mt_logo

జైబోలో తెలంగాణకు అరుదైన గౌరవం

ప్రముఖ దర్శకుడు యన్.శంకర్ తెరకెక్కించిన ‘జై బోలో తెలంగాణ’ చిత్రం అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని, ఆర్తిని , పోరాట స్ఫూర్తిని అద్భుతంగా ఆవిష్కరించిన ఈ చిత్రం ప్రతిష్టాత్మక సౌత్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శనకు ఎంపికయింది. అంతర్జాతీయ స్థాయిలో పేరెన్నికగల ఈ చలన చిత్రోత్సవానికి ఎంపికయిన తొలి తెలుగు చిత్రంగా ‘జై బోలో తెలంగాణ’ చరిత్ర సృష్టించింది. సెప్టెంబర్ 15 నుంచి నాలుగు రోజుల పాటు గోవాలో ఈ చలనచివూతోత్సవం జరుగనుంది. ఎనిమిది దక్షిణాసియా దేశాల నుంచి దాదాపు 50 చిత్రాలను ఈ చిత్రోత్సవంలో ప్రదర్శించనున్నారు. ప్రధాన స్రవంతి సినిమాలతో పాటు లఘు చిత్రాలు, డాక్యుమెంటరీ, క్లాసిక్ విభాగంలో చిత్రాలు ఇందులో ప్రదర్శింపబడనున్నాయి.
ఈ సందర్భంగా దర్శకుడు యన్.శంకర్ మాట్లాడుతూ ‘తెలంగాణ ప్రజా విజయమిది. ప్రఖ్యాత చిత్రోత్సవంలో ‘జై బోలో తెలంగాణ’ చిత్రం ప్రదర్శనకు ఎంపికకావడం తెలంగాణ సినిమాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఓ జాతి సంఘర్షణను మానవీయ కోణంలో ఆవిష్కరించిన ఈ చిత్రం ప్రఖ్యాత చిత్రోత్సవంలో ప్రదర్శనకు ఎంపికవడం దర్శకుడిగా నాకెంతో సంతృప్తినిచ్చింది. భారతీయ సినిమా నుంచి అతికొద్ది చిత్రాలు మాత్రమే ఈ చిత్రోత్సవానికి ఎంపికవుతాయి. అందులో తొలిసారిగా తెలుగు సినిమా ప్రదర్శనకు ఎంపికవడం మనందరికీ గర్వకారణం’ అన్నారు.

[నమస్తే తెలంగాణ నుండి]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *