– ఆత్మగౌరవం చాటుతున్న ‘కృష్ణవేణుల’ నేల ఇది
– ప్రలోభాలకు ఇక్కడ స్థానం లేదు..
– ఓటు, సారా, నారా బాబులకు చెంప ఛెళ్లు
తెలంగాణ పౌరుషానికే కాదు.. ఆత్మగౌరవానికీ నిలువుటద్దంగా నిలుస్తున్నదా బిడ్డ! పేరు కృష్ణవేణి. మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలోని తెలకపల్లి ఆ అమ్మాయి ఊరు. కన్నోళ్లు కూలీలు. రెక్కలు ముక్కలు చేసుకుం రోజు గడవని పేదలు. రేపు శ్రీరామనవమి తర్వాత ఆ అమ్మాయికి పెళ్లి. పెళ్లంటే డబ్బులతో పని. ఆదుకుంటామని, పెళ్లికి సాయం చేస్తామని ఎవరైనా ముందుకు వస్తే వారికి నిజంగా పండగే! ఈ అమ్మా యి పెళ్లికీ డబ్బు సర్దుతామన్నారు కొందరు. కాకపోతే.. ఓటుతో లింకు పెట్టారు. వారు చంద్రబాబు పార్టీకి చెందిన నేతలు! ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటేస్తే ఇచ్చే ప్రతిఫలం ఇదేనన్నారు! ఓవైపు డబ్బు అవసరం ఉన్నా.. ఆ తల్లి ససేమిరా అన్నది. ఆత్మహత్యలతోనైనా తెలంగాణ వస్తుందని ఆరాటపడిన 700 మంది అమరవీరుల త్యాగం కళ్లముందు కదలాడుతుండగా.. డబ్బును పూచికపుల్లతో సమానంగా తీసిపారేసింది. సీమాంధ్ర డబ్బులతో పెళ్లి చేసుకుని తాను ఏం సుఖపడతానంటూ ప్రశ్నించుకుంది. తాను ఆ సొమ్ము తాకితే అమరవీరుల ఆత్మ క్షోభిస్తుందని భావించింది.
అదే మాటను ఆశ చూపినవారి ముఖం మీదే చెప్పిన కృష్ణవేణి.. డబ్బు తీసుకునేందుకు నిరాకరించింది. చంద్రబాబు పార్టీకి చెంప ఛెళ్లుమనేలా ‘తెలంగాణ తీర్పు’ను అందించింది. అవసరమైతే ఆస్తులు అమ్ముకునైనా బిడ్డ పెళ్లి చేస్తాం గానీ.. సీమాంధ్ర సొమ్ముకు కక్కుర్తిపడేది లేదని పేద తల్లితండ్రులూ చెప్పారు. ఇప్పుడా అమ్మాయిని తెలంగాణ ఉద్యమం అనురాగంతో గుండెలకు హత్తుకుంటోంది! తెలంగాణ ఉద్యమం త్యాగాలకు నిలయం. ఇప్పుడా నిలయంలో మరో ముద్దుబిడ్డ కృష్ణవేణి రూపంలో నిలిచింది. తెలంగాణ త్యాగానికి గుండె చప్పుడైంది. త్యాగధనులు గల తెలంగాణను సైతం కొనేద్దామని బాబు పార్టీ చేసిన ప్రయత్నాలను ఆ యువతి తుత్తునియలు చేసింది. ప్రలోభాలకు తెలంగాణ లొంగదని రెండు కళ్ల సిద్ధాంతికి రుజువు చేసింది. తెలంగాణ ఆకాంక్ష.. ఆపేక్ష ఏ స్థాయిలో ఉన్నాయో తెలియజెప్పిన ఈ బిడ్డను తెలంగాణ ఉద్యమం తన బిడ్డను చేసుకుంది.
టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సహా పలువురు ఉద్యమ నేతలు.. శ్రీరామనవమి తర్వాత జరిగే ‘తమ బిడ్డ’ పెళ్లికి వెళ్లనున్నారు. తమ ఇంటి ఆడపడుచును దగ్గరుండి అత్తారింటికి పంపించనున్నారు. కృష్ణవేణిని ప్రలోభపెట్టినట్లే మహబూబ్‌నగర్‌లో అనేక మందికి ప్రలోభాలు పెట్టేందుకు పచ్చ పార్టీ ఏకంగా ఒక ట్రస్టునే ఏర్పాటు చేసింది. చావులకు, పెళ్లిళ్లకు విరాళాలు ప్రకటించడం ద్వారా ఓట్లను వేయించుకోవాలనేది ఈ ట్రస్టు పన్నాగం. కానీ.. అన్నాహజారేకు తమ్ముడినని చెప్పుకునే చంద్రబాబు.. ఆయన వందిమాగధులు చేస్తున్న ఇలాంటి ప్రయత్నాలకు అడుగడుగునా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. గత ఎన్నికల్లో నగదు బదిలీ పథకాన్ని ప్రవచించిన టీడీపీ.. ఇప్పుడు తెలంగాణ ఉప ఎన్నికల సందర్భంగా దాన్నే కాస్తంత రూపం మార్చి అమలు చేస్తున్నట్లుంది! హాఫ్ బాటిల్ మద్యం.. వెయ్యి రూపాయల నోటు!
ఇది ఒక ఓటుకు కట్టిన వెల! ఒక ఊరికి కాదు.. ఒక నియోజకవర్గానికి కాదు.. తెలంగాణ అంతటా ఇప్పుడు నారావారి సార పొంగిపొర్లుతున్నది! ఊరూరా నోట్ల కట్టలు రెపపలాడుతున్నాయి. కనీసం ఒక్క స్థానంలోనైనా త్యాగధనులను ఓడిస్తే.. తెలంగాణవాదాన్ని గెల్చినంత సంబురం చేసుకునేందుకు! కనీసం డిపాజిట్లయినా సాధించుకుంటే.. ఉద్యమాన్ని వెక్కిరించామని పండుగ చేసుకునేందుకు! టీడీపీ నేతలకు ఎన్ని కష్టాలు.. ఎంత పాట్లు!
—
నమస్తే తెలంగాణ నుండి