mt_logo

పౌరసరఫరాల శాఖలో కాంగ్రెస్ నాయకుల రూ. 1,000 కోట్ల కుంభకోణం?

సన్నబియ్యం కొనుగోలు వ్యవహారంలో పౌరసరఫరాల శాఖలో సుమారు రూ. 1,000 కోట్ల కుంభకోణం జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. గ్లోబల్ టెండర్ల పేరిట సన్న బియ్యాన్ని అధిక ధరలకు కాంగ్రెస్ ప్రభుత్వం కొంటుందని బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు.

పౌరసరఫరాల సంస్థ వద్ద ఉన్న సన్న వడ్లను తక్కువ ధరకు అమ్మి.. ఇప్పుడు అధిక ధరకు బియ్యం కొనుగోలు చేస్తున్నాయి అని వారు ఆరోపిస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేసిన సంస్థలకే సన్న బియ్యం సరఫరా చేసే టెండర్లు కట్టబెట్టడం ఏంటని బీఆర్ఎస్ పార్టీ నిలదీస్తుంది.

గురుకులాలు, అంగన్‌వాడీలు, మధ్యాహ్న భోజన పథకానికి సన్నబియ్యం కోసం ఇటీవల పౌరసరఫరాల సంస్థ గ్లోబల్‌ టెండర్లను ఆహ్వానించింది. ఈ టెండర్లు ద్వారా 2.20 లక్షల టన్నుల సన్నబియ్యం సేకరించాలని నిర్ణయించింది. నాలుగు సంస్థలు టెండర్‌ దాఖలు చేసినట్టు తెలిసింది. బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం సన్న బియ్యం రూ. 42-45 వరకు లభించే అవకాశమున్న.. సదరు సంస్థలు కిలో రూ. 57 వరకు ధర కోట్ చేసినట్టు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

అంటే కిలోకు సుమారు రూ. 15 చొప్పున, టన్నుకు రూ. 15 వేలు కాంగ్రెస్ ప్రభుత్వం అదనంగా చెల్లిస్తుంది. పౌరసరఫరాల సంస్థ 2.20 లక్షల టన్నులు సేకరించనున్న నేపథ్యంలో రూ. 330 కోట్లు అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది.

మూడు నెలల క్రితం పౌరసరఫరాల సంస్థ 35 లక్షల టన్నుల ధాన్యాన్ని విక్రయించింది. ఇందులో 1.59 లక్షల టన్నుల సన్న ధాన్యం కూడా ఉంది. ఈ ధాన్యాన్ని కిలో రూ. 22.59 చొప్పున విక్రయించింది. ఈ ధాన్యాన్ని విక్రయించకుండా మిల్లర్లకు ఇచ్చి వారి నుంచి సన్న బియ్యం తీసుకోవచ్చు. తద్వారా సుమారు లక్ష టన్నుల సన్న బియ్యం వచ్చే అవకాశం ఉంది.

ఈ లక్ష టన్నులు పోగా.. మిగిలిన అవసరాలకు టెండర్లు పిలిస్తే సరిపోయేది. కానీ పౌరసరఫరాల సంస్థ మాత్రం చేతిలో ఉన్న ధాన్యం అమ్ముకొని కొత్తగా సన్నబియ్యం కోసం టెండర్లు పిలవడంపై ప్రతిపక్షాలు నిప్పులు చెరుగుతున్నాయి. సన్న వడ్లను బియ్యంగా మార్చితే ప్రభుత్వానికి కిలోకి రూ. 37 వరకు మాత్రమే ఖర్చు అయ్యేది. కానీ కిలోకి రూ. 57 చొప్పున వెచ్చించి కొనుగోలు చేయడంతో కిలోకు రూ. 20 వరకు నష్టం వాటిల్లుతున్నది. ఈ లెక్కన లక్ష టన్నులకు రూ. 200 కోట్లు ప్రభుత్వం నష్టపోయిందనే వాదన వినిపిస్తున్నది.

దానితోపాటు సన్న బియ్యం టెండర్లను పౌరసరఫరాల సంస్థ అత్యంత రహస్యంగా నిర్వహిస్తున్నది అని కూడా ఆరోపణలు ఉన్నాయి.