రెండవ రోజు రూ.1218.38 కోట్ల రైతుబంధు సహాయాన్ని రైతుల అకౌంట్లలో జమ చేసినట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రకటించారు. 24 లక్షల ఎకరాలకు గాను ఈ నిధులు జమ చేసినట్టు తెలిపారు. తెలంగాణాలో వ్యవసాయాన్ని అభివృద్ధి బాట పట్టించేందుకే సీఎం కేసీఆర్ రైతులకు ఈ నగదు సహాయాన్ని అందిస్తున్నారని మంత్రి అన్నారు. రైతుబంధు, ఏడాది మొత్తం సాగునీరు, రైతుభీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ వంటి పథకాలతో రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందని… దీంతో రైతులు వ్యవసాయం చేస్తూ ఆర్థికంగా పురోగతి చెందుతున్నారని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రైతులు విత్తనాల కోసం లైన్లలో నిలబడి, ఎరువుల కోసం లాఠీదెబ్బలు తిన్న పరిస్థితుల నుండి… తెలంగాణ ఏర్పడ్డాక ప్రతీది రైతు ముంగిట్లోకి ఉచితంగా వస్తోందని మంత్రి అన్నారు. రైతుల కోసం, వ్యవసాయం బాగు కోసం సీఎం కేసీఆర్ చేపట్టిన చర్యల వల్ల ఎనిమిదేళ్లలో వరి ధాన్యం, పత్తి ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. తెలంగాణ ప్రభుత్వ పథకాలు దేశమంతా అమలు చేయాలని దేశంలోని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దేశంలో ప్రతి రైతు కేసీఆర్ గురించి తెలంగాణ పథకాల గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టారని, కేంద్రంలో కేసీఆర్ రైతు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం అన్నారు.
