‘తెలంగాణ కోసం ఎందరో విద్యార్థులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. నా డబ్బు పోతే ఎంత! ఎటువంటి లాభాపేక్ష లేకుండా తెలంగాణ ప్రజలను జాగృత పరచాలనే ఉద్దేశ్యంతో ‘ఇంకెన్నాళ్లు’ సినిమా తీశాను. తెలంగాణ గడ్డపై పుట్టిన బిడ్డగా అది నా బాధ్యతగా భావించాను’ – రఫీ.
‘ఇంకెన్నాళ్లు’ సినిమా తీయడానికి ప్రేరణనిచ్చిన అంశాలేమిటి?
2009 డిసెంబర్ 9న చిదంబరం ప్రకటనతో తెలంగాణ వ్యాప్తంగా ఆనందోత్సాలు మిన్నంటాయి. ప్రత్యేక రాష్ట్ర చిరకాల స్వప్నం సాకారమవబోతోందని ప్రజలందరూ సంబరాల్లో మునిగితేలారు. నేను కూడా చాలా ఆనందపడ్డాను. హుస్నాబాద్‌లో వున్న మా నాన్నకు ఫోన్‌చేసి ‘తెలంగాణ వచ్చినట్లే నాన్న! ఇక మన కష్టాలన్నీ తీరిపోయినట్లే!’ అని అన్నాను. ‘లేదు బిడ్డా! 1969లో కూడా ఇట్లనే అన్నరు. కానీ తెలంగాణ ఇయ్యలేదు. ఆ ప్రకటనని నమ్మలేం బిడ్డా’ అని నాన్న చెప్పిండు. కొన్ని రోజుల తర్వాత ఆయన చెప్పిందే జరిగింది. తెలంగాణ ప్రజలు మరోసారి మోసపోయారు. ఆ సమయంలో నేనంతగానో సంఘర్షణకు గురయ్యాను. ఇంటికి వెళ్లి నాన్న, ఆయన మిత్రుల దగ్గర తెలంగాణ ఉద్యమ పూర్వాపరాల్ని తెలుసుకున్నాను. ఆ స్ఫూర్తితోనే ‘ఇంకెన్నాళ్లు’ చిత్రానికి శ్రీకారం చుట్టాను.
ఈ ఏడాది తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ‘జై బోలో తెలంగాణ’ ‘పోరు తెలంగాణ’ సినిమాలు వచ్చాయి. మీ చిత్రం ద్వారా ప్రజలకు కొత్తగా ఏం చెప్పబోతున్నారు?
‘ఇంకెన్నాళ్లు’ ఉద్యమ నేపథ్యమున్న సినిమా మాత్రమే కాదు. ఉద్యమంతో పాటు తెలంగాణ జన జీవితాన్ని, సంస్కృతిని, ఆచార వ్యవహారాల్ని, మనవైన వేషభాషల్ని , సుఖాల్ని, సంతోషాల్ని, కష్టాల్ని, కన్నీళ్లను ఈ చిత్రంలో దృశ్యమానం చేశాను. మొత్తంగా తెలంగాణ ఆత్మను ఈ చిత్రం ప్రతిబింబిస్తుంది. తెలంగాణ నేపథ్యంలో సినిమాలు వచ్చిన మాట వాస్తవమే. అయితే తెలంగాణ ఉద్యమాన్ని నా దృష్టి కోణంలో ఈ చిత్రంలో ఆవిష్కరించాను. ‘ఇంకెన్నాళ్లు’ తెలంగాణ ఉద్యమంతో పాటు తెలంగాణ బతుకు యదార్థ చిత్రాన్ని ప్రజలముందుంచుంది.
పాటలకు ఎలాంటి స్పందన లభిస్తోంది?
ఆడియోకు తెలంగాణ వ్యాప్తంగా శ్రోతల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. పేరొందిన మ్యూజిక్ వెబ్‌సెట్లలో కూడా టాప్ రేటింగ్ ఇచ్చారు. ముఖ్యంగా ఉద్యమకారుల దగ్గర పాటలు మార్మోగిపోతున్నాయి. ఇందులో డా॥ సి. నారాయణడ్డిగారు రచించిన ‘ఏమి వెలుతురు…’ అనే పాట అలనాటి సంస్కృతిని, ఆచార వ్యవహారాల్ని ఆవిష్కరిస్తూ అందంగా సాగిపోతుంది. సినారె పాట ఆడియోకు తలమానికంగా నిలిచింది.
కోదండరామ్, గద్దర్‌గార్లు ఈ సినిమాలో ఎలాంటి పాత్రలు పోషించారు?
కోదండరామ్‌గారు ఆయన నిజజీవిత పాత్ర అయిన ప్రొఫెసర్‌గా కనిపిస్తారు. సింగిల్ ప్రతి సన్నివేశాన్ని రక్తికట్టించారాయన. పాత్రలో లీనమై నటించారు. గద్దర్‌గారు ఈ చిత్రంలో విద్యార్థులకు స్ఫూర్తినిచ్చి వారిచే ‘ఉద్యమ యాత్ర’ను చేయించే సారథిగా కనిపిస్తారు. ఉద్యమచైతన్యాన్ని రగిలించే ‘కదం, కదం…’ అనే పాటలో ఆయన అద్భుతంగా అభినయించారు. ఈ సినిమా విషయంలో ఎంతగానో సహాయసహకారాలందించిన కోదండరామ్, గద్దర్ గార్లకు నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను
‘ఇంకెన్నాళ్లు’ చిత్రం ద్వారా తెలంగాణ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు?
ప్రజలకు సందేశం అందించాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమా తీయలేదు. డబ్బు సంపాదించుకుందామనే వ్యాపార దృక్పథం అసలే లేదు. తెలంగాణ కోసం ఎందరో ప్రాణత్యాగాలు చేస్తున్నారు. నా డబ్బు పోతే ఎంత!. తెలంగాణ సమాజం జాగృతం కావాలని నా ఆకాంక్ష. ఇంకెన్నాళ్లో మోసపోకుండా తెలివిగా లక్ష్యాన్ని చేరుకోవాలి. యాచించే స్థితి నుంచి మనమంతా సంఘటితమై శాసించే స్థితికి చేరుకోవాలి. బంగారు తెలంగాణను మన భవిష్యత్ తరాలకు అందించాలన్నదే నా ఆశ. తెలంగాణ బిడ్డగా నా బాధ్యతగా ఈ సినిమాను తెరకెక్కించాను.
– “నమస్తే తెలంగాణ” నుండి