తెలంగాణ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ముందస్తు ఎన్నికలకు గంట మోగిన నాటి నుంచి పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. టీడీపీ, కాంగ్రెస్, టీజేఎస్, సీపీఐ పార్టీలు కలిసి మహాకూటమిగా ఏర్పడ్డాయి. సింహం సింగిల్‌గా వస్తున్నట్లు టీఆర్‌ఎస్ కారు జెట్ స్పీడ్‌తో ప్రచారంలో ముందుకు పరుగులు పెడుతోంది. మహాకూటమి పార్టీలు ఇప్పటివరకు సీట్ల సర్దుబాటులోనే బిజీగా ఉంటే.. గులాబీ నేతలు ఇప్పటికే రెండు మూడు రౌండ్‌లు అన్ని గ్రామాలను, గ్రామ నేతలను కలిసి ప్రచారం పూర్తి చేశారు.
తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న వ్యూహాలకు విరుగుడుగా ఏపీలోని ఇతర పార్టీలయిన జనసేన, వైసీపీ తెలంగాణలో సైకిల్‌కి పంక్చర్ చేయాలని చూస్తున్నారట. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలోనే చంద్రబాబు ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో మంతనాలు జరిపారు. కాంగ్రెస్ కూటమిలో భాగస్వామి అయ్యారు. తెలంగాణలో తన ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేస్తూ.. ఏపీలోనూ నాదే హవా అనే ప్రాపకాండ వ్యూహాల్లో ఉన్నారు చంద్రబాబు. దీన్ని పసిగట్టిన ప్రతిపక్ష పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్, జనసేన ముందుగానే మేల్కొన్నాయి. ఏపీలోనూ ఎల్లో మీడియా విపరీతమైన పోకడలు పోయి, ఎన్నికలు అవసరమే లేకుండా బాబు గెలుస్తాడని బాకా ఊదడం మొదలు పెడతాయి. వీటిని ఎదుర్కోవటానికి చంద్రబాబుని నిలువరించడానికి, తెలంగాణలో టీడీపీ పోటీ చేసే స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్ధులను ఓడించడానికి జగన్, పవన్ పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి.
చంద్రబాబుకు ఏపీ టఫ్ టైమ్ మొదలవ్వాలంటే.. చంద్రబాబు ఇమేజ్ ఏమీ లేదని.. అంతా డ్రామా అని మరింత స్పష్టంగా తెలియాలి అంటే తెలంగాణలో టీడీపీ కూటమిని ఓడిపోవాలి. అప్పుడే ఏపీలో చావుదెబ్బ కొట్టొచ్చు అనే ఉద్దేశం ఆ రెండు పార్టీల్లో ఉందంట. వైఎస్ఆర్ కాంగ్రెస్, జనసేన పార్టీలు తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయటం లేదు. స్వచ్ఛంధంగా తప్పుకున్నారు. ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. అయినా తెలంగాణలో వైఎస్ అభిమానులు, పవన్ ఫ్యాన్స్ బలంగా ఉన్నారు. ముందస్తుగా వచ్చిన అవకాశాన్ని బలంగా ఉపయోగించుకోవాలంటే.. సత్తా చూపించాలంటే తెలంగాణలో కాంగ్రెస్ – టీడీపీ కూటమిని ఓడించాలి. అందులో భాగంగానే కూటమికి వ్యతిరేకంగా.. అభిమానులు, ఫ్యాన్స్ పనిచేయాలని అంతర్గత ఆదేశాలు ఇచ్చారు. సీమాంధ్రుల్లోని వైఎస్, పవన్ అభిమానులు మహాకూటమిని ఓడించి, టీఆర్‌ఎస్ విజయానికి దోహదం చేయటానికి కంకణబద్దులై ఉన్నారు.