తాము 24 క్యారెట్ల ప్రజాస్వామికవాదులం అని లోక్ సత్తా మంద ఎంతనైనా గొంతు చించుకోవచ్చు కానీ వారు ఉట్టి సత్తు రేకులేనని మరోసారి నిరూపితమయ్యింది.
తెలంగాణ విషయంలో రెండు కళ్ల సిద్ధాంతం ప్రకటించిన తెదేపా, కాంగ్రెస్ పార్టీలను అవకాశవాద పార్టీలని నాగభైరవ జయప్రకాశ్ నారాయణ ఎన్నోసార్లు తిట్టిపోశాడు. ఈ అంశంపై ఎవరికీ లేని క్లారిటీ మాకే ఉంది, తాము ప్రాంతాల మధ్య తగువులు పెట్టే రకం కాదని చెప్పుకొచ్చాడాయన.
తెలంగాణ వస్తే అద్భుతాలు జరగవు, ఉపద్రవమూ రాదు అంటు ఆకుకు పోకకు అందని కొత్త సిద్ధాంతాలు ప్రవచిస్తుంటాడు ఎన్.జె.పి. తెలంగాణ విషయంలో తెదేపా, కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ ల వైఖరితో పోలిస్తే లోక్ సత్తా వైఖరి భిన్నమైనది కాదని తెలంగాణ ప్రజలు ఎప్పుడో గమనించారు.
లోక్ సత్తా పార్టీలో మొత్తం సీమాంధ్ర ఆధిపత్యం స్పష్టంగా కనపడుతుంది. ఆ పార్టీకి అడ్వైజర్ గా ఉన్న సి. నరసింహారావు అనే వ్యక్తి విశాలాంధ్ర ఉద్యమం నడుపుతూ తెలంగాణపై అవాకులు చవాకులూ పేలుతున్నా నాగభైరవుడు ఆయననను నియంత్రించడు. [Read: పచ్చి అబద్ధం ఆడి అడ్డంగా దొరికిన సి. నరసింహారావు]
పైకి మాత్రం తమ పార్టీ తెలంగాణకు వ్యతిరేకం కాదని తీయని పలుకులు చెప్పే నాగభైరవ జయప్రకాశ్ నారాయణ లోపల ఉన్నది మాత్రం పచ్చి సమైక్యవాది అని ఆయన పార్టీ శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చిన రిపోర్టు చదివినా, ఆయన తెలంగాణ డిమాండ్ పై రాసిన రాతలు చదివినా ఇట్టే అర్థం అవుతుంది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటూ చేసిన డిసెంబర్ 23, 2009 ప్రకటన ఈయన చలవేనని తెలంగాణ ప్రజలు ప్రగాఢంగా నమ్ముతున్నారు.
తెలంగాణ విషయంలో నాగభైరవుడి ద్వంద్వ ప్రమాణాలు చూసి విరక్తి చెంది అనేక తెలంగాణ జిల్లాల్లో నాయకులు, కార్యకర్తలు పార్టీని వీడారు. కొందరైతే ఏకంగా తెలంగాణ లోక్ సత్తా అనే పార్టీనే ఏర్పాటు చేసుకున్నారు.
సకల జనుల సమ్మె సమయంలో లోక్ సత్తా నిజామాబాద్ శాఖ వారు సమ్మెకు మద్ధతు గా ఒక బ్యానర్ ఏర్పాటు చేస్తే మేం ఆ రోజే నిలదీశాం తెలంగాణపై మీ పార్టీ కూడా ప్రాంతానికో వైఖరి తీసుకుంటుందా అని. దానికి లోక్ సత్తా సభ్యులు కొందరు “అబ్బే మేం ఆ టైపు కాదు. ఆ బ్యానర్ రాసిన వాళ్ళు తెలియక అలా చేశారు. మేము తటస్థం”. అని చిలకపలుకులు పలికారు. [Read: Is JP Just Another Political Chameleon?]
ఇప్పుడు లోక్ సత్తా వరంగల్ శాఖ వారు రైతుల సమస్యలపై ముద్రించిన కరపత్రం చూడండి. దానిపై స్పష్టంగా “జై తెలంగాణ” అని రాసి ఉంది. మరి గుంటూరు జిల్లా కరపత్రంలో “జై సమైక్యాంధ్ర” అని ఉంటుందో లేదో మనకు తెలియదు.
ప్రాంతానికో పాట పాడుతూ ప్రజాస్వ్యామ్య మౌలిక సూత్రాలకు విరుద్ధంగా ప్రవర్తించే ఈ పార్టీ, రాజకీయాలను ప్రక్షాలన చేస్తుందనుకుంటే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్టే.