తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి/ షాదీ ముబారక్ పథకం మరో రికార్డును సృష్టించింది. ఆడపిల్ల వివాహ భారం తల్లిదండ్రులపై పడకుండా ఏర్పాటు చేసిన ఈ పథకం ద్వారా ప్రభుత్వం సాయం అందిస్తుండగా… ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 11.6 లక్షల మందికిపైగా లబ్ధిపొందారు. గడిచిన 8 ఏండ్లలో రూ.10వేల కోట్ల ఆర్థికసాయాన్ని అందజేసిన ఘనతనూ ఈ పథకం దక్కించుకుంది. స్వరాష్ట్ర ఏర్పాటు అనంతరం తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టిన అనేక సంక్షేమ పథకాల్లో అత్యంత కీలకమైనది కల్యాణలక్ష్మి. పేదింటి ఆడపిల్ల పెండ్లి తల్లిదండ్రులకు గుండెలపై కుంపటి కావద్దని భావించిన సీఎం కేసీఆర్.. కల్యాణలక్ష్మి/షాదీముబారక్ అనే విప్లవాత్మక పథకానికి శ్రీకారం చుట్టారు. 2014 అక్టోబర్ 2 నుంచి ప్రారంభమైన ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీల యువతుల వివాహానికి రూ.51,000 ఆర్థిక సాయాన్ని అందజేయగా.. అటు తరువాత దానిని బీసీలకు సైతం విస్తరింపజేశారు. మూడేండ్ల తరువాత 2017లో పథకం కింద అందిస్తున్న ఆర్థికసాయాన్ని రూ.51,000 నుంచి 75,116కు పెంచారు. 2018 మార్చి19 నుంచి ఆ మొత్తాన్ని మరోసారి రూ.1,00116లకు పెంచి దిగ్విజయంగా అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద ఇప్పటివరకు 11,62,917 మంది ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ మేనమామగా ఆర్థిక సహాయం అందించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు నిరుపేద తల్లిదండ్రులకు ఎంతో అండగా నిలుస్తున్నాయి. పథకం కింద ఒకే కుటుంబం నుంచి ఒకరికి మించి లబ్ధి పొందిన వారుండటం విశేషం. అదేవిధంగా కల్యాణలక్ష్మి/ షాదీముబారక్ ద్వారా లబ్ధి పొందిన ఆడబిడ్డల్లో అత్యధికశాతం మంది.. ఆ తర్వాత కేసీఆర్ కిట్లను అందుకుంటుండటం మరో విశేషం.
కల్యాణలక్ష్మి పథకం ద్వారా లబ్ధిపొందిన వారిలో అత్యధికులు బీసీలే. పథకాన్ని ప్రారంభించిన మూడేండ్ల తర్వాత నుంచి ఈబీసీలకూ దానిని వర్తింపజేస్తూ వస్తున్నారు. దరఖాస్తు చేసుకున్నవారిలో 90శాతం మందికి కల్యాణలక్ష్మి/షాదీముబారక్ ద్వారా నిధులు అందుతుండటం మరో ఆసక్తికర అంశం. ఇప్పటివరకు ఈ పథకానికి 13,18,983 దరఖాస్తులు రాగా, అందులో 11,62,917 మందికి ఆర్థికసాయాన్ని అందజేశారు. వీరిలో బీసీలే 5,12,002 మంది (46.20 శాతం) ఉండటం విశేషం. ఈ పథకానికి సంబంధించి 2022-23 బడ్జెట్‌లో 1,850 కోట్లను కేటాయించడంతోపాటు నిధులను మొదటి త్రైమాసికంలోనే ప్రభుత్వం విడుదల చేసింది. అందులో సగానికిపైగా నిధులను ఇప్పటికే లబ్ధిదారులకు అందజేశారు. ఇక కల్యాణలక్ష్మి/షాదీముబారక్‌కు వచ్చే దరఖాస్తుల సంఖ్య సైతం ప్రతి సంవత్సరం పెరుగుతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పూర్తికి మరో త్రైమాసికం మిగిలి ఉండగానే.. కల్యాణలక్ష్మి పథకానికి ఇప్పటివరకు 97వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి పథకం దివ్యాంగ ఆడబిడ్డలకూ ఎంతో ఆసరాగా నిలుస్తున్నది. పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద అందజేసే ఆర్థిక సహాయానికి 25 శాతం అదనంగా వీరికి ప్రభుత్వం బహూకరిస్తున్నది. సాధారణంగా ఈ పథకం కింద ఆడబిడ్డల పెండ్లికి రూ.1,00,016 అందిస్తుండగా, దివ్యాంగ ఆడబిడ్డలకు రూ.1,25,016 అందజేస్తున్నది. పథకం కింద ఇప్పటివరకు 512 మంది దివ్యాంగులకు రూ.6.40 కోట్లను అందజేసింది.