విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్ జీ ఆదివారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో విప్రో సంస్థల గురించి, నగరంతో తనకున్న అనుబంధం గురించి అజీమ్ సీఎం కేసీఆర్ కు వివరించారు. తెలంగాణలో విప్రో సంస్థలను విస్తరించనున్నట్లు అజీమ్ ప్రేమ్ జీ చెప్పారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఐటీ, పారిశ్రామిక రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రాన్ని వేదికగా మార్చుతామని, హైదరాబాద్ నగరాన్ని ఐటీ, పరిశ్రమలకు ముఖ్య కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.
పరిశ్రమలకు అనుమతి ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే సింగిల్ విండో విధానాన్ని ప్రారంభిస్తుందని, అవినీతిరహితమైన విధానాన్ని ఏర్పాటు చేసి స్వయంగా ముఖ్యమంత్రి కార్యాలయమే పర్యవేక్షిస్తుందని కేసీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ నగరాన్ని 4జీ, వైఫై నగరంగా మారుస్తున్నామని, ప్రతిష్టాత్మకమైన ఐటీఐఆర్ ప్రాజెక్టును ప్రజలకు పూర్తిగా అందుబాటులోకి తేవడానికి తెలంగాణ ప్రభుత్వం ముందుంటుందని సీఎం చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం, విప్రో కలిసి పనిచేసే అంశాలపై మరోసారి సమావేశమై చర్చిద్దామని కేసీఆర్ ప్రేమ్ జీతో అన్నారు. ఈ సమావేశంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీష్ రావు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.
