తెలంగాణ ప్రభుత్వం గురుకుల విద్యాలయాలను నిర్వహించే విధానం చాలా బాగుందని 15వ ఆర్ధిక సంఘం సభ్యులు ప్రశంసించారు. విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలు, ప్రత్యేక విద్యాబోధన, నిర్వహణకు అందించే నిధులు, ఇతర విధానాలను వారు అభినందించారు. గౌలిదొడ్డిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలను బుధవారం 15వ ఆర్ధిక సంఘం సభ్యులు డాక్టర్ అశోక్ లాహిరి, డాక్టర్ రవి కోట, అరవింద్ మెహతా సందర్శించారు.
అనంతరం బంజారాహిల్స్ లోని మీ సేవ కమిషనర్ కార్యాలయాన్ని కూడా 15వ ఆర్ధిక సంఘం సభ్యులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో మీ సేవల పనితీరు అభినందనీయమని, తెలంగాణ మీ సేవ పనితీరును ఇతర రాష్ట్రాలు స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పారు. ప్రజలకు అందిస్తున్న పారదర్శక సేవల గురించి ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, మీ సేవ కమిషనర్ జీటీ వెంకటేశ్వర్ రావు ఆర్ధికసంఘం సభ్యులకు వివరించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత మీ సేవల ద్వారా టెక్నాలజీ వినియోగం, జరిగిన అభివృద్ధిని తెలిపారు. రాష్ట్రంలో టీ-యాప్ పోలియో, టీ-వాలెట్, సమగ్ర వేదిక యాప్ ల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సేవలను సభ్యులకు వివరించారు.