హైదరాబాద్ లోని హోటల్ కాకతీయలో 14వ ఆర్ధికసంఘ సభ్యులతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సమావేశమయ్యారు. రాష్ట్ర స్థితిగతులపై, రాష్ట్ర అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను సీఎం ఆర్ధిక సభ్యులకు వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ వివక్షకు గురైందని, తెలంగాణలో చాలా జిల్లాలు వెనుకబడి ఉన్నాయని, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలు మరింత వెనుకబడి ఉన్నాయని, హైదరాబాద్ రాష్ట్ర ఆదాయంలో అగ్రస్థానంలో ఉందని వారికి తెలిపారు.
ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాల ద్వారా వచ్చే ఐదేళ్ళలో అభివృద్ధి వేగమవుతుందని, దళితులకు మూడు ఎకరాల భూ పంపిణీ కార్యక్రమం చేపట్టామని చెప్పారు. రాష్ట్రం తీవ్ర విద్యుత్ కొరత ఎదుర్కొంటుందని, వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ద్వారా ఇంటింటికి తాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఇటీవలే నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే విజయవంతమైందని వివరించారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఆర్ధిక సంఘం సహాయ, సహకారాలు అందించాలని, రాష్ట్రాభివృద్ధి కోసం తెలంగాణకు ప్రత్యేక హోదా కల్పించే విధంగా కేంద్రానికి సిఫార్స్ చేయాలని, రాష్ట్రానికి వచ్చే నిధుల కోసం కేంద్రానికి ప్రతిపాదించాలని ఆర్ధిక సంఘాన్ని కోరుతున్నామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.