mt_logo

ఆకాశమంత ఉద్యమం… ఉద్యమమంత స్ఫూర్తి.. – తెలంగాణ యాదిలో 2011

యావత్ ప్రపంచానికి తెలంగాణ తెగువను చూపెట్టింది 2011.

శ్రీకుట్ర కమిటీ నివేదిక బయటికి వచ్చింది మొదలుకుని.. టీఎన్‌జీవోల సహాయ నిరాకరణ దాకా..! పల్లెలు పట్టాపూక్కింది మొదలు.. రోడ్లపై పొయ్యిలు పెట్టినదాకా! వీరోచిత సకల జనుల సమ్మె మొదలు.. ఎమ్మెల్యే పదవులకు రాజీనామాల వరకూ! ట్యాంకుబండు వెలుగు జిలుగుల్లో మసకబారిపోయిన తెలంగాణ చరిత్ర పురుషులకు జరిగిన అన్యాయంపై పిడికిలెత్తిందీ.. ఉద్యమానికి నడిచొచ్చే కొడుకులా… నమస్తే తెలంగాణ దినపత్రిక ఆవిర్భవించిందీ.. పదవులను తృణప్రాయంగా భావిస్తూ ప్రజా ప్రతినిధులు రాజీనామాలు విసిరికొట్టిందీ.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా లక్ష్మణ్ బాపూజీ, మాజీ డీఎస్పీ నళిని వంటివారు ఆమరణ నిరాహారదీక్షలకు దిగిందీ ఈ కాలంలోనే!

వీరోచిత ఘట్టాలతో పాటు.. పలు విషాద సన్నివేశాలనూ ఉద్యమం ఇదే ఏడాదిలో చవిచూసింది!

తెలంగాణ ఉద్యమానికి పెద్దదిక్కు.. తొలి విడత ఉద్యమ స్ఫూర్తిని ఇన్నేళ్లూ బతికించి.. మలి ఉద్యమానికి పునాదులేసిన ప్రొఫెసర్ జయశంకర్ సారు ఈ ఏడాది అస్తమించారు. తెలంగాణ ఆకాంక్షలు వినేందుకు.. కనేందుకు సిద్ధపడని ఢిల్లీ పెద్దల పెను నిద్దుర వదిలించేందుకు పార్లమెంటుకు కూతవేటు దూరంలో యాదిడ్డి ఆత్మత్యాగం చేసిందీ.. ఆ అమరుడి బలిదానాన్ని అవహేళన చేసిన చిదంబరం వ్యాఖ్యలకు మనసు కలత చెంది శ్రీకాంత్ అమరుడైందీ ఈ సంవత్సరమే! ఉద్యమ ప్రభంజనానికి కొత్త శక్తులనిచ్చి.. మలి విడత తెలంగాణ ఉద్యమంలో తనదైన ముద్ర వేసుకుని ఆకాశమంత ఉద్యమానికి.. రానున్న రోజులకు ఉద్యమమంత స్ఫూర్తిని అందించి.. భద్రం కొడుకో.. అంటూ వెళ్లిపోతున్నది రెండువేల పదకొండు!!

తెలంగాణ ఉద్యమంలో ఈ ఏడాది జరిగిన కొన్ని ముఖ్య ఘటనలు.. పరిణామాలు..

– జనవరి 06: కేంద్ర హోంమంత్రి చిదంబరం రాష్ట్రంలోని రాజకీయ పార్టీల సమావేశాన్ని ఢిల్లీలో నిర్వహించి శ్రీకృష్ణ కమిటీ నివేదిక కాపీలను అందజేశారు.
– జనవరి 08: ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో మెదక్ ఎంపీ విజయశాంతి అరెస్టు. జైబోలో తెలంగాణ సినిమా పాటలను ఆవిష్కరించిన కేసీఆర్.
– జనవరి 17: తెలంగాణ వ్యాప్తంగా రాస్తారోకోలు.
– జనవరి 22: హకీంపేట్‌లో విద్యార్థుల జేఏసీ సమావేశం. హాజరైన కేసీఆర్.
– జనవరి 30: ఓయూ విద్యార్థుల తెలంగాణ బస్సు యాత్ర ప్రారంభం.
– ఫిబ్రవరి 15: తెలంగాణలో ఉద్యోగ సంఘాల సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభం.
– ఫిబ్రవరి 17 : కేసీఆర్ జన్మదినం సందర్భంగా తెలంగాణ భవన్‌లో రక్తదాన శిబిరం నిర్వహణ. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్న టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు.
– ఫిబ్రవరి 22, 23 : రెండు రోజులపాటు తెలంగాణ బంద్.
– ఫిబ్రవరి 24 : పార్లమెంట్‌లో తెలంగాణ ఏర్పాటు కోసం లొల్లి.
– ఫిబ్రవరి 28 : సహాయ నిరాకరణ విరమణపై ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాల చర్చలు విఫలం.
– మార్చి 01: రైల్‌రోకో కార్యక్షికమం సంపూర్ణం.
– మార్చి 03 : తెలంగాణపై దద్దరిల్లిన పార్లమెంట్. పోడియంలోకి దూసుకెళ్లిన కేసీఆర్, విజయశాంతి.
– మార్చి 10 : ట్యాంక్‌బండ్‌పై ‘మిలియన్ మార్చ్’ విజయవంతం.
– మార్చి 14: టీజేఎఫ్ ఆధ్వర్యంలో తెలంగాణ మాక్ అసెంబ్లీ.
– ఏప్రిల్ 14 : కేసీఆర్ ఆధ్వర్యంలో చండీయాగం.
– ఏప్రిల్ 29 : టీఆర్‌ఎస్ దశాబ్ది ఉత్సవాలు. మహబూబ్‌నగర్ సభలో టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ మరోసారి ఎన్నిక.
– మే 19: టీజేఎఫ్ ఆధ్వర్యంలో ఢిల్లీలో ధర్నా.
– మే 31: కరీంనగర్‌లో బీజేపీ తెలంగాణ పోరుసభ, సుస్మాస్వరాజ్ హాజరు.
– జూన్ 05 : తెలంగాణ ఉద్యోగుల ఉద్యమ బాటకు శ్రీకారం.
– జూన్ 06 : ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక ఆవిష్కరణ.
– జూన్ 09: జాతీయ స్థాయి తెలంగాణ రచయితల మహాసభలు- తెలంగాణ ఏర్పాటుకు డిమాండ్.
– జూన్ 11: పాలమూరు జిల్లాలో జూపల్లి కృష్ణారావు పాదయాత్ర ప్రారంభం.
– జూన్ 17 : మెట్రోరైల్ భూతంపై సుల్తాన్‌బజార్‌లో వ్యాపారుల సమావేశం. హాజరైన కేసీఆర్.
– జూన్ 19: హైదరాబాద్ సహా తెలంగాణలో వంటా వార్పు కార్యక్రమం.
– జూన్ 21: తెలంగాణ పితామహుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ అస్తమయం.
– జూన్ 22 : కొత్తపల్లి జయశంకర్ సార్ అంతిమ యాత్ర.
– జూన్ 30: ప్రజాప్రతినిధుల రాజీనామాలు కోరుతూ కేయూలో విద్యార్థుల దీక్షలు.
– జూలై 05, 06: రెండు రోజుల తెలంగాణ బంద్ సంపూర్ణం.
-జూలై 11: పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టాలని చర్లపల్లి జైల్లో రాజకీయ ఖైదీల దీక్ష, విద్యార్థుల ఆమరణ దీక్ష ప్రారంభం, సీపీఐ కలెక్టరేట్ల ముట్టడి.
– జూలై 12: జిల్లాల్లో వంటావార్పు.
– జూలై 13: కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల 48 గంటల దీక్ష.
– జూలై 14: రైల్‌రోకో కార్యక్షికమం విజయవంతం.
– జూలై 21: తెలంగాణ కోసం పార్లమెంట్ సమీపంలో యాదిరెడ్డి ఆత్మహత్య. ఏపీ భవన్ వద్ద ఉద్రిక్తత.
– జూలై 22: యాదిరెడ్డి మృతికి సంతాప సూచకంగా తెలంగాణ బంద్.
– జూలై 27: విద్యాసంస్థల బంద్ విజయవంతం.
– ఆగస్ట్ 01: తెలంగాణ సాధన కోసం, 14(ఎఫ్) నిబంధన రద్దు కోసం, రాస్తారోకోలు, దీక్షలు, ర్యాలీలు ప్రారంభం.
– ఆగస్ట్ 04: ఉద్యోగుల రిలే దీక్షలు ప్రారంభం.
– ఆగస్ట్ 05: లోక్‌సభలో తెలంగాణపై వాడివేడిగా చర్చలు.
– ఆగస్ట్ 06: ప్రొఫెసర్ జయశంకర్ సంస్మరణ సభలు. తెలంగాణ భవన్‌లో కాంస్యవిక్షిగహం ఆవిష్కరణ.
– ఆగస్ట్ 06 : యాదిరెడ్డి మరణంపై కేంద్ర మంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్యలకు కలత చెంది జేఎన్‌టీయూ విద్యార్థి శ్రీకాంత్ బలవన్మరణం.
– ఆగస్ట్ 10: తెలంగాణ బంద్ విజయవంతం.
– ఆగస్ట్ 12: 14(ఎఫ్) నిబంధనను తొలగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు.
– ఆగస్ట్ 17: జేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా.
– ఆగస్ట్ 13: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సకల జనుల సమ్మె ప్రారంభం.
– సెప్టెంబర్ 17 : తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా పలు కార్యక్షికమాలు.
– సెప్టెంబర్ 19: తెలంగాణ వ్యాప్తంగా రహదారుల దిగ్బంధం.
– అక్టోబర్ 15: రైల్‌రోకో సక్సెస్
– అక్టోబర్ 17 : తెలంగాణ బంద్ విజయవంతం. బాన్సువాడ ఎమ్మెల్యేగా పోచారం ఘనవిజయం.
– అక్టోబర్ 24 : సకల జనుల సమ్మె ముగింపు.
– అక్టోబర్ 28 : ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జూపల్లి, రాజయ్య,సోమారపు టీఆర్‌ఎస్‌లో చేరిక.
– నవంబర్ 01: నల్లగొండలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి దీక్ష మొదలు
– నవంబర్ 01 : ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద కొండా లక్ష్మణ్ బాపూజీ దీక్ష.
– నవంబర్ 09 : కోమటిడ్డి, లక్ష్మణ్ బాపూజీ దీక్షల ముగింపు.
– నవంబర్ 01: తెలంగాణ అంతటా విద్రోహ దినం పాటింపు.
– నవంబర్ 04: పీడీ యాక్టు కింద టీఆర్‌ఎస్ నేత డాక్టర్ చెరుకు సుధాకర్ అరెస్టు. వరంగల్ జైలుకు తరలింపు.
– నవంబర్ 05 : రైతుల సమస్యలపై వ్యవసాయ కమిషనరేట్ ఎదుట టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ధర్నా.
– నవంబర్ 16: తెలంగాణ సాధన పాదయాత్ర.
– నవంబర్ 22: పార్లమెంట్‌ను స్తంభింపజేసిన కేసీఆర్, విజయశాంతి.
– డిసెంబర్ 01: అసెంబ్లీ సమావేశాల ప్రారంభ రోజున టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల పాదయాత్ర. అసెంబ్లీలో నిరసన.
– డిసెంబర్ 05: అసెంబ్లీలో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం. పాల్గొన్న టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు.
– డిసెంబర్ 07: చెరుకు సుధాకర్ విడుదలకు తెలంగాణవ్యాప్తంగా పలు ఆందోళన కార్యక్రమాలు.
– డిసెంబర్ 08: చెరుకు సుధాకర్ విడుదలకు హైకోర్టు ఆదేశం. చెరుకు సుధాకర్ విడుదల.
– డిసెంబర్ 09: తెలంగాణ ఆత్మగౌరవ దినాన్ని పాటించిన ప్రజలు. ఇందిరాపార్క్ వద్ద జాగరణ.
– డిసెంబర్ 09 : ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చొన్న మాజీ డీఎస్పీ నళిని
– డిసెంబర్ 16 : దీక్ష విరమించిన నళిని.
– డిసెంబర్ 21 : తెలంగాణ వాణిజ్య, పారిక్షిశామిక మండలి (టెక్కి) ఆవిర్భావ సమావేశం.
– డిసెంబర్ 23: కేంద్రం ఇచ్చిన మాట నుంచి వెనక్కు తగ్గి రెండేళ్లు అయిన సందర్భంగా జిల్లాల్లో తెలంగాణ నమ్మక ద్రోహ దినం పాటించిన ఉద్యమకారులు.
– డిసెంబర్ 25: తెలంగాణ భవన్‌లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. హాజరైన కేసీఆర్, విజయశాంతి, ఈటెల.
– డిసెంబర్ 26 : సంక్రాంతి పండుగ తర్వాత ఉధృత ఉద్యమం చేస్తామని ప్రకటించిన కేసీఆర్.


[నమస్తే తెలంగాణ నుండి]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *