mt_logo

నాసా ఖైదీ నెంబర్ 1

వరంగల్ సెంట్రల్ జైలునుండి డాక్టర్ చెరుకు సుధాకర్ (టీ.ఆర్.ఎస్. పొలిట్ బ్యూరో సభ్యుడు)

ఈ నెల 3వ తేదీ రాత్రి -అద్దమ రాత్రి-కవులు పాడుకునే పాటల చెప్పినట్టు తెలంగాణ పల్లెపై అద్దమరాత్రి యుద్ధం లెక్కనే పోలీసోల్లు ఇంటిమీదికి వచ్చారు. ‘ఎందుకొచ్చిన్రు’ అని అడిగితే కూడా జవాబు చెప్పకుండా, చెప్పులు కూడా వేసుకోనీయకుండా గొరగొర గుంజుకొచ్చి, మధ్యలకొచ్చినంక ‘మీ మీద పీడీ యాక్ట్ పెట్టి అరెస్టు చేసినం, వరంగల్ తీసుకుపోతున్నం’ అనబట్టిరి.

ఈ గింత ముచ్చట ఆడనే నకిరేకల్‌లో చెవులో వేస్తే ఇంత బైస్, రచ్చ జరుగకపోతుండే గదా! అని మన తెలంగాణ పోలీసాయనతోని అంటిని. లెక్కకు రాని మచ్చ చెబుతరు వాళ్లు. మీదుండి చెప్పినోడు ఆంధ్ర పోలీసు ఆఫీసర్ దొర అయిపోయిండు. ఎత్తుకొచ్చినోల్లు మీరు. దొంగల లెక్క ఎత్తుకొచ్చి బద్నాం అయితిరి గదా! అన్నాను.

అవును సారూ! నీవద్దనేమో మంచిగనే అన్నరు. పోలీసోల్లది ఒక తరీఖ కాదు. ఎండ్ల షరీక లేము సారు. పైన ఆల్లు, మేము తెలంగాణ ఉద్యమకారులతోటి సక్కగ డీల్ చేస్తలేమని రోజూ పైకి కంప్లయింట్ రాస్తున్నరు. జర్రంత ఎక్సెస్ అయినా పత్రికలల్లో, టీవీ వాళ్లు ఇంత పొడుగు చేసి రాసిరి, చూపెట్టిరి. మనోళ్లు నపరొక్క మాట అనిరి.

దగ్గర దగ్గర రెండు వందల కిలోమీటర్ల దూరం. దంతాలపల్లి మీదుగా కేసీఆర్ సూర్యాపేట మీటింగ్‌ల ముచ్చట చెప్పినట్టు దంతాలు ఊసినంత పనయ్యి-తెల్లారంగ వరంగల్ చేరుడు. అరెస్టు కాగితం వరంగల్ జైలులో అప్పజెప్పినంక చేతుల పెట్టుడు, జైలు సిబ్బంది నన్ను తోలుకపోవుడు. పోయేటప్పుడు ‘సార్ మీరు ఏమి బాధపడకండ్రి, పీడీ కింద అరెస్టయినోళ్లకు స్పెషల్, సపరేట్ రూము, టీవీ, మంచం, ఇస్తరు. మీకు చూపెడుతున్న రూంలనే- వరంగల్ ఎంపీ రాజయ్యను కూడా ఈ రూంలనే ఉంచినం’ అన్నరు.

నల్లగొండ జైలు కంటే ఎక్కువ వసతులుండే ప్రమోషన్ వచ్చిందని అనుకుంటుండగానే జైలు ఇంకో అధికారి ‘అవును సార్! మీరు డాక్టర్ కదా! తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నోళ్లకు పీడీ యాక్ట్ ఏంది సార్? దొంగలకు, లంగలకు పెట్టే కేసు కదా ఇది’ అని అనంగానే రాజన్న పడుకున్న మంచం, స్పెషల్ రూం, ఒక్కటి సుతా మంచిగనిపియ్యలే. నకిరేకల్ నుంచి నన్ను ఎత్తుకొచ్చిన తర్వాత జరిగిన విషయాలు- 14 మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కలెక్టర్, ఎస్పీ దగ్గరికిపోవడం, కలెక్టర్ తనకు ఏ విషయం తెలియదని, ఎస్పీ సంతకం పెట్టమంటే పెట్టానని ముక్తసరి జవాబు ఇవ్వడం..

‘నమస్తే తెలంగాణ’ పేపర్ అప్పుడు అందింది. నల్లగొండ ఎస్పీ గులాటే -పొడుగు లాఠీ’ అబద్ధాల చిట్టా అంతా చదివిన. 2008 వరకు జనశక్తి, మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొన్నానని, రహస్య కార్యకర్తలకు వైద్యం చేస్తున్నానని,అందుకే రౌడీషీటర్ కేసు నకిరేకల్‌లో ఓపెన్ చేసినమని.

రహస్య కార్యకర్తలకు ఎప్పుడు వైద్యం చేస్తే ఆయన ఎప్పుడు రహస్యంగా చూసిండో? ఇక జనశక్తి, మావోయిస్టు ముచ్చట మాట్లాడుకుందాం. రజాకార్లను మించిన రాజశేఖర్‌డ్డి పాలన. చర్చల పేరు మీద కొత్త ముచ్చటకు తెరలేపి, 2008 దాకా ఏ మావోయిస్టును, జనశక్తిని బతుకనిచ్చిండు.

నల్లమలను నెత్తుటి జల్లెడ చేసి, గోదావరి లోయలో ఊపిరంతా మింగి, బొందల గడ్డ చేసి, పుణ్యం కట్టుకొని బొందలగడ్డకు పోతే, మధ్యన నేను ఏడంగ పోయి, నక్సలైటు కార్యకలాపాలు చేస్తిని?

తెలంగాణ ఉద్యమ ప్రజాక్షేత్రంలో 2001లో టీఆర్‌ఎస్ పుట్టినప్పటి నుంచి… ఒక్కరోజన్న ఖాళీగా ఉన్నానా? ఎంతమంది తెలంగాణ రాష్ట్రసమితి కార్యకర్తల కృషితో ఇవ్వాళ యావత్ తెలంగాణ సమాజం ఒక్కటయింది. ప్రజాసంఘాలు, పార్టీలు, పాటగాళ్లు, విద్యార్థి, ఉద్యోగుల్ని మోపు చేసి నిలబెడితే, నన్ను అరాచకుడిని చేసి, మార్చలేని నేరప్రవృత్తి గల వానిగా పేర్కొంటు జైలుకు పంపారు. పై పనులన్ని నక్సలైట్ పనులేనా? వ్యక్తిగతంగా ఇప్పటికీ, ఎప్పటికీ నా కమిట్‌మెంట్ భూమి, భుక్తి, విముక్తి కోరే ప్రజలతోటే. టీఆర్‌ఎస్ పార్టీ అప్పజెప్పిన పని ఉండగా, నాకు జనశక్తి, మావోయిస్టు కార్యకలాపాలు చెయ్యవలసిన పనిలేదు. ఇంకోపార్టీ పనులు భుజాన వేసుకునేంత భాళీగా టీఆర్‌ఎస్ లేదు.

ప్రజల్ని మిలిటెంట్ తెలంగాణ ఉద్యమంలోకి సమీకరించడం, మావోయిస్టు పనే అయితే కొన ఊపిరిదాకా అదే ఇష్టంగా పనిచేస్తా. ఈ నెల ఎనిమిద వ తేదీ రాత్రి పోలీసోల్లు పొడు‘గు లాఠీ’ అబద్ధపు కథకు విస్తృత రూపంలో ‘గ్రౌండ్స్ ఫర్ ప్రీ డిటెన్షన్’ కాపీ అందజేసిండ్రు. ఆయన చెప్పిన కారణాలు ఎంత పెద్దవోనని తిప్పిచూస్తే, 2007 నుంచి అఖిలపక్షంగా టీడీపీ, సీపీఎం, బీజేపీతో కలిసి కరెంట్, ఎరువుల కొరత, వరికి మద్దతు ధర, పెట్రోలు ధరలు తగ్గించాలని ఇచ్చిన పిలుపులో భాగంగా రాస్తారోకోలు చేసినవే ఎనిమిది ఉన్నాయి. మిగతా పదిలో 2009లో కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్ష సమయంలో ఉత్పన్నమైన ఉద్యమాలలో కక్షగట్టి ఆంధ్ర సీఐ శ్రీనివాసరావు పెట్టిన కేసులు. మొన్న అక్టోబర్ 3న నకిరేకల్ సంఘటన నేపథ్యంలో పెట్టినవే ఉన్నా యి. తెలంగాణ ఉద్యమకారులంతా మావోయిస్టులు కారు. రౌడీషీటర్లు కారు. నేనొక్కడినే గుంటూరు బిడ్డడు కలెక్టర్ ముక్తేశ్వరరావుకు, సీమాంధ్ర ఐజీ, డీజీపీలకు నక్సలైట్ లెక్క, మార్చలేని ఉన్మాద నేరస్తుడిగా కనపడి అద్దమరాత్రి ఎత్తుకుపోయే వానిలాగా అనిపించింది.

పీడీ చరిత్ర చూస్తే అది ఇప్పటిదాకా ప్రజాఉద్యమకారుల మీదనే పెట్టినారని తేలింది. ఆరు రోజులు గడిచాయి. నన్ను తీవ్రంగా బాధిస్తున్న చెవునొప్పి, డయాబెటిస్, అస్తమాతో పాటు కొత్తగా వచ్చిన రక్తపోటు కోసం ఎంజీఎం ఆసుపత్రికి తీసుకువచ్చారు. 10వ తేదీ రాత్రి మందులు, ఇంజెక్షన్లు వేసుకొని పడుకున్నాక డీఎస్పీ, సీఐలు ఇద్దరు వచ్చిండని చెప్పితే పోతే బాగున్నారా అని పరస్పరం పలుకరించుకోవడం, వెంటనే వాళ్లు ఒక కాగితం ఇవ్వడం జరిగింది. ఇది మిమ్మల్ని పీడీ కేసు ఎత్తివేస్తూ, కలెక్టర్ ఇచ్చిన రిలీజ్ అర్డర్ అన్నారు. నిజంగానే ముక్తేశ్వరరావు గారు నా నడవడి, ప్రవర్తన రుజువర్తనగా ఉన్నందున పీడీ కేసును ఉపసంహరించుతూ జైలు సూపరిండెంట్‌కు రాసిన లేఖ తాఖీదు. బయట టీఆర్‌ఎస్, ప్రజాసంఘాలు, హక్కుల సంఘం, కాంగ్రెస్ ఎంపీలు ఒత్తిడి సూపర్‌గా పనిచేసిందని ఉబ్బితబ్బిబ్బయినాను.

తెలంగాణ గురించి ఢిల్లీ నుంచి ప్రకటన వస్తుందని ఎదురుచూస్తుండగానే రివర్స్‌గేర్ ముచ్చట్లు, ఇంకో కాగితం తీసి ఇచ్చారు. మళ్లీ అది కలెక్టర్ ముక్తేశ్వరరావుది. కానీ మీరు ఇప్పుడు ఇంతకంటే జాతికే ప్రమాదం కనుక, మీ ప్రవర్తన యెడల సంతృప్తిని నావద్దే అంటిపెట్టుకొని ‘నాసా’ కింద డిటెన్షన్‌కు ఇస్తున్న ఉత్తర్వు అన్నారు. రెండిటి మీద సంతకం పెట్టించుకొని శ్రద్ధగా చదువుకొమ్మన్నారు.

‘అవర్ గ్లాస్’లో ద్రవాన్ని తిరగేస్తే ఈ చాంబర్ నుంచి ఆ చాంబర్ కు ఎట్లా నిండుతుందో అట్లా పీడీ చాంబర్‌లోకి ‘నాసా’ నిండి కూర్చుంది. ఇప్పుడు నేను భారత జాతీయ భద్రతా చట్టం, నైస్‌గా నాసా కింద డిటెన్షన్ చేయబడ్డ అసాధారణ ఖైదీని.

ఏదైతేనేం పీడీ నుంచి ప్రమోషన్ అనుకోవాలా? ఈ ఫస్ట్‌క్లాస్ మెజిస్టేట్‌కు నాలో ఇంత మార్పు కనిపించి వెంటనే ‘జాతి భద్రతకే గొడ్డలిపెట్టు ఎట్లా అయితిని?

తెలంగాణ ప్రజా క్షేత్రంలో ప్రత్యేక రాష్ట్రం కోసం నిలిచి, గెలిచి విశ్వరూపం ప్రదర్శిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితిలో పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆంధ్రా సర్కార్‌కు, టెన్ జన్‌పథ్‌కు మాటలు మోస్తున్న జాతికి, దశాబ్దం తిరగకముందే శతాబ్దాలకు సరిపోయే సంపద కూడబెట్టుకున్న ఘనాపాటీల జాతికి ముప్పుగా తోచడంలో తప్పులేదు. పీడీ కంటే నాసాతో తెలంగాణ కదర్ ఇప్పుడు నిలబడ్డదని అనుకుంటున్నారు. నేను హాస్పిటల్‌లో ఉండగానే డీజీపీ దినేశ్‌రెడ్డి చెరుకు సుధాకర్‌కు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయి. కాబట్టే జైలుకు పంపామంటాడు. డిటెన్షన్ గ్రౌండ్స్‌లో ఒక్క పదం కూడా ఆ ప్రస్తావన లేదు. ఎందుకింకా మావోయిస్టు బొంకుతో బుకాయిస్తున్నారో వాళ్లు చెప్పాల్సి ఉంది. నల్లగొండ జిల్లాలోనే మరికొంత మందిని ఇవే నల్ల చట్టాలతో లోపల వేయాలని చూస్తున్నారు.

తొట్టతొలి పీడీ కేసు తెలంగాణ ఉద్యమకారులపై నాతోనే మొదలైందనుకుంటే, దాన్ని ఎత్తివేసి నాసా కింద డిటెన్షన్ కొనసాగించి, మొదటి నాసా నిందితున్ని కూడా నన్నే చేసి, ఆంధ్ర సర్కార్ సరికొత్త చీకటి చరిత్రకు తెరలేపింది. తెలంగాణ దుక్కుల్లో హక్కుల మొక్కలు నాటవలసిన అవసరమొచ్చిందని ఆ మధ్య నేను రాసిన మాట, ఇవ్వాళ అర్జెంటుగా అమలుచేయవల్సిన కర్తవ్యం.

పీడీ కేసయితే పొడిపొడిగా అర్థం చేసుకోవచ్చు. కానీ ‘నాసా’కు చాలా గ్రావిటీ ఉంది. అది ఎవరినైనా ఆకర్షించి నిర్బంధించవచ్చు. వరంగల్ జైలులో సేమ్ సెల్‌లో కాంగ్రెస్ సొంత పార్టీ నాయకుడే రాజయ్య కాకపోతే ఇంకెవరో నిర్బంధించబడవచ్చు. ఎమర్జెన్సీలో ఈ ప్రయోగాలన్నీ కాంగ్రెస్ చేసింది. కనుక ఇందిరాగాంధీ కోడలమ్మకు నాసాను విస్తృతంగా, విచక్షణా రహితంగా వాడడం అంత కష్టమైన పనేం కాదు.

2009 డిసెంబర్ 9 ప్రకటన అమ్మగారి పుట్టిన రోజు.

బహుశా 2011 డిసెంబర్‌లో అమ్మగారి పుట్టిన రోజున తెలంగాణ ఇస్తమంటదో, సకల నల్ల చట్టాలనే బహుమానంగా ఇచ్చి పరిహాసం చేస్తదో, అంతా నెల రోజుల ముచ్చటే. జైళ్లో ఉంటే ఉంటం. తెలంగాణపై ఒక్క సానుకూల ప్రకటన వస్తే చాలన్న ఆశ.. నవంబర్ చలిని, దేహంతో కుప్పపోసుకున్న అనారోగ్యాన్ని పక్కకునెట్టి, గరమ్ గరమ్‌గా ఉండేందుకు నాసాను కాదని ‘మీసా’లు మెలేస్తున్నది.

(నమస్తే తెలంగాణ నుండి )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *