• 263 కోట్లతో వేసవి తాగునీటి ఎద్దడి నివారణకు ప్రణాళిక
• 45 రోజుల క్షేత్ర స్ధాయి సమీక్ష తరువాత సమర్ధవంతమైన ప్రణాళిక రూపొందించిన గ్రామీణ నీటి పారుదల శాఖ
• గ్రామాల్లోని నీటి వనరుల మరమత్తులు పూర్తి
• అవసరమైన జనవాసాలకి ట్యాంకర్లతో సరఫరా
• జిల్లాల వారీగా వేసవి ప్రణాళికల రూపకల్పన
• తాగునీటి పంపుసెట్లకి విద్యుత్ కనెక్షన్ తొలగించవద్దని కలెక్టర్లని అదేశించిన మంత్రి
వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు గ్రామీణ నీటి పారుదల శాఖ తరపున సమర్ధవంతమైన ప్రణాళిక రూపొందించినట్టు పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు తెలియజేశారు. గ్రామ స్ధాయిలో అవసరమయ్యే తాగు నీటి అవసరాలను గత కొద్దిరోజులుగా పూర్తిస్దాయిలో సమీక్షించిన తరువాత ఈ ప్రణాళికను తయారు చేసినట్టు అయన తెలిపారు. 2015 వేసవి తాగునీటి సమస్యల నివారణ ప్రణాళిక ద్వారా 263 కోట్ల రూపాయాలు ఖర్చు చేసి తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోబోతున్నట్టు మంత్రి తెలిపారు. గ్రామీణ నీటి పారుదల శాఖ అధికారులు ఈ ప్రణాళిక రూపకల్పన కోసం ప్రిబ్రవరి 1 నుండి మార్చి 15 తేది వరకి 45 రోజులపాటు ప్రతి గ్రామంలోని నీటి వనరులు, వాటికి అవసరమైన మరమత్తులు పూర్తి చేయడంతో పాటు, ఇంకా ఇతర అవసరాలకోసం కావాల్సిన నిధుల వివరాలతో కూడిన సమగ్రమైన నివేదికను రూపొందించారని మంత్రి వెల్లడించారు. ఈ క్రాష్ పోగ్రామ్ లోభాగంగా గ్రామాల్లోని స్ధానిక సంస్ధల ప్రతినిధులు, పంచాయితీరాజ్ శాఖాధికారులతో కలిసి ఈ ప్రణాళికను అర్ డబ్యూయస్ శాఖ రూపోదించిందని మంత్రి తెలియజేశారు. ప్రత్యేకంగా ప్రతి జిల్లాకి వేసవి ప్రణాళికలు తయారు చేసినట్టు ఆయన తెలిపారు. మెత్తం జిల్లాల వారీగా అందిన యాక్షన్ ప్లాన్ల అధారంగా ఈ వేసవి ప్రణాళికను సిద్దం చేశామని, వేసవిలో తాగునీటి ఇబ్బందులు రాకుండా చూస్తామన్న నమ్మకాన్ని మంత్రి కె.తారక రామారావు వ్యక్తం చేశారు.
ఈ 263 కోట్ల రూపాయల వేసవి తాగునీటి సమస్యల నివారణ ప్రణాళిక ద్వారా గ్రామాల్లో ఉన్న తాగునీటి బోర్లను మరమత్తులు చేయడంతో పాటు, అవసరమైన బోర్లను మరింత లోతుగా తవ్వుతారన్నారు. వీటితోపాటు నీటి వనరుల అనుసంధానానికి అవసరమైన చోట్ల పైపులైన్ల నిర్మాణం, మరమత్తులు పూర్తి చేస్తామన్నారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న రక్షిత మంచినీటి పథకాల నిర్వహణని/ మరమత్తులు చేయడం ద్వారా నీటి ఎద్దడి రాకుండా ప్రయత్నిస్తమన్నారు. అందుబాటులో ఉన్న నీటి వనరులు పూర్తిగా ఇంకిపోతే, అలాంటి జనావాసాలకి ట్యాంకర్లతో నీటి సరఫరా చేసేందుకు ఏర్పాట్లు సిద్దం చేశామని, అందుబాటులో ఉన్న ప్రయివేట్ బోర్ వెల్స్ ని సైతం తమ శాఖాధికారులు గుర్తించారన్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్లతో ప్రత్యేకంగా మాట్లాడి తాగునీటి పంపుసెట్లకి ఎట్టి పరిస్ధితుల్లో విద్యుత్ కనెక్షన్లు తొలగించవద్దని అదేశించామన్నారు.