ఒంగోలులో జన్మించిన కవి పైడి తెరేశ్ బాబు చాలా కాలంగా తెలంగాణకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రకటన అనంతరం సీమాంధ్రలో జరుగుతున్న పరిణామాలపైన పైడి తెరేశ్ బాబు “విభజన గీత” పేరిట తన ఫేస్ బుక్ వాల్ మీద పేరడీ శ్లోకాలు రాస్తున్నారు. అంతర్జాలంలో అమిత ప్రజాదరణ పొందుతున్న ఆ శ్లోకాలు మిషన్ తెలంగాణ పాఠకుల కోసం:
*****
విభజన గీత-14
రణాన్నినాదోపి కరామి శంఖనాదస్య హేతుబద్ధహ పరిగణనాం
కారణోపి మూలాంచ విస్మరస్య మూలశంకో నాద వినిపిష్యాం
అపార్థా
రణమునకు కారణములు,కారణములకు మూల కారణములు ఆధారములగుచున్నవి.ఇరుపక్షములు కలిగిన రణమునందు మ్రోగు శంఖము సమరశంఖారావమగును. మూలకారణములు విస్మరించి ఏక పక్షముగ మ్రోగు శంఖము మూలశంకా రావమగును [మొలలు మున్నగు వ్యాధి విశేషములతో కూడిన మిక్కిలి బాధాకరంబగు ఆర్తనాదము] కోట్లఖర్చుతో కూడుకొనిన వోట్లవ్యూహములకు మరికొన్ని నెలల వ్యవధి కలదు. కావున జనసమీకరణములు చేయుట మాని విభజన సమీకరణముల గురించి యోచింపుము.పదమూడు జిల్లాల ప్రత్యేక రాష్ట్రము కొరకు పోరాడుము.
హమ్మా నాయనా దేవుడా తండ్రీ [ఇది మూలశంకా నాదము]
***
విభజన గీత-13
ఏకాం హి ద్వయో ఏకహ! ఏకాద్వయో త్రయంబకరాం!
త్రయోదశాంచ ద్వాదశహ! రిమోటాస్త్రాం ప్రయోగామ్యహం !
అపార్థా
రెండు ఒకట్లు ఒకటి యని, ఒక రెండ్లు మూడు యని, మూడు ఒకట్లు పదమూడున్నర యని,పదమూడు ఒకట్లు పన్నెండుంబాతిక యని దేనికి తోచిన కథనము అది ప్రచురణము,ప్రసారము చేయుచున్నది. ఏ పత్రిక,ఏ చానల్ కథనము ఎట్లేడ్చిననూ బకరా వలె నమ్మక, రెండు ఒకట్లు రెండే యను గణిత సూత్రముననుసరించి రెండు రాష్ట్రముల ఏర్పాటు తప్పదను సత్యమును నీవు విశ్వసింపుము. కొన్ని పత్రికలకు, చానళ్ళకు రెండో ఎక్కము కూడా సరిగా రాదను వాస్తవమును మరింత బలముగా విశ్వసించి వాటిపై రిమోటాస్త్రము ప్రయోగించు సమయమాసన్నమైనదని గుర్తించుము.
టంగ్ టంగ్ టంగ్ టట్టంగ్ టంగ్ [ఇది ప్రాధమిక పాఠశాల ఘంఠారావము మరియూ పరమశుంఠా నాదము]
***
విభజనగీత-12
మ్యాచ్చోహి ఫిక్సింగహ కిం కరిష్యోపి జగద్విదితహతహ
తీర్మాణాం అవిశ్వాసపి రక్షతి ప్రతిపక్షాం అనుభవిష్యతి
అపార్థా
గతమున మేసిన దొంగగడ్డి కారణమున, చిప్పకూడు ఎచట తినవలసి రావచ్చునో యను భయము వలన, కేంద్ర, రాష్ట్ర పాలకపక్షముతో లోపాయికారీ మాచ్ ఫిక్సింగులకు పాల్పడి, శాసనసభయందు అవిశ్వాస తీర్మానము వీగిపోవునటులజేసి, ప్రజాకంటక ప్రభుత్వమును కాపాడిన ప్రధాన ప్రతిపక్షము వారే… మాచ్ ఫిక్సింగుల గురించి నేడు విమర్శించుచున్నారు. ఇది చిత్రములలోకెల్ల భళారే విచిత్రము.రథము దిగి కాస్సేపు పగలబడి నవ్వుకొందము. రమ్ము.
అయ్యో కుయ్యో మొర్రో [ఇది అస్తిత్వవేదనా నాదము]
***
విభజన గీత-11
మేఘస్య ఢీం మెరుపంచ జోగీణాం ద్వయం భస్మహ
భజనోపి విభజనేతివ్యతిరేకం మూతస్య దంతహ నష్టహ
అపార్థా
మేఘములు రెండు ఢీ కొన్న మెరుపు రాలును. జోగీ జోగీ రాసుకున్న బూడిద రాలును. భజనా తత్పరత విభజన వ్యతిరేకత ఒకేనోట జాల్వారిన కారణమున మూతిపండ్లు రాలుచున్నవని విశ్వసనీయ వర్గములు ఘోషించుచున్నవి
పిప్పీ పీ! పప్పీ పా !పెప్పెప్పె బెబ్బెబ్బె ![ఇది సన్నాయి నొక్కుల నాదము]
***
విభజన గీత-10
నడిచే రైలోహ్యం స్టాపో శక్తి చైనతి మోటారోం సిగ్నలహ
ప్రాణేతి వెంటిలేటరహ సమైక్యవాదోణాం సెక్యూరిటీ హి
అపార్థా
రైలును ఆపగల శక్తి చైనుకు, మోటారు వాహనములను ఆపగల శక్తి ట్రాఫిక్ సిగ్నళ్ళకు, పోయే ప్రాణములను ఆపగలశక్తి వెంటిలేటర్లకు ఉన్నట్లే సమైక్యవాదులను అడ్డుకోగల శక్తి ఢిల్లీ పెద్దల సెక్యూరిటీ సిబ్బందికి కలదు. వారినే ఒప్పించుట చేతకానివారు పెద్దలను ఒప్పించి విభజనను అడ్డుకుంటామని పల్కుట మిక్కిలి హాస్యాస్పదము
వృం వృం వృం వౄం ం ం [ఇది రివర్సు గేరు నాదము]
***
విభజన గీత-9
[కామిక్ రిలీఫ్ అనబడు ఒక అండర్ కరెంట్ చురక]
స్థలము:- చిరుక్షేత్ర కుగ్రామము
కాలము:- కకావికల అకాల సకాలము
సందర్భము:- గోళగంధరము [వాడుకభాషలో గందరగోళము]
అపార్థుడు:- బావరో[బావ గారూ]
సం గీతాకారుడు:- ఏమైంది సాలే[బామ్మర్దీ]
అ:-బావోయ్
సం:-ఆ గావుకేకలాపి అసలు సంగతేంటో చెప్పు బే
అ:- విభజన విషయమున రథములన్నియు యూ టర్న్ తీసుకుని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ వేపు పరుగులు తీయుచున్నవి
సం:-మాయిరే
అ:-హే ప్రభో
స:- అయ్యారే
అ:- మన రథమును ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వేపు తిప్పుము
సం:- అచటికెందులకు?
అ:- హిమాయత్ నగరు టర్నింగు మూల యందు ఒక శాల కలదు .అచట అన్నిరకముల క్వార్టర్లు [కౌన్సిలర్లు, కార్పొరేటర్లు,ఎంపీటీసీలు,జడ్పీటీసీలు,ఎమ్మెల్యేలు,ఎంపీలు, ఎంసీలూ,బఠాణీలు బాయిల్డుపల్లీలూ గట్రా]సరసమైన ధరలకు లభించును
సం:-[పక్కటెముకలు విరిగేలా పగలబడి నవ్వి] పిచ్చి అపార్థా నీకింకనూ జ్ఞానోదయము కలిగినట్టు లేదు.రథము ఢిక్కీ ఓపెన్ చేయుము
[అపార్థుడు రథము వెనుకకెళ్ళి ఢిక్కీ తెరిచి చూచి, అచట దేశ విదేశీ సరుకుల విశ్వరూపము గాంచి జాగు సేయక వెను వెంటనే కోమా లోకి ప్రవేశించును.నేపథ్యమున సిక్స్ టీ పీస్ ఆర్కెస్ట్రా డాల్బీ సరౌండ్ ధోరణిలో డీటీయస్ కలబోతలో మారుమ్రోగుచుండగా సం గీతాచార్యుడు ఒక సిక్స్ టీ ఎమ్మెల్ నికర నికార్సైన సరుకును అపార్థుడి మోము పై చిలకరించును. ఆ సరుకు తాలూకు పరిమళవిశేషమునకు అపార్థుడు వెన్వెంటనే మేల్కాంచి…]
అ:- హే ప్రభో, మద్యం దిన మార్తాండ తేజా,మద్య ప్రదేశాధీశా , సీసాగ్రామప్రభో,దోస్తో విస్కీ, మార్లన్ బ్రాండో,రం మధు రం [అని తెగ పొగిడి బాత్రూం సింగర్ ధోరణిలో ఇలా పాడును] ముదురాతి ముద్దు రం, మన ఫ్రేము మధువు, గది నిండెనోయీ… దూల తీరెనోయీ…
సం:-[గుంభనగా నవ్వి వామ పక్షమును పైకెత్తి దీవించుచు] రథములన్నియు ఈ మహా చిరుక్షేత్ర కుగ్రామ స్థలికి మళ్ళీ తరలివచ్చి విభజన విషయమై కవ్వింపు చర్యలకు పాల్పడు వరకు బుడ్డి మంతుడవై మసలుకొనుము
అ:- సారే ప్రాభో
***
విభజన గీత-8
అల్పపీడనోపి సముద్రస్య కుయ్యోమొర్రో శోకిష్యతి
ఢిల్లీణాం రిమోటహ తిప్పస్య నల్లాం కిం పీకిష్యతి
అపార్థా
చిన్న అల్పపీడనమునకే ఎంతటి సముద్రమైననూ కుయ్యో మొర్రో అని దిక్కులు పిక్కటిల్లునటుల మొత్తుకొనును. అట్టి సత్యము గుర్తెరుంగక, ఢిల్లీ రిమోటు తిప్పితే గాని గిద్దెడు నీరుగారని ఒక నల్లా[కుళాయి]ఏకముగా తుఫానునే ఆపుదునని పల్కుట హాస్యాస్పద వ్యాఖ్యగాను కొండొకచో ప్రగల్భము గాను భావించబడుచున్నది. ప్రజలను బ్రోచు ప్రభువులే ఇవ్విధమున మాటలాడుట వినాశకాలమును సూచించుచున్నది.
మ్యావ్ మ్యావ్ మెమ్మెమ్మె మేడం మై ఢిల్లీ ఆవూం? [ఇది గోడ మీది పిల్లి నాదము]
***
విభజన గీత-7
భార్యేతి భర్తంచ మధ్యస్య మసీర్హోర్మసి వంటింటిమసి!
ఇరుప్రాంతో సహోదరస్య నిర్భయ నివాస తత్వమసి!!
అపార్థా
భార్యాభర్తల మధ్య ఉండవలసింది ఇంటిమసీ యే గాని వంటింటి మసి కాదు. అట్టివిధముననే ఇరుప్రాంతముల వారిమధ్య ఉండదగినది సోదరభావమే గాని ఉదరభావము [పొట్టగొట్టుట యను వినాశకర భావము] కాదు.ఈ తత్వమును గుర్తెరిగి, ఇప్పుడున్న పరిస్థితులయందు ఒకరికొకరు సహకరించుకొనుట యనునది అత్యంత ఆవశ్యకమగుచున్నది. ఇది గనుక సంభవమైనచో ఏ ప్రాంత వాసులైననూ ఎక్కడైననూ నిర్భయముగా నిశ్చయముగా ఆచంద్రతారార్కము నివసించ వీలగును. ఇది కష్టాదశ పురాణముల సారాంశము.
లలలూ లలలూ! లలల లలల లలలూ!! [అవునూ!!! ఇది ఏమి నాదము?]
***
విభజన గీత-6
తొక్కో తోటకూరస్య పార్లో పిప్పరమెంటస్యచ!
చిప్పోహి చిప్పహ బస్సోపి కొలంబసహ గరీయసి!!
అపార్థా
బసులు సిలబసులు చిప్పులు షిప్పులు మాళ్ళు, రుమాళ్ళు పెరుమాళ్ళు బిట్లు హాబిట్లు ద్రవములు ఉపద్రవములు బాబులు రుబాబులు వాడలు బెజవాడలు పిప్పరమెంట్లు పార్లమెంట్లు ఘనములు జఘనములు సర్వము సకలము నాచే సృజించబడినవి. పదములయందు పేర్లయందు సామ్యమున్నంత మాత్రమున కంప్యూటర్ చిప్ కరకరమని నములు ఆలూ చిప్ కానేరదు.బస్ సిలబస్ గానూ, సిలబస్ కొలంబస్ గానూ మారజాలవు. నీవెంత గోకి గొడవ చేసి పాకి కిందబడి దొర్లాడిననూ ఎదియును మరియొకదానితో ఏకార్ధమును సాధింపజాలదు. కావున ఏకాభిప్రాయ సాధన తొక్కా తొటకూర వంటి పదబంధములను భవబంధములను విడనాడి విభజన దిశగా పయనించి విముక్తుడవు కమ్ము. ఇక కుమ్ము.
పపంప పంప పాం టటంట టంట టాం [ఇది శాక్సోఫోన్ నాదము]
***
విభజన గీత-5
జేబోహి నతి ఔరంగ జేబస్య!బాబోహి కబాబహం!
సమ్యోహయతి సకలజనహ! మిమిక్రీణాం కరామ్యహం!!
అపార్థా
జేబులున్న ప్రతివారూ ఔరంగజేబు కాజాలరు. బాబులగు ప్రతివారూ –కబాబు కాలేరు[పొరపాట్న అశోకబాబు అనుకునేరు] సమ్మెలెన్ని జేసిననూ సకలజనులసమ్మెకు సాటిరావు. పులిని చూసి వాతలు పెట్టుకున్న నక్కలు చిట్టచివరకు వాడవలసినది జాలిం లోషన్, జిందా తిలిస్మాత్ మరియూ జులాబ్ గోలీలు. ఇది తెరవెనుక దాగిన ఉ’పని’శక్తుల సారాంశము
ఎంపీపీ డుం డుం డుం ఎంపీ పీ పీ డుం [ఇవి అమంగళ వాద్య విశేషములు]
***
విభజన గీత-4
పేరెంట్సో జన్మహ పేమెంట్సో విద్యతి! వన్ బై వనేస్య వరసస్య సంభవామి దగే దగే!
ఇంతోహి బతుకు ఇంటెనక మరణస్య! చర్చాప్రహసనన కరిష్యాం జిల్ జిల్ జిగే!!!!
అపార్థా
పేరెంట్స్ వలన జన్మము, పేమెంట్స్ వలన చదువు, చదువు వలన ఉద్యోగము, ఉద్యోగము వలన లంచము, లంచము వలన నేరము, నేరము వలన అరెస్టు, అరెస్టువలన బెయిలు,బెయిలు వలన పునర్జన్మము సంభవమగుచున్నవి. అంతియె కాని ఉద్యోగసంఘముల సమ్మె వలన సమైక్యాంధ్ర సిద్ధించునని ఎచటయునూ లిఖించబడలేదు. ఇంత బతుకు బతికి గృహము వెనుక మరణించినయట్లు… అను సామెతను అనుసరించి ఇంత సమ్మె జేసి సింపుల్ గా సైలెంటై పోవుట పరువుతక్కువ పనిగా భావించబడుచున్నది. కనుకనే ముఖ్యమంత్రితో చర్చలు అను ప్రహసనము రచింపబడుచున్నది. చర్చలు జరుగుట, అవి సఫలమైనవని మీడియా ఎదుట పళ్ళికిలించుట, ఒకవేళ ప్రభుత్వం గనక మాట తప్పితే సమ్మెను ఉధృతం చేస్తామని తాళపత్ర ధ్వనులు[తాటాకు చప్పుళ్ళు] సృష్టించుట సహజాతిసహజం.అనివార్యంబగు ఇట్టి లత్తుకోరు చేష్టలను గాంచి నీవు చింతింపతగదు. పండగ చేసికొనుము.
టిటిటిటిటీం టుట్టూం టుయ్యూం [ఇది విచిత్ర వీణానాదము]
***
విభజన గీత-3
చంచలోగూడస్య చర్లపల్లిహి! గుణపాఠో నేర్పిష్యతి!
ఏకాంగ్రేసోపి ఎదిరిష్యతి !చార్గిషీటో శరణం దుర్గతి!!
అపార్థా
కాంగ్రెస్ పార్టీని ఎదిరించిన వారికి ఎట్టి దుర్గతి సంభవించునో చంచల్ గూడ చర్లపల్లాది జైళ్ళు వివరించుచున్నవి. అధిష్ఠానమును ధిక్కరించి రాజీనామాలు చేసినవారికి చార్జిషీట్లు తప్పవని సీబియయ్యాది సంస్థలు నిరూపించుచున్నవి. నాకుట, పీకుట, శవాలపై చిల్లర ఏరుకొనుట తప్ప ఇతరములెరుగని కీలుబొమ్మలు రాజీనామాలు చేయుట, స్పీకర్ని కలియుట వంటివి ఒఠ్ఠి బోగస్ విషయములుగా నీవు గుర్తింపవలయును. మీడియా ముందు వారు వేయు కుప్పిగంతులను నీ వినోదార్థము ప్రదర్శించు నాటకములుగా భావించి సంతసింపుము
భొయ్ భొయ్ భొయ్ భోయ్ య్ య్ య్ [ఇది తీర్థపు తడి ఎరుగని సమైక్య శంఖారావం]
***
విభజన గీత – 2
కోతోహి చింపాంజీ నక్కస్య గోతో! మంత్రామ్యహి ముఖ్యోతి!
జీవస్య ఎంజీవం ద్రోహోర్మహి!బిల్లేచ పాసేణ ఢిల్లీ చిల్లీశ్యతి!!
అపార్థా
కోతులయందు చింపాంజీ, నక్కలయందు గోతికాడ నక్క, నాయకులయందు ఎంజీవో నాయకుడు, మంత్రులలో ముఖ్యమంత్రి, ద్రోహులయందు తెలంగాణ వ్యతిరేకి ఉత్తములుగా కీర్తింపబడుదురు. అట్టివారిని జూచి నీవు చింతింపవలదు. బిల్లు వచ్చుట ఖాయము. పాసగుట తధ్యము. లేనిఎడల ఢిల్లీ ఛిల్లీ యగుట నిక్కము.
పిపిపిపిపీ ఫ్యూం [ఇది వేణు నాదము]
***
విభజన గీత – 1
“బల్బో బస్సాహి సమ్మ్యామ్యహం
దీక్షో భగ్నాయ వినిర్గతీ!!!”
అపార్థా…
ఆరే ప్రతి బల్బు వెలగక తప్పదు
ఆగే ప్రతి బస్సు కదలక తప్పదు
జరిపే ప్రతి సమ్మె ఆపక తప్పదు
చేసే ప్రతి దీక్ష భగ్నం కాక తప్పదు
ఇవన్నియు ఢిల్లీ వలననే సంభవించుచున్నవి
టీ టిటిటి ట్యూం టుయ్ [ఇది వీణా నాదము]