర్ఘ చర్చలు జరిపారు.

బచావత్ ట్రిబ్యునల్ తీర్పుకు అనుగుణంగా మొత్తం 811 టీఎంసీల కృష్ణా నికర జలాల్లో మనకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీలు కేటాయించగా, మనకు కేటాయించబడ్డ నీటిని ఏవిధంగానైనా మనం వాడుకునే స్వేచ్ఛ లభించింది. అయితే రానున్న ఏడాదికి మాత్రమే ఈ ఒప్పందం వర్తిస్తుంది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని, మినిట్స్ ను కృష్ణానది రివర్ బోర్డు కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖకు పంపుతుంది. అక్కడినుండి ప్రత్యేకమైన నోట్ తో పాటు ఈ ఒప్పందం రెండు రాష్ట్రాలకూ చేరుతుంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదం తర్వాత కేంద్రం నుండి వచ్చే ఆదేశం మేరకు బోర్డు వీటిని రెండు రాష్ట్రాలకు మళ్ళీ పంపుతుంది. అప్పటినుండి ఇది అమల్లోకి వస్తుంది.

మరికొన్ని కీలక నిర్ణయాలకు కూడా బోర్డు సమావేశంలో ఆమోదం లభించింది. విద్యుత్ ఉత్పత్తి కోసం శ్రీశైలం డ్యాంను మనం వినియోగించుకుంటున్నాం కాబట్టి ఇక్కడినుండి చెన్నై నగరానికి తాగునీటి అవసరాల నిమిత్తం సరఫరా చేస్తున్న 5 టీఎంసీలు, శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్(ఎస్సార్బీసీ) కి సరఫరా చేస్తున్న 19 టీఎంసీల నీటికి ఇబ్బంది కలుగకుండా విద్యుత్ ను ఉత్పత్తి చేసుకోవచ్చు. రాజోలి బండ డైవర్షన్ స్కీం కింద తుంగభద్ర జలాలు మనకు చాలాకాలం నుండి రావడంలేదు కాబట్టి కేసీ కెనాల్ దగ్గర గేట్లు బద్దలు కొట్టడం లాంటి సంఘటనలను దృష్టిలో పెట్టుకుని కృష్ణా బోర్డు ఈ విషయంలో చొరవ తీసుకోవాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రోజువారీ కార్యకలాపాలను నిర్వహించుకోవడం కోసం రెండు రాష్ట్రాల తరపున ఇంజినీర్-ఇన్-చీఫ్ లు, బోర్డు నుండి చీఫ్ ఇంజినీర్ స్థాయి అధికారి ఒకరు సభ్యులుగా ఉండే వర్కింగ్ మేనేజ్ మెంట్ కమిటీ సమీక్ష జరుపుతుంది. ఏ రాష్ట్రం ఎంతమేర నీటిని వినియోగించుకున్నదనే వివరాలను బోర్డు నిర్వహిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *