mt_logo

నేనెట్లా బతుకుదు!

(File Photograph of Martyr Ramatenkki Srikanth, an MTech student from JNTU Hyderabad, who committed suicide for Telangana on 6th August 2011 (From his Facebook Profile)

By: -సుజాత సూరేపల్లి

చిన్నపుడు నువ్వు కడుపులో
చిన్ని పాదాలతో తన్నుతుంటే
బాధని నొప్పిని చూసి మురిసి పోయిన

నువ్వు పుట్టినపుడు
నేను మళ్లీ ఒక జన్మ నెత్తి
నిన్ను కన్నా..నాన్నా !

నువ్వు పడుకోవాలని
ఎర్రటి కళ్ళతో నేను
నిద్రలేకుండా గడిపిన రాత్రులు
అన్నీ జీవితంలో మధురమే

నువ్వు  మొదటి  సారి
ముద్దుగా  అమ్మా  అని  పిలిచినపుడు
సంబురంగా  ఊరంతా
గొప్పగా చెప్పుకున్న
నీకు చిన్న జరం వస్తే
తీరొక్క దేవ్వుల్లకి మొక్కు కుంటి
ఎన్నొద్దులు ఉపాసాలున్ననో

ఒక్కో అడుగేస్తూ నువ్వు తుళ్ళి పడుతున్నపుడు
నన్ను నేను తమాయిన్చుకోలేక
నానా  యాతన  పడ్డ  చిన్నా

నువ్వు లొల్లి  చేసుకుంట   స్కూల్  డ్రెస్
వేసుకుని  మొదటి  సారి  బడికి  పోతుంటే
నువ్వు పెద్ద  ఆఫీసర్  అయిపోయినట్టుగా
మస్తు కుషి అయిన ..
నువ్వు పెద్దగైనన్ని  రోజులు
కష్టం  తెలవకుండా
పస్తులున్డుకుంటా
పైసలు కూడ పెట్టి
పగలు  రాత్రులు  నీ  కోసం
కలలు  కంటూ
నన్ను నేను మరిచి  పోయి
నువ్వే  సర్వస్వం  అనుకున్నా ..

పెద్ద  చదువులు  చదువు  కుంట
నువ్వు ముందుకు  పోయి
ఎంతో  పెద్ద   వాడివి  కావాలని
ఎన్ని రాత్రులు కలలు కన్న బిడ్డా!

అపుడెపుడో  నువ్వు
జై  తెలంగాణా  అని
ఎప్పుడు  ఆ  ముచ్చట్లే    చెప్పుతుంటే ..
తెలంగాణా  తల్లి  కోసం  నీ  ప్రేమని
చూసి..మరింత  మురిసినా ..
నా  కొడుకు  చూడున్ద్రి  అని
కనపడ్దోల్లకల్లా  చెప్పుకున్నా ..

నిన్నటికి  నిన్న
రక్తం  పంచి , జీవితాన్ని
నీ కోసమే ధార పోసిన
ఈ  తల్లిని  మరిచి    ..
నీ  కుటుంబాన్ని  అంత  మరిచి  పోయి
ఒక ఉత్తరం  రాసి  పెట్టి
నేను నా  తెలంగాణా  తల్లి  కోసం
ప్రాణాలు  విడుస్తున్నా  అని
మమ్మలనందరినీ  ఇడిచిపెట్టి   పొతే ..
బిడ్డా !

ఇన్ని కోట్ల మందికోసం
నిన్ను కనీ మోసిన తల్లిని
కాటికి పంపించకుండా
ముద్దు మురిపెం తీరకుండా
అర్ధంతరంగా పాయినందుకు
గుండెలు బాదుకుంటా ఎడుస్తునా?
ఇంత గొప్ప తండ్రిని కన్నందుకు
చరిత్రలో నిలబడ్డందుకు గర్వపడుదునా..
ఏమి చెప్పకుండా
గట్లెట్ల పోతివి కొడుకా!

కాలేజి పోయి గంట సేపు
లేటుగొస్తే కాలు గాలిన పిల్లోలె
ఆటు ఇటు తిరుగుతుంటి
ఎప్పటి రాని దూరాలకి పాయినవంటే
నేనట్ల   యాది మరిచి
ఎట్లా బతుకుదూ..
ఏడుస్తానికి కూడా కండ్లనీళ్ళు
లేకుండా పాయె బిడ్డా!
ఇంత పాడు బతుకు పగోల్లకు
కూడా రావొద్దు ..రావొద్దు!

నువ్వు సచ్చినవని
లోకమేమి ఆగం గాలే
నీ చివరి కోరిక కోసం
ఏ  ఒక్కరు తన్లాడతలే..
పానం ఆగం చేసుకున్టివి
పాపిష్టి నాయకుల కోసం
బిడ్డల్లారా!
అమ్మ కడుపు కోత పెట్టకున్రి
కన్నోల్లని గోస గోస చేయకున్రి

నీ కల  తెలంగాణా కోసం అయితే
మేము నీతో నడుస్తం..
నిండు ప్రాణం కాదు
అమ్మకి ఇచ్చేది
కల కాలం ఉండే నిండైన  జీవితం
నీ పోరాటమే ఏ అమ్మకైనా బలం
నీ విజయమే అమ్మకి నిజమైన వరం!
గోస పెట్టకున్రి తండ్రి!
నిండు నూరేళ్ళు చల్లగా బతకండ్రి!
మీ ప్రాణాలని తీసుకుంటున్న
నీచ రాజకీయ నాయకులని
తన్ని తన్ని తరమండ్రి..
మీరే నాయకులు కండ్రి!
తెలంగాణా సాధించండి..

(శ్రీకాంత్ మరణ వార్త చూసి తట్టుకోలేని బాదతో..తల్లి మనసుతో )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *