mt_logo

ఈ వర్షాకాలంలోనే కాళేశ్వరం నీళ్ళు- కేసీఆర్

నర్సాపూర్ లో జరిగిన మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గ బహిరంగసభకు ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్ రావు హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలోనే నంబర్ వన్ మెజార్టీతో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గెలవబోతున్నారని, ఇటీవలి మెదక్ అసెంబ్లీ ఎన్నికల్లో 10 కి 9 స్థానాలు గెలిపించారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి. భారతదేశం కూడా మంచి మార్గంలో నడవాలి. నేను కూడా ఈ మట్టిలో పుట్టిన బిడ్డనే. ఈ వర్షాకాలంలోనే కాళేశ్వరం నీళ్ళు మనకు రాబోతున్నాయి. అవి వస్తే జిల్లాలో అద్భుతం జరగబోతుంది. మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్, సింగూరు ప్రాజెక్టులన్నీ కాళేశ్వరం నీళ్ళతో నిండుతాయి.

మెదక్ జిల్లాలో ఇప్పటికే 11 చెక్ డ్యాంలు మంజీరా నది మీద, రెండుమూడు హల్దీ నది మీద శాంక్షన్ అయ్యాయి. వాటి పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. మంజీరా నది మెదక్ జిల్లాకు దేవుడిచ్చిన ప్రకృతి సంపద. కానీ సమైక్య రాష్ట్రంలో సింగూరు ప్రాజెక్టును హైదరాబాద్ కు అప్పజెప్పి మన నోరు కొట్టారు. నర్సాపూర్ కు మల్లన్నసాగర్ నుండి కాళేశ్వరం నుండి మెదక్, మిగతా ఐదు నియోజకవర్గాలకు లక్ష ఎకరాలకు తగ్గకుండా నీళ్ళు వస్తాయి. రాబోయే కొద్ది రోజుల్లోనే మెదక్ జిల్లా సస్యశ్యామలం కానుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

పెద్దపెద్ద మాటలు మాట్లాడే మోదీ రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంట్ లేదని, రైతు బంధు, రైతు బీమాలో 25 శాతం ప్రధాని కూడా కాపీ కొట్టారన్నారు. ఇతర రాష్ట్రాలు కూడా తెలంగాణ పథకాలను అమలు చేస్తున్నాయి. మోడీ, రాహుల్ ఇద్దరూ ఒకర్నొకరు తిట్టుకోవడం తప్పితే దేశానికి చేసిందేమీ లేదన్నారు. ఇందిరాగాంధీ నుండి రాహుల్ గాంధీ వరకు గరీబీ హఠావో అనే నినాదం వినిపిస్తున్నారని, అదే స్లోగన్ తప్పితే దేశంలో గరీబులు మాత్రం అంతే ఉన్నారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. దేశం గతి గమనం మారాలి. అందుకే 16 మంది టీఆర్ఎస్ ఎంపీలను గెలిపిస్తే ఢిల్లీలో కీలకపాత్ర పోషించవచ్చు. మెదక్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిని నియోజకవర్గానికి లక్ష తక్కువ కాకుండా అన్ని నియోజకవర్గాలు భారీ మెజార్టీతో గెలిపించాలని సీఎం ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *