గ్రేటర్ హైదరాబాద్ వాసులకు ప్రధానంగా రవాణా సౌకర్యం, వాహన కాలుష్యాన్ని తగ్గించడం, సిగ్నల్ ఫ్రీ రవాణా వ్యవస్థను మెరుగు పరచడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. వాహనదారులు గమ్యస్థానానికి సకాలంలో చేరడానికి స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ (ఎస్‌ఆర్‌డీపీ) ప్రోగ్రాం ద్వారా చేపట్టిన పలు పనులను అందుబాటులోకి తీసుకువస్తున్నది. ఇందులో భాగంగా నిర్మిస్తున్న ఫ్లైఓవర్లలో శిల్పా లే అవుట్ వద్ద నిర్మించిన 17వ ఫ్లైఓవర్‌ను ఈ నెల 20న పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేత ప్రారంభానికి సిద్ధమైంది.
ఓఆర్‌ఆర్ నుంచి గతంలో ఉన్న గచ్చిబౌలి ఫ్లై ఓవర్ పై నుంచి శిల్పా లే అవుట్ వరకు, అక్కడ నుంచి ఓఆర్‌ఆర్ వరకు రెండు వైపులా కలుపుకుని మొత్తం 956 మీటర్ల పొడవు, 16.60 మీటర్ల వెడల్పు గల ఫ్లై ఓవర్ చేపట్టారు. అప్ ర్యాంపు ఓఆర్‌ఆర్ నుంచి శిల్పా లే అవుట్ ఫ్లై ఓవర్ వరకు 456.64 మీటర్ల వెడల్పు, శిల్పా లే అవుట్ నుంచి ఓఆర్‌ఆర్ వరకు డౌన్ ర్యాంపు ఫ్లై ఓవర్ 399.952 మీటర్ల వెడల్పుతో రెండు ఫ్లై ఓవర్‌లను చేపట్టారు. సర్వీస్ రోడ్డుగా ఉపయోగించబడే గచ్చిబౌలి నుంచి మైండ్ స్పేస్ వరకు 473 మీటర్ల పొడవు, 8.50 మీటర్ల వెడల్పుతో అప్ ర్యాంపు ఫ్లై ఓవర్‌ను చేపట్టారు. అదే విధంగా మైండ్ స్పేస్ నుంచి గచ్చిబౌలి వరకు డౌన్ ర్యాంపు ఫ్లై ఓవర్ 522 మీటర్ల పొడవు, 8.50 మీటర్ల వెడల్పుతో చేపట్టారు. శిల్పా లే అవుట్ ఫ్లై ఓవర్ వల్ల ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్‌సిటి మధ్య రోడ్ కనెక్టివిటీ పెరుగుతుంది. గచ్చిబౌలి జంక్షన్ ట్రాఫిక్ సమస్యలకు ఉపశమనం కలుగుతుంది. హెచ్‌కెసీ, మీనాక్షి టవర్ ప్రాంతాల్లో అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది.
ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టు స్టేజీ 2లో భాగంగా ఓఆర్‌ఆర్ నుంచి కొండాపూర్ వరకు 816 మీటర్ల పొడవు, 24 మీటర్ల వెడల్పుతో చేపడుతున్న ఫ్లై ఓవర్ పనులు కొనసాగుతున్నాయి. పాత గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌కు ఆనుకొని అప్ ర్యాంపు కొండాపూర్ వైపు 475 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పు ఫ్లై ఓవర్, కొండాపూర్ నుంచి గచ్చిబౌలి డౌన్ ర్యాంపు 305 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో ఫ్లై ఓవర్ నిర్మాణం వల్ల ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి. ఈ ఫ్లై ఓవర్‌ను 2023, జూలై వరకు పూర్తి చేయనున్నారు.