mt_logo

నాకొక స్వప్నం ఉంది!

By: కొణతం దిలీప్

అక్టోబర్ 15, 2011

అగ్రరాజ్యపు అధికారపీఠం కాపిటల్ హిల్ ప్రాంగణం నుండి ఖంగున మోగుతున్న మాభూమి సంధ్యక్క గొంతు అటు యూనియన్ స్టేషన్ నుండి ఇటు కాన్స్టిట్యూషన్ అవెన్యూ వరకూ ప్రతిధ్వనిస్తున్నది.

“జై తెలంగాణ” నినాదాలతో వాషింగ్టన్ డిసీ వీధులు మార్మోగిపోతుంటే …

ఆ ఉద్వేగం మాటల్లో చెప్పలేనిది.

ఎక్కడ తెలంగాణ?

ఎక్కడ వాషింగ్టన్?

అక్కడ సకల జనులూ నభూతో అన్నట్టుగా సమ్మెకట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను గడగడలాడిస్తున్న వేళ, మేము సైతం అంటూ అమెరికాలో ఉంటున్న తెలంగాణ బిడ్డలు “చలో వాషింగ్టన్ డిసీ” కార్యక్రమం చేపట్టారు.

న్యూయార్క్, న్యూజెర్సీ, డెట్రాయిట్, అట్లాంటా, ఫిలడెల్ఫియా, వర్జీనియా, మేరీల్యాండ్…ఇలా అనేక ప్రాంతాల నుండి తరలివచ్చిన వందలాది తెలంగాణ ఎన్నారైలు వాషింగ్టన్ వీధుల్లో కదన కవాతు నిర్వహించారు. దిక్కులు పిక్కటిల్లేలా జై తెలంగాణ నినాదాలు చేశారు.-

ఎంత వైచిత్రి!

స్వరాష్ట్రంలోనేమో అంతులేని నిర్బంధకాండ. పరాయిదేశంలోనేమో అవధులులేని నిరసనా స్వేఛ్ఛ!

ఇవ్వాళ తెలంగాణలో ఎటువంటి పరిస్థితి ఉన్నది?

హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న గన్ పార్కులో అమరవీరుల స్థూపానికి ఒక పూలదండ వేసే స్వేఛ్ఛ కూడా తెలంగాణ పౌరులకు లేదు.

గన్ పార్క్ అమరవీరుల స్థూపం చుట్టూ పోలీసులు ముళ్లకంచెలు వేసి దిగ్బంధనం చేస్తే మానవ హక్కుల కమీషన్ ను ఆశ్రయించి ఆ ముళ్లకంచెలను తొలగించుకోవాల్సి వచ్చింది.

ఇదీ సమైక్య రాష్ట్రంలో మనకున్న స్వేఛ్ఛ!

తెలంగాణ ప్రాంతానికే పెద్ద పండుగ అయిన బతుకమ్మను భాగ్యనగరపు నడిబొడ్డున ఉన్న ట్యాంక్ బండుపై ఆడుకునే హక్కు లేదు.

గత రెండేళ్లుగా తెలంగాణ జాగృతి సంస్థ హైకోర్టులో పిటీషన్ వేసి మరీ ట్యాంక్ బండు పై బతుకమ్మ పండుగ నిర్వహించేందుకు అనుమతి తీసుకుంటోంది.

ఇదీ మన సంస్కృతికి పట్టిన దుర్గతి!

ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల్లో సభ జరుపుకుందామంటే పోలీసులు అనుమతి నిరాకరిస్తారు. కోర్టుకు అప్పీలు చేసుకుంటే షరతులతో అనుమతులు ఇస్తాయి కోర్టులు. ఎట్లాంటి షరతులవి? మీటింగుకు గుర్తింపు కార్డులున్న విద్యార్ధులను మాత్రమే అనుమతిస్తారట, ఫలానా సమయం వరకు మీటింగు ముగియాలట. ఇంకొక అధికారైతే ఏకంగా “నినాదాలు చేయకూడదు” అని ఆర్డర్ పాస్ చేస్తాడు.

హైదరాబాదులో ఏదైనా ఆందోళనా కార్యక్రమాలు పెట్టుకుంటే, ఏకంగా హైదరాబాదుకు బస్సులు, రైళ్లు రద్దు చేస్తారు. రోడ్డుపై చెక్ పోస్టులు పెట్టి ముప్పై యేళ్లలోపు యువతీ యువకులను హైదరాబాదుకు కూడా వెళ్లనివ్వరు.

ఎటువంటి ఫాసిస్టు పాలన ఉందివ్వాళ తెలంగాణలో?

ఉద్యమంలో భాగంగా పాటలు పాడినందుకు నేర్నాల కిషోర్ వంటి గాయకులను అరెస్ట్ చేసి వళ్లంతా హూనం చేస్తారు. ఒక మంత్రి ఇంటి ముందు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నందుకు డాక్టర్ యాకూబ్ రెడ్డిని మళ్లీ లేవకుండా జీవచ్చవంలా మార్చేస్తారు. నోరెత్తితే ఎన్ కౌంటర్ చేస్తామని బెదిరిస్తారు.

పౌరహక్కుల మాట దేవుడెరుగు మన ప్రజా ప్రతినిధులకు కనీసం రాజీనామా చేసే హక్కు కూడా లేదీ సమైక్య రాష్ట్రంలో.

ఈ నేపధ్యం నుండి అమెరికాకు వచ్చిన నాకు ఇక్కడ కాపిటల్ హిల్ ముందు ఇంతమంది తెలంగాణవాదులు మార్చ్ లో పాల్గొంటుంటే, దిక్కులు పిక్కటిల్లేలా జై తెలంగాణ నినాదాలు చేస్తుంటే, అధికార పీఠం అయిన కాపిటల్ హిల్ ముందే తెలంగాణ ధూంధాం జరుపుకుంటుంటే, ఆశ్చర్యం కలిగింది…

అగ్రరాజ్యపు విధానాలను అనుక్షణం విమర్శించే నేను కూడా ఈ దేశంలో ప్రజలకున్న ప్రాధమిక హక్కులను చూసి అబ్బురపడక తప్పలేదు.

***

నా ఆలోచనలు ఈ దేశంలో హక్కుల ఉద్యమాలవైపు మళ్లాయి.

48 ఏళ్ల క్రితమిదే వాషింగ్టన్ నగరంలో ఒక మహత్తర సన్నివేశం ఆవిష్కృతమయ్యింది

ఆగస్ట్ 28, 1963

స్వేచ్చ, సమానత్వం కొరకు లక్షలాది నల్ల జాతీయులు వాషింగ్టన్ లో ఒక మార్చ్ నిర్వహించిన రోజది. ఆనాడు వచ్చిన అశేష జనావళిని ఉద్దేశించి నల్ల జాతి సూరీడు మార్టిన్ లూధర్ కింగ్ జూనియర్ ఒక చారిత్రాత్మక ప్రసంగం చేశాడు. ఆనాడాయన అన్న మాటలు ఇవ్వాళ తెలంగాణ పరిస్థితికి సరిగ్గా సరిపోతాయి.

రాజ్యాంగ నిర్మాతలు తమ పౌరులందరికీ ఇచ్చిన సమాన హక్కులను నల్ల జాతీయులకు అందించడంలో అమెరికా విఫలమయ్యిందని, హక్కుల హామీ పత్రం ఒక చెల్లని చెక్కు అయ్యిందని ఆనాడు మార్టిన్ లూథర్ కింగ్ అన్నాడు.

ఇవ్వాళ తెలంగాణ ప్రజలూ అదే అంటున్నారు కదా?

ఆనాడు రక్షణలు కల్పిస్తామని బాసలు చేసి తెలంగాణను కలుపుకున్న పెద్ద మనుషులు, ఆ ఒప్పందంపై సంతకాల తడి ఆరక ముందే దాన్ని తెలంగాణ ప్రజల పాలిట చెల్లని చెక్కుగా మార్చారు కదా?

ఆ రోజు మార్టిన్ లూధర్ కింగ్ ఒక హెచ్చరిక కూడా చేశాడా వేదికపైనుండి. సమస్యను ఉపేక్షిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, స్వేఛ్ఛ, సమానత్వం సాధించే వరకూ నీగ్రోలు విశ్రమించరని, 1963 అంతం కాదని, అదొక ఆరంభమని అన్నాడాయన. ఏదో కడుపులో ఉన్న ఆవేశం వెళ్లగక్కిన ఈ నీగ్రోలు ఇక చల్లబడతారని భావించరాదనీ, సమస్య ఏమీలేదనుకుని యధాతధ స్థితిని కొనసాగించే ప్రయత్నం చేస్తే అది పొరపాటవుతుందని, నీగ్రోలకు తగిన హక్కుల కల్పించే వరకూ అమెరికాలో ప్రశాంతత అనేదే ఉండదని, తమకు న్యాయం జరిగేంతవరకూ ఈ విప్లవం తాలూకు సుడిగాలులు ఈ దేశపు పునాదులను కదిలిస్తూనే ఉంటాయని ఆయనానాడు హెచ్చరించాడు.

ఇవ్వాళ తెలంగాణ కూడా అదే చెప్పదలుచుకుంది భారత ప్రభుత్వానికి.

ఉద్యమం చేసి చేసి అలసిపోయి ఇక్కడి ప్రజలు చల్లబడతారని భావించరాదు, సమస్య ఏమీలేదనుకుని యధాతధ స్థితిని కొనసాగించే ప్రయత్నం చేస్తే అది పొరపాటవుతుంది. తాయిలాలకు లొంగిపోయే నాయకులుండొచ్చు, కానీ ఇది కనీవినీ ఎరుగని ప్రజా ఉద్యమం. రాష్ట్ర సాధన వరకూ విశ్రమించరు తెలంగాణ ప్రజలు. లక్ష్యం సిద్దించేంతవరకూ ఈ ఉద్యమ సుడిగాలులు ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్నీ, అటు కేంద్ర ప్రభుత్వాన్నీ వణికిస్తూనే ఉంటాయి.

***

మాతృభూమికి వేల కిలోమీటర్ల దూరంలో ఉండి కూడా అనుక్షణం తెలంగాణనే తపిస్తున్న తెలంగాణ ఎన్నారైలను చూస్తుంటే కొండంత నమ్మకం కలిగింది నాకు. సుధీర్ కోదాటి, సుభాష్ చంద్ర, మధు రెడ్డి, విప్లవ్ రెడ్డి, శ్రీనివాస్ పాల్తేపు, రవి మేరెడ్డి, హరి మారోజు, నారాయణ స్వామి, జమున పూస్కూరు, జగదీశ్ బొందుగుల, విజయ్ కృష్ణ చాట్ల, జయప్రకాశ్ తెలంగాణ… ఒక్కరా ఇద్దరా?

తెలంగాణ పాట పాడేదొకరు…
తెలంగాణ బొమ్మ వేసేదింకొకరు…
తెలంగాణ ఉద్యమానికి చేదోడు వాదోడుగా కొందరుంటే,
రేపటి తెలంగాణ ఎలా ఉండాలో ప్రణాళిక రచించేవారు ఇంకొందరు.

అనునిత్యం తెలంగాణను స్వప్నిస్తూ, రాష్ట్రోద్యమంలో చాలా చురుకుగా పాల్గొంటూ, ప్రతిదశలోనూ నిర్మాణాత్మక సూచనలిస్తూ కన్నతల్లి రుణం తీర్చుకుంటున్నరు తెలంగాణ భూమిపుత్రులు.

ఆనాడు ప్రొఫెసర్ జయశంకర్, ప్రొఫెసర్ బియ్యాల జనార్ధనరావు గార్లు అమెరికాలో నాటిన తెలంగాణ ఆలోచనల బీజాలు, ఉద్యమ మొలకలై, మొక్కలై, పుష్పిస్తే …ఆ సప్తవర్ణాల పువ్వులే ఇవ్వాళ ఇరవై పైచిలుకు అమెరికన్ నగరాల్లో బతుకమ్మలైనయి.

గోరెటి వెంకన్న, అందెశ్రీల గొంతుల నుండి జాలువారిన తెలంగాణ జానపదాలు, ఉద్యమ పాటలు అటు లాస్ ఏంజెల్స్ నుండి ఇటు న్యూయార్క్ వరకూ అమెరికన్ నగరాల్లో తెలంగాణ గుండె చప్పుళ్లయినయి.

ఆంధ్రప్రదేశ్ లోనే కాదు అమెరికాలో కూడా ఇప్పుడు తెలంగాణనే మెయిన్ స్ట్రీం!

మార్టిన్ లూధర్ కింగ్ అన్న ఇంకొన్ని మాటలు తెలంగాణకు అన్వయించుకుంటే:

ఇవ్వాళ నాకొక స్వప్నం ఉంది.

ఏదో ఒక రోజు ఈ ఆగాధాలు పూడ్చివేయగలమని, ఈ పర్వతాలను పిండి చేయగలమని, ఈ ఎగుడుదిగుళ్లను సమతలం చేయగలమని, ఈ వంకరటింకరలను సరిచేయగలమని…

ఇదే నా నమ్మకం. ఈ నమ్మకంతోనే నేను (స్వదేశానికి) తిరిగివెళ్తున్నాను. కళ్లెదురుగా ఉన్న నిరాశా పర్వతం నుండి ఒక ఆశా శిలను చెక్కుకోవాల్సింది ఈ నమ్మకంతోనే. మన ఉద్యమంలో ఉన్న రణగొణ ధ్వణులను ఒక చక్కని స్వర సమ్మేళనంగా మార్చుకోవాల్సింది ఈ నమ్మకంతోనే. మనం కలిసి పనిచేయగలుగుతాం, కలిసి ఉద్యమించగలుగుతాం, కలిసి జైలుకైనా వెళతాం, స్వేఛ్ఛ, స్వతంత్రం కొరకు కలిసి నిలబడగగలుగుతాం…

ఏదో ఒకనాడు మనం రాష్ట్రం సాధించుకోగలుగుతాం…

నాకొక స్వప్నం ఉంది!
నా తెలంగాణ రైతన్నల పొలాలు కృష్ణ, గోదావరి జలాలతో తడిసిముద్దయ్యే రోజు వస్తుందని…
నా తెలంగాణ ప్రజలు ఫ్లోరిన్ గరళం నుండి విముక్తి పొందే రోజు వస్తుందని…
నా సింగరేణి, ప్రజల పాలిట బొందలగడ్డ కాకుండా సిరులు పంచే రోజు వస్తుందని…
అటు ఖమ్మం నుండి ఇటు అదిలాబాదు వరకూ, హైదరాబాదు గుండెకాయగా,
పది జిల్లాలతో తెలంగాణ స్వరాష్ట్రమై విలసిల్లుతుందని!

అవును నాకొక స్వప్నం ఉంది!

జై తెలంగాణ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *